Home ఆదిలాబాద్ దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం: కెసిఆర్

దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం: కెసిఆర్

 

KCR

 

నిర్మల్: రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నిర్మల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కశ్మీర్ లాంటిదని ప్రశంసించారు. తుమ్మడి హట్టి నుంచి రెండు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, ఏడాదిన్నరలో పచ్చని పంట పొలాలతో ఆదిలాబాద్ కళకళలాడుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా నిర్మల్‌లోని ముథోల్‌లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. జూన్ తరువాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని, భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. పాస్‌బుక్‌లో 36 కాలమ్స్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, పహణి, నకల్‌ను మార్చేశామన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని, రైతులు ఎంఆర్‌ఒ ఆఫీస్ చుట్టూ తిరగకుండా చేస్తానని హామీ ఇచ్చారు.  టిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే నిర్మల్ జిల్లా ఏర్పడిందన్నారు.

చనిపోయిన రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పిఎఫ్ కార్డు ఉన్న బిడి కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని, 18 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బిడి కార్మికులకు పెన్షన్లు ఇవ్వడంలేదని, ఒక్క తెలంగాణలో మాత్రమే బిడి కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని కెసిఆర్ చెప్పారు. రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి అందిస్తున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరెంటు కష్టాలు లేవని, ఐదేళ్ల క్రితం కరెంట్ విషయంలో ఆగమాగంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో కరెంట్ ఎక్కువగా వినియోగిస్తుందని తెలంగాణ ప్రాంతంలోనని తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడొస్తదో… ఎప్పుడు పోయేదో తెలిసేదని కాదని మండిపడ్డారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పొగిడారు. పెన్షన్ వెయ్యి రూపాయలు అందిస్తున్నామని, మే 1 నుంచి రూ.2000 ఇస్తామన్నారు. రైతు బంధు కింద ఎకరానికి ఇప్పటి వరకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చామని, ఇప్పటి నుంచి ఎకరానికి పది వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని ప్రశంసించారు. 

రైతులకు గిట్టుబాటు ధర రావాలని, పసుపు బోర్డు పెట్టమని ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నో సార్టు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వందల దరఖాస్తులు పెట్టినా కేంద్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదు ప్రజల అభీష్టం గెలవాలని కోరారు. 2014 ఎన్నికల ముందు బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అన్నారని, 15 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికలు వస్తే చాలు పాకిస్తాన్, హిందువుల విషయాలు మోడీకి బాగా గుర్తుకువస్తాయని, మతం పేరుతో హిందూవులు, ముస్లింల మధ్య మోడీ గొడవలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిచ్చి ప్రచార హోరులో యువత కొట్టుకుపోవొద్దని కెసిఆర్ హెచ్చరించారు.

1976లో చైనా జిడిపి మన కంటే తక్కువగా ఉందని, ఇవాళ ప్రపంచంలోనే చైనా రెండో స్థానంలో ఉందని కొనియాడారు. కుల, మతాల పంచాయతీ పోతేనే దేశం బాగుపడుతుందని కెసిఆర్ తెలిపారు. గిరిజనులు, దళితులు గౌరవించబడితేనే దేశం పురోగమిస్తుందని, దేశంలో 3లక్షల 44 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ శక్తి ఉందని, దేశం వాడుతున్నది కేవలం 2 లక్షల 20 వేల మెగావాట్లు మాత్రమేనని తెలియజేశారు. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో 27 వేల మెగావాట్ల విద్యుత్ శక్తి వృథాగా పడి ఉందని గత ప్రభుత్వాలపై విరుచుకపడ్డారు. 193 కిలో మీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని, 7500 కిలో మీటర్లు సముద్ర తీరం ఉన్న ఇండియా ