Home ఎడిటోరియల్ ఆధునిక అవసరాలకు తగిన విద్య

ఆధునిక అవసరాలకు తగిన విద్య

new education system in india 2020  చాలా కాలం తర్వాత చల్లని పిల్ల గాలి తాకినట్టు 34 ఏళ్ల అనంతరం ఆధునిక అవసరాలకు మెరుగ్గా పనికొచ్చే విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం తెల ్లచొక్కా ఉద్యోగాలు సాధించుకోడమే లక్షంగా సాగుతున్న ప్రస్తుత విద్యకు బదులు ఆరో తరగతి నుంచే వృత్తి శిక్షణ నిచ్చే చదువును ఈ కొత్త విధానంలో అమల్లోకి తెస్తారు. మూడేళ్ల వయసు నుంచే ప్రారంభమయ్యే నూతన విద్యలో ఎనిమిదేళ్లకు ఐదో తరగతి పూర్తి చేసుకుంటారు. 3 నుంచి 8 వ ఏడు వరకు (ఒకటవ, రెండవ తరగతులు కలుపుకొని) సాగే తొలినాళ్ల విద్యలో మొదటి మూడు సంవత్సరాల చదువును అంగన్‌వాడీల్లో నేర్పుతారు. అక్కడి నుంచి నాలుగేళ్లు అంటే 6 తరగతి వరకు చదవడం, రాయడం, అంకెలు అందులోని మెళకువలు నేర్పుతారు.

ప్రస్తుతం ఈ వయసు బాలల్లో సగం మందికి తప్పులు లేకుండా ప్రాథమిక స్థాయి చదవడం, రాయడం రావడం లేదు. అందుచేత ఈ దశ మీద బాగా శ్రద్ధ పెట్టవలసి ఉంది. 8వ ఏడాదితో ప్రాథమిక దశ పూర్తయ్యే నూతన విధానంలో ప్రాథమిక, ఉన్నత విద్యా బోధన ఆర్జన 5+3+3+4 దశల్లో ఉంటుంది. 10+2, అంటే ఇంటర్ మీడియేట్ పూర్తయ్యే వరకు గల విద్యా కాలానికి ఈ నూతన విద్యా విధానం వర్తిస్తుంది. 2022 నుంచి అమలయ్యే కొత్త పద్ధతిలో ఇంటర్ మీడియేట్ ఉండదు. 9 నుంచి 12 వ తరగతి వరకు నేర్పే చదువులోనే ఇంటర్ విద్య అంతర్భాగమవుతుంది. ఒకప్పుడు హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో నేరుగా 12వ తరగతి వరకు విద్యా బోధన ఉండేది. ఇప్పుడు సిబిఎస్‌ఇ సిలబస్‌లో కూడా అదే విధానం ఉన్నది. ఇక ముందు జూనియర్ కాలేజీల వ్యవస్థ కొనసాగదని బోధపడుతున్నది. అలాగే ఇప్పుడున్న ఆర్ట్, సైన్సు, కామర్స్ అనే కోర్సుల విభజనకు సైతం చోటు లేకుండా అందరూ అన్నీ నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.

వల్లె వేసి బట్టీ పట్టే పద్ధతికి బదులు అనుభవ విద్య ద్వారా పరిజ్ఞానం పెంచుకోడం, దానిని ఒంటబట్టించుకోడానికి ప్రాధాన్యమిస్తారు. పఠన విద్యకు ప్రాధాన్యం తగ్గిస్తారు. సామాజిక నైతిక రాజ్యాంగపరమైన అవగాహనను పెంచుతారు. బోధనలో లైంగిక విద్య ఒక భాగంగా ఉంటుంది. ఉన్నత విద్యలో భాగంగా వడ్రంగం, కుమ్మరి వంటి వృత్తి నైపుణ్యాలు, విద్యుత్ విధులు (ఎలెక్ట్రికల్), లోహపు పనులు, తోటలు పెంచడం నేర్పుతారు. అనాయాస తనానికి ప్రాధాన్యమిచ్చే, మనకు ఆది నుంచి అలవాటైపోయిన తెల్ల చొక్కా మనస్తత్వం ఇటువంటి వృత్తులను తగిన నిబద్ధతతో నేర్చుకోడానికి ప్రేరేపించదు. కొత్త విధానంలో విద్యార్థులు వద్దను కున్నప్పుడు చదువు మానేసి కావాలనుకున్నప్పుడు తిరిగి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకు వీలుగా ప్రత్యేక డ్రాప్ అవుట్స్ శిక్షణ కోర్సును రూపొందిస్తారు.

