Friday, March 29, 2024

సంపాదకీయం: జనవంచక బిల్లు

- Advertisement -
- Advertisement -

New Electricity Amendment Act by modi govt ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏమి జరుగుతున్నదో, రాష్ట్రాల అధికారాలు హరించుకుపోయి కేంద్రం గుప్పెట్లో ఎలా కేంద్రీకృతమవుతున్నాయో, సహకార సమాఖ్య విధానానికి ఎన్ని తూట్లు పడుతున్నాయో మంగళవారం నాడు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తిరస్కరిస్తూ తెలంగాణ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేయడంలో తేటతెల్లమయింది. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగంలో ధ్వనించిన ఆవేదన దానిని విశదంగా వెల్లడించింది. కాంగ్రెస్, బిజెపిలు రెండూ దేశం మొత్తానికి ఉపయోగపడే ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేదని విమర్శిస్తూనే ముఖ్యంగా ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం అధికారాలన్నింటినీ తన వద్దనే కేంద్రీకరించుకుంటున్నదని కెసిఆర్ పలికిన పలుకుల్లో దేశ పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందో ప్రస్ఫుటమయింది.

2003 నాటి విద్యుత్ చట్టానికి సవరణ చేయదలుస్తూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను గత ఏప్రిల్‌లో రాష్ట్రాల పరిశీలనార్థం కేంద్రం పంపించినప్పుడే టిఆర్‌ఎస్ ప్రభుత్వం దాని పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. మనలాగే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మున్నగు బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సవరణ బిల్లుపై ఆందోళనను, నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ బిల్లుకు శాసన రూపం ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ఎంతో బాధ్యతాయుతంగానూ, విజ్ఞతతో కూడినదిగానూ ఉన్నది. రాజ్యాంగం విద్యుత్‌ను కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చింది. రాష్ట్రాలు తమ సొంత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా, బిల్లుల వసూలు, సబ్సిడీల చెల్లింపు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాయి. ప్రజల అనునిత్యావసర ఇంధనమైన విద్యుత్‌పై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పాలక పక్షాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రంగంలోకి ప్రైవేటుకు ప్రవేశం కల్పిస్తూ వాటితో అప్పటి పాలకులు ప్రభుత్వ ఖజానాను తోడివేసే రీతి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎ) కుదుర్చుకున్నప్పుడు వెల్లువెత్తిన జన నిరసన, రాజకీయంగా అది చూపిన ప్రభావం తెలిసినవే. అందుచేత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో విజ్ఞతతో అపరిమిత ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రజలను బాధించని రీతిలో విద్యుత్ వ్యవహారాలను నిర్వహిస్తుంటాయి. అందుకు వాటికి ఇప్పుడు గల వీలును కేంద్రం చేయదలచిన కొత్త చట్టం పూర్తిగా హరించివేస్తుంది. విద్యుత్తును మొత్తంగా కేంద్రం ఆధీనంలోకి నెట్టివేస్తుంది. విశేష లాభార్జనపై దృష్టితో ఆబగా ఎదురు చూస్తున్న ప్రైవేటు పెట్టుబడుల ఇష్టా విలాస రంగంగా దానిని మార్చివేస్తుంది. ప్రైవేటు విద్యుత్ సంస్థలతో ఒకసారి కుదుర్చుకొనే కొనుగోలు ఒప్పందాలను భవిష్యత్తులో మెరుగైన సాంకేతిక పరిణామాల నేపథ్యంలో విద్యుదుత్పాదన ఖర్చు తగ్గినప్పటికీ సవరించుకునేందుకు సందివ్వని పరిస్థితి ఆవిష్కృతమవుతుంది. అవసరమున్నా లేకున్నా రాష్ట్రాలు తమ విద్యుత్ వినియోగం లో 20 శాతం మేరకు సౌర తదితర ఆవృత కరెంటును కొనుగోలు చేసి తీరవలసి వస్తుంది.

ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి సాగు జరుగుతున్న తెలంగాణకు ప్రతిపాదిత విద్యుత్ చట్టం చెప్పనలవికానంత నష్టాన్ని కలుగజేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ ఉచితంగా సరఫరా చేస్తున్న వ్యవసాయ, బలహీన వర్గాల విద్యుత్‌ను ఇక నుంచి రైతులు, పేదలు నేరుగా కొనుక్కోక తప్పదు. వారికి సబ్సిడీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు నగదు రూపంలో చెల్లించవలసిన బాధ్యత రాష్ట్రాలపై పడుతుంది. విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగిపోయి సబ్సిడీ భారం కూడా తడిసిమోపెడవుతుంది. విద్యుత్ రంగంలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల కొలువులు కూడా ప్రమాదంలో పడిపోతాయి. ఇంతటి హానికరమైన సవరణ బిల్లును చట్టం చేయదలచిన ప్రధాని మోడీ ప్రభుత్వం అమ్ముల పొదిలో మరెన్నో నిరంకుశ బిల్లులు ఉన్నాయి.

వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని అమలు చేయడంలో అది ప్రదర్శిస్తున్న ఏకపక్ష వైఖరిని గమనించే వారికి భవిష్యత్తులో రాష్ట్రాలు కేంద్రానికి అది కోరినంత కప్పాన్ని నోరు మూసుకొని కడుతూ మనుగడ సాగించవలసి వచ్చే సామంత రాజ్యాలుగా మారుతాయేగాని ప్రజాస్వామిక పాలనను కించిత్తైన సాగించలేవని అర్థం కాక మానదు. ఒక్కొక్కరికి ఒకటి నుంచి 5 ఎకరాలకు మించిన భూమిలేని సన్నకారు, చిన్న రైతులే 80 శాతం పైగా ఉన్న దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు అప్పగించే శాసననాలను కూడా పార్లమెంటులో గల బలాధిక్యతతో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకురాదలచింది. ఇటువంటి బుల్డోజర్ బిల్లులను తెలంగాణ మాదిరిగా వివిధ రాష్ట్రాల శాసన సభలు ఏకగ్రీవ నిరసన కంఠంతో ఎదిరించడం అత్యంత ఆవశ్యకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News