Home రాష్ట్ర వార్తలు 15లోపు జిల్లాలపై నోటిఫికేషన్?

15లోపు జిల్లాలపై నోటిఫికేషన్?

Telangana-State తెరమీదికి శంషాబాద్ జిల్లా,  సిరిసిల్ల, జనగాం, నిర్మల్‌కు నో

మన తెలంగాణ/ హైదరాబాద్: నూతన జిల్లాల కసరత్తు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తొలుత మూడు జిల్లాలు చేయాలని భావించినప్పటికీ, తాజాగా నాలుగు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శంషాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ నియోజకవర్గాలు శంషా బాద్ జిల్లాలో కొనసాగనున్నాయి. సిరిసిల్ల, జనగాం, నిర్మల్ జిల్లాలపై ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ఈ మూడింటిని ఖరారు చేస్తే సంఖ్య పెరగడంతో పాటు జిల్లాల పరిధి తగ్గుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటున్నారు. సాధారణంగా కొత్త జిల్లాల ఏర్పాటు లేదా పునర్విభజన ప్రక్రియకు 45 నుంచి 60 రోజుల వ్యవధి తీసుకుంటుంది. అక్టోబర్ 11వ తేదీ (విజయ దశమి)న కొత్త కలెక్టర్ కార్యాలయాలు ప్రారం భించాల్సి ఉన్నందున ఆగస్టు 15వ తేదీలోపు నోటిఫి కేషన్ జారీ చేయాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తార నేదానిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానున్నది. హారితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మొదలు కిందిస్థాయి అధికారి వరకు అందరూ నిమగ్నమై ఉన్నం దున జిల్లాలపై రెండు వారాలుగా ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదు. ఆగస్టు మొదటి వారంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల నుంచి అభి ప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలనే యోచన లో ప్రభుత్వం ఉంది. ఆ వెనువెంటనే నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. జిల్లాల తో పాటు మండలాలను పునర్విభజన చేయనున్నారు.

హైదరాబాద్ జిల్లాలో రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను విలీనం చేయవద్దని ప్రజా ప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలు అభ్యంత రాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని రియల్టర్లు పట్టుబడుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండా పూర్, నానక్‌రాంగూడ, రాయదుర్గ ప్రాంతాలను లక్షం గా చేసుకుని గత టిడిపి హయాంలో హైటెక్ సిటీ అభివృద్ధి చేశారని, శంషాబాద్ జిల్లాను ప్రకటిస్తే మూడు నియోజకవర్గాలతో పాటుగా సమీపంలోని షాద్ నగర్ (మహబూబ్‌నగర్ జిల్లా) నియోజకవర్గం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని పలువురు ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ఆదిబట్ల కేంద్రంగా ఏరోస్పేస్ జోన్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాగా ప్రకటిస్తే మరిన్ని పరిశ్రమలు రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పెట్టుబడిదారులు సూచిస్తున్నారు.

కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతుండడంతో ప్రభుత్వం శంషాబాద్ జిల్లా ఏర్పాటుకు మొగ్గు చూపు తోంది. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్ట జిల్లాలను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న జన గామ జిల్లా ప్రతిపాదన విరమించుకున్నట్లు తెలిసింది. సరస్వతీ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ అదిలాబాద్ జిల్లాకే పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన బాసరను నిజామాబాద్ జిల్లాలో విలీనం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో జిల్లా వాసులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తమై నిర్మల్‌ను కొత్త జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సిఎం కెసిఆర్‌ను కలిసి నిర్మల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్‌లో మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నందున నిర్మల్ అవసరం లేదనే వాదన రావడంతో విరమించుకున్నట్లు సమాచారం. సిరిసిల్లపై నిర్ణయం తీసుకుంటే అనవసర విమర్శలతో పాటు, జిల్లా పరిధి తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.