కొన్ని తరగతులకు ఓపెన్ స్కూల్ విధానాన్ని కూడా ప్రవేశపెడతారు. అన్ని స్థాయిల్లోనూ సార్వత్రిక విద్యను సాధించడం ఈ కొత్త విధానం లక్షంగా ఉంది. డిగ్రీ తర్వాత రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ ఉంటుంది గాని ఇప్పుడున్న ఎంఫిల్ విధానం అంతరించిపోతుంది. 5 తరగతి వరకు వీలైతే 8వ తరగతి వరకు తల్లి భాషలోనే విద్యా బోధన జరిగేలా చూడడం మరో కీలక కోణం. తప్పని సరిగా హిందీ నేర్చుకోవాలనే ప్రతిపాదనను విరమించుకోడం హర్షించవలసిన అంశం. ఈ మొత్తం విద్యా విధానం సమగ్రంగా, ఆది నుంచి ప్రయోజనకరంగా అమలయి ఉదార ఆర్థిక విధాన శకం, ప్రపంచీకరణ యుగం ప్రారంభమయిన తర్వాత వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులు ఉపయోగపడే చదువరులు కావాలంటే దేశంలో ప్రభుత్వ విద్యకు ఇప్పటి కంటే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం అవసరం.

కాని అందుకు తగిన నిధుల కేటాయింపు ప్రశ్నార్థకమే. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో విద్యకు 2.7 శాతంగానే ఉన్న నిధుల కేటాయింపును 6 శాతానికి పెంచదలచారు. అయినా పాఠశాలలన్నింటికీ మంచి భవనాలు వేర్వేరు మరుగుదొడ్లు, గ్రంథాలయాలవంటి మౌలిక వసతులు కల్పించి కొత్త విద్యా విధానానికి అనుగుణంగా ఇప్పుడున్న బోధనా సిబ్బంది సామర్థాలను మెరుగుపరిచి కొత్త రకం శిక్షణతో సరికొత్త గురువులను తయారు చేయడానికి వృత్తి విద్యా బోధనకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులు చాలవు. తప్పనిసరిగా ప్రైవేటు రంగాన్ని మరింతగా అనుమతించవలసి ఉంటుంది.పేదవారికి అందుబాటులో ఉండని స్థాయిలో ప్రైవేటు విద్య మరింత ప్రియమైపోతుంది.

ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలోని 2500 ప్రభుత్వ, ప్రైవేటు ఉమ్మడి భాగస్వామ్య పాఠశాలలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. దేశంలో 5 నుంచి 18 ఏళ్ల వయసులోని 5 కోట్ల 86 లక్షల మంది పిల్లలు (అధిక శాతం ఎస్‌సి, ఎస్‌టి) వారి సామాజికి ఆర్థిక నేపథ్యాల రీత్యా బాల కార్మికులుగా ఉన్నారు. అలాగే ఏటా 2 కోట్ల 30 లక్షల మంది బాలికలు (10 నుంచి 13 ఏళ్ల వయసు) మధ్యలోనే చదువు మానేస్తున్నారు. వీరందరినీ విద్యలోకి తీసుకు వచ్చి కొనసాగేలా చేయాలంటే కొత్త విధానంలో ఉండే డ్రాప్ అవుట్ అవకాశాన్ని తొలగించాలి. నూతన విధానానికి అనుగుణంగా సిద్ధం చేసే పాఠ్యప్రణాళికల్లో కాషాయ విద్యా బోధనకు ప్రాధాన్యమిచ్చే ప్రమాదం లేకపోలేదు.

new education system in india 2020