Tuesday, November 12, 2024

పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?

- Advertisement -
- Advertisement -

New laws of Central Government become burden to People

 

మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంటుందో అని ఆలోచిస్తే అనేక అంశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం బిజెపికున్న అనుకూల రాజకీయ పరిస్థితులు రివర్స్ అయ్యి ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం ఖాయం అనిపిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకుందే నీళ్ల కోసం. ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు నీళ్లను మళ్లిస్తుంటే… అలా మళ్లించడానికి వీలులేదు… ప్రాజెక్టులను తక్షణం ఆపేయండి అని కేంద్రం అంటే ప్రజలు ఊరుకుంటారా….? ప్రాజెక్టులను ఆపివేయమనడానికి కేంద్రం సవాలక్ష కారణాలు చెప్పొచ్చు. కానీ ఆపేయమంటున్నది కెసిఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లే కాల్వలను కాదు. రైతుల పంట పొలాలకు వెళ్లే నీళ్లను. అలాంటప్పుడు రైతుల్లో రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే మోడీ సర్కార్ కొత్తగా తెచ్చిన విద్యుత్తు చట్టాన్ని అమలు చేస్తే కూడా దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటారా..? ఆ చట్టం క్రాస్ సబ్సిడీలను వద్దు అంటుంది. ఒకవేళ ఇవ్వాలనుకున్నా సబ్సిడీనీ నేరుగా ఇవ్వదంటుంది.

ముందుగా రైతుల నుండి బిల్లు వసూళ్లు చేసి ఆ తరువాత సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని చెబుతోంది. వంట గ్యాస్‌కు ఏ విధంగానైతే సబ్సిడీ డబ్బులను ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తున్నామో… అలాగే విద్యుత్ సబ్సిడీని కూడా రైతుల బ్యాంకు అకౌంట్ లో జమ చేయాలన్నది చట్టం సారాంశం. ఇది అమలు చేయాలంటే రైతుల వ్యవసాయ పంపు సెట్లకు కరెంట్ మీటర్లు బిగించాలి. బిల్లులు వసూళ్లు చేయాలని మోడీ సర్కార్ చెబుతుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ తెచ్చిన చట్టాన్నే మేము అమలు చేస్తున్నాం… దీనిలో మా ప్రమేయం ఏమీ లేదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కెసిఆర్ సర్కార్ చెబితే రైతుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే వ్యవసాయ చట్టాలను అమలు చేస్తే కూడా రైతుల నుంచి అలాంటి రియాక్షనే వస్తుంది. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం భవిష్యత్ లో భారతీయ ఆహార సంస్ధ(ఎఫ్‌సిఐ) ఉండదు. ఇదే జరిగితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయక తప్పదు. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని మోడీ సర్కార్ చెబుతుంది. ఒకే దేశం- ఒకే మార్కెట్ అనే విధానం అమల్లోకి వస్తుంది. దాంతో కొనుగోలు కేంద్రాల అవసరం లేకుండా పోతుందని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివరిస్తే బిజెపి పట్ల వారి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా మాకు తిరుగులేదు, రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అని బిజెపి నాయకులు కలలు కంటున్నారు. కానీ పాలిటిక్స్ డైనమిక్స్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో…? ఎందుకు తీసుకుంటాయో…? ఒక్కొక్కసారి అర్ధం కావు. ఇలాంటి పరిణామాలతో బండ్లు ఓడలు అవుతాయి- ఓడలు బండ్లు అవుతాయి. ఒక వైపు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్.ఐ.సి, టెలికాం, బ్యాంకులు, రైల్వే, విమానయాన సర్వీసెస్, అంతరిక్ష, రక్షణ లాంటి ప్రతిష్ఠాత్మక రం గాలను తమకు అనుకూలమైన బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంది. మరోవైపు సంస్కరణల పేరుతో తెస్తున్న కొత్త చట్టాలు ప్రజల మీద భారం మోపుతున్నాయి. ఇంకో వైపు పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు. దీనితో సామాన్య, మధ్య తరగతి వర్గాల వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రజలలో ఆగ్రహం పెరుగుతోంది. బిజెపి అగ్ర నాయకత్వం దీనిని గ్రహించే వారి ఆలోచనలు పక్కదారి పట్టించే ఎత్తుగడలు వేస్తుంది. సెంటిమెంట్ ఇష్యూస్‌ను ముందుకు తెచ్చి ప్రజల్లో భావోద్రేకాలను పెంచుతుంది. అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలను సేకరించే పేరుతో దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఇంటింటికి వెళ్లి చందాలు వసూలు చేస్తున్నారు. అలాగే చైనా, పాకిస్థాలను బూచిగా చూపించి ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం. లవ్ జిహాద్ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కరోనా వాక్సిన్ పేరుతో రాజకీయ లబ్ధ్దికి ప్రయత్నించడంతో పాటు ఆయా రాష్ట్రాలలో విద్వేషాలను రగిలించే అంశాలను తెర మీదకు తెచ్చి భావోద్రేకాలను పెంచడం ద్వారా ప్రజలు ఎదుర్కొనే అసలు సమస్యల నుండి వారి ఆలోచనలను మళ్లించి రాజకీయ ప్రయోజనాలను పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలలో విగ్రహాల ధ్వంసం పేరుతో జరుగుతున్న రాజకీయ రగడ ఈ కోవకు చెందినదే. అంతేకాదు తిరుపతి ఉప ఎన్నిక రెండు మతాల మధ్య జరుగుతున్న ఎన్నిక అని బిజెపి నాయకులు బరి తెగించి మాట్లాడడం చూస్తుంటే వారి ఎజండా ఏమిటో చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. మోడీ 2014లో ప్రధాని అయిన నాటి నుండి ఇలాంటి ఎత్తుగడలతో నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ కాలక్రమంలో ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి.

