Thursday, April 25, 2024

కొవిడ్ మూలాల డేటా పంపకంలో పారదర్శకత అవసరం

- Advertisement -
- Advertisement -

చైనాకు డబ్లుహెచ్‌ఒ అభ్యర్థన

జెనీవా : 2020లో వుహాన్ మార్కెట్ లో కొవిడ్ 19 మహమ్మారి మూలాల నమూనాలు సేకరించినప్పటికీ బాహ్య ప్రపంచానికి తెలియజేయకుండా ఆ డేటాను దాచిపెట్టడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనాను తీవ్రంగా విమర్శించింది. కొడిడ్ మూలాలకు సంబంధించి కీలక సమాచారం బయటపెట్టి ఉంటే అది అందరికీ తెలిసేదని పేర్కొంది. ఈ విషయంలో పారదర్శకంగా ఉండాలని, ఇంతవరకు నిర్వహించిన పరిశోధనల ఫలితాలు అందరితో పరస్పరం పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనాకు సూచించింది.

సెంట్రల్ చైనా వుహాన్ నగరం లోని హునాన్ మార్కెట్ కరోనా మహమ్మారికి కేంద్రంగా ఉండేది. అక్కడి మూలాల నుంచి సార్స్‌కొవిడ్ 2 వైరస్ వుహాన్ లోని ఇతర ప్రాంతాలకు 2019 ఆఖరున వేగంగా వ్యాపించింది. ఆ తరువాత మిగతా ప్రపంచానికి వ్యాపించింది. “ కొవిడ్ 19 మూలాలకు చెందిన అధ్యయనంలో ప్రతి అంశం అంతర్జాతీయ సమాజంతో తక్షణం పంచుకోవలసి ఉంటుంది. ఈ డేటా మూడేళ్ల క్రితమే తప్పనిసరిగా పంచుకోవలసి ఉండేది ” అని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రెయెసస్ శుక్రవారం జెనీవాలో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. “ ఇకనైనా పారదర్శకంగా ఉండాలని, డేటాను పంచుకోవాలని అవసరమైన పరిశోధనలు నిర్వహించాలని, ఫలితాలు పంచుకోవాలని చైనాను అభ్యర్థించడం తాము కొనసాగిస్తాం.

ఈ మహమ్మారి ఎలా నైతికంగా, శాస్త్రీయంగా మిగిలి ఉందో అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత మిగిలి ఉంది.”అని ఆయన అన్నారు. జిఐఎస్‌ఎఐడి (గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా డేటా) డేటా బేస్‌లో గత జనవరిలో ప్రచురించిన డేటాపై అందరికీ అవగాహన కల్పించేందుకు మళ్లీ ఇటీవల తీసుకుని వెల్లడించినట్టు గత ఆదివారం టెడ్రోస్ వివరించారు. ఆన్‌లైన్‌లో ఉండేఈ డేటాను అనేక దేశాల శాస్త్రవేత్తలు స్వీకరించి విశ్లేషించారని చెప్పారు. ఎప్పుడైతే ఈ డేటా గురించి తెలుసుకున్నామో అప్పుడే చైనీస్ సిడిసి తో సంప్రదించామని, ప్రపంచ ఆరోగ్యసంస్థతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమాజంతో డేటా పంచుకోవాలని, అప్పుడే సమగ్రంగా విశ్లేషించడమౌతుందని అభ్యర్థించామని టెడ్రోస్ పేర్కొన్నారు.

మంగళవారం ఈమేరకు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజిన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్ (ఎస్‌ఎజిఒ) నిపుణులతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సమావేశమైందని చెప్పారు. ఇంతవరకు పరిశోధించిన వివరాలు సాగో (ఎస్‌ఎజిఒ)కు సమర్పించాలని చైనీస్ సిడిసి పరిశోధకులను, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమాజాన్ని అభ్యర్థించామని తెలిపారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఎలా పుట్టిందో అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాచారం ఈ డేటా వల్ల లభ్యం కాలేదని చెప్పారు. ఆ సమాధానానికి చేరువ కాడానికి డేటా లోని ప్రతి అంశం ముఖ్యమేనని స్పష్టం చేశారు. వుహాన్ మార్కెట్ పరిసరాల్లో విక్రయించిన రాకూన్ కుక్కల నుంచి ఈ వైరస్ వ్యాపించిందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించినట్టు న్యూయార్క్‌టైమ్స్ వెలువరించింది. ఈ కొత్త డేటా అంతర్జాతీయ శాస్తవేత్తల నుంచి చైనా పరిశోధకులు సేకరించినప్పటికీ, ఆ తరువాత పరిణామాల క్రమంగా జిఐఎస్‌ఎడి నుంచి ఆ వివరాలే మాయమయ్యాయి.

మూడేళ్ల తరువాత కొవిడ్ కారణంగా 68,73,400 మంది మరణించినట్టు తేలింది. అయితే అసలు మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని తమకు తెలుసని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రజారోగ్య పరంగా కొవిడ్ అత్యవసర పరిస్థితి ఈ ఏడాది ముగిసి పోతుందన్న నమ్మకం ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే ఇంకా ఆ స్థాయికి రాకున్నప్పటికీ ఇంకా ఐదు వేల వరకు కొవిడ్ మరణాలు నమోదౌతున్నాసరే వాటిని నివారించవచ్చని, సరైన చికిత్స అందించవచ్చన్న నమ్మకం ఉందన్నారు. కరోనా మహమ్మారి అంతంపై ఆశాభావం ఎంతో పెరుగుతున్నా, అది ఎలా ప్రారంభమయ్యిందన్నది ఇంకా జవాబులేని ప్రశ్నగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News