Thursday, April 25, 2024

7 రోజుల్లో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

New President of Sri Lanka in 7 days

గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదించిన పార్లమెంటు స్పీకర్
అప్పటిదాకా తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘె
రేపు సమావేశం కానున్న శ్రీలంక పార్లమెంటు

కొలంబో: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు పదవినుంచి దిగిపోయారు. సింగపూర్‌నుంచి ఇమెయిల్ ద్వారా రాజీనామా లేఖను పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబెయ్ వర్దెనకు పంపించిన విషయం తెలిసిందే. రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. వారం రోజుల్లో తదుపరి అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ శనివారంనుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటిదాకా రణిల్ విక్రమ్ సింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్లమెంటు శనివారం సమావేశం కానుందని స్పీకర్ ప్రకటించారు. ఈ ప్రక్రియలో ఎంపిలంతా పాల్గొనేలా శాంతియుత వాతావరణం కల్పించాలని ఈ సందర్భంగా ఆందోళనకారులను కోరారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య సమక్షంలో రణిల్ విక్రమ్ సింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అనంతరం పార్లమెంటునుద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతలను పూర్తిగా కాపాడుతానని హామీ ఇచ్చారు. హింసాత్మక, దేశద్రోహ చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించడానికి అవసరమైన అధికారాలు, స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ‘శాంతియుత ప్రదర్శనలను నేను వంద శాతం సమర్థిస్తాను. అయితే అల్లర్లకు పాల్పడేవారికి, ఆందోళనకారులకు మధ్య తేడా ఉంది’ అని ఆయన అన్నారు. నిజమైన ఆందోళనకారులెవరూ హింసకు పాల్పడరని అన్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తన తొలి బాధ్యత రాజ్యాంగానికి చేసిన 19వ సవరణను పునరుద్ధరించడమని విక్రమ్ సింఘె చెప్పారు. పార్లమెంటుకు అధ్యక్షుడికన్నా ఎక్కువ అధికారాలు దఖలుపర్చడం ద్వారా అధ్యక్షుడి అధికారాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సవరణను 2015లో ఆమోదించారు. ఈ సవరణను ప్రతిపాదించిన వారిలో విక్రం సింఘె ముఖ్యమైన వ్యక్తి. అయితే 2019 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గొటబాయ రాజపక్స విజయం సాధించిన తర్వాత ఈ 19వ సవరణను రద్దు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అన్ని పార్టీల సంఘటిత కృషి అవసరమని విక్రమ్ సింఘె అంటూ, అందువల్లనే అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

2.2 కోట్ల జనాభా కలిగిన శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.గత 7 దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసరాలు, అత్యవసరాల కొరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి రాజపక్స కుటుంబమే కారణమని, వారు వెంటనే అధికారంనుంచి దిగిపోవాలంటూ గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాని పదవినుంచి మహింద రాజపక్స దిగిపోగా, రణిల్ విక్రమ్ సింఘె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నిరసనలు మిన్నంటడంతో అధ్యక్షుడు గొటబాయ కూడా పదవినుంచి వైదొలగడానికి అంగీకరించారు. అయితే తనను దేశంనుంచి వెళ్లనిస్తేనే రాజీనామా చేస్తానని చెప్పడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడి ఆక్రమించుకున్న క్రమంలో మాల్దీవులకు పారిపోయిన గొటబాయ.. ఆ తర్వాత అక్కడినుంచి గురువారం దుబాయి ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ వెళ్లారు అక్కడినుంచే తన రాజీనామా లేఖను ఇమెయిల్‌ద్వారా పంపారు. మరోవైపు గొటబాయ రాజీనామాతో ఆందోళనకారులు కాస్త శాంతించారు. తాము తిష్ఠవేపిన అధ్యక్షుడి నివాసం, ప్రధాని కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు వారు ప్రకటించడం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News