పేద, మధ్య తరగతి వర్గాల జీవనం భారమైంది. లాక్ డౌన్‌తో వారి ఆర్ధిక పరిస్థితులు మరింత దిగజారాయి. ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి మీద వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం పైగా బిజెపికి బలమైన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సైతం వారి పాలనపై వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే జమిలి పేరుతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ఆలోచన చేసింది. జమిలి కాకుం డా వేరుగా ఎన్నికలు జరిపితే ఉత్తరాదిలో బిజెపికి ఎదురు గాలి వీస్తుంది. దేశ వ్యాప్తంగా దాని ప్రభావంపడి కేంద్రంలో అధికారాన్ని కోల్పోతామని గ్రహించిన బిజెపి అగ్ర నాయకత్వం జమిలి ఎన్నికను తెర మీదకు తెచ్చింది. ఇలాంటి విషయాల్లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తమను వ్యతిరేకించే వారి మీద జాతి ద్రోహులనో… హిందు వ్యతిరేకులనో ముద్ర వేసి వాళ్ల నోరు మూయించడం… లేదా అవసరమైతే ఇడి, సిబిఐ, ఐటిలను ప్రయోగించి వారిని అణచివేయడం చేస్తుంది. తాజాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంపై కూడా కేంద్రం ఉక్కు పాదాన్ని మోపింది.

ఉద్యమ నాయకత్వంపై దేశ విద్రోహ చట్టాన్ని ప్రయోగించింది. అయినా రైతులు తమ ఉద్యమం ద్వారా మోడీ సర్కార్ మెడలు వంచగలిగారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో ఏడాదిన్నర పాటు కొత్త చట్టాలను వాయిదా వేస్తామని ప్రకటించింది. ఇది కూడా వారి రాజకీయ ఎత్తుగడగా కనపడుతుంది. ఎందుకంటే మరో ఏడాదిన్నర కాలం తర్వాత జమిలి ఎన్నికలు రాబోతున్నాయని వారికి తెలుసు. అందుకే అప్పటి దాకా కొత్త చట్టాలను అమలు చేయమని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో రైతుల ఓట్లను దండుకోవచ్చు అనేది వారి ఎత్తుగడ.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మంచివని బిజెపి నాయకులు ఎంత చెప్పినా ప్రజల నుండి తిరుగుబాటును మాత్రం ఎదుర్కోక తప్పదు. చట్టాలలో ఉన్న అంశాలు అలాంటివి. వాటిని అమలు చేస్తే ఆ చట్టాల తీవ్రత ప్రజలకు అప్పుడు అర్ధం అవుతుంది. దాని తో వారు తిరగబడడం ఖాయం. పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లో తాము అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి నాయకులు గొప్పలకు పోతున్నారు.పైగా కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతున్నదని, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెబుతున్నారు. వీరి మాటలు ఎలా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం రైతులను ఆర్ధికంగా బలోపేతం చేసే నిర్ణయాలను తీసుకునే ప్రయత్నం చేస్తుంటే… కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం బడా కార్పొరేట్ సంస్థలు ఆర్ధికంగా బలపడే విధంగా చట్టాలను చేస్తున్నది. జమిలి ఎన్నికల నాటికి దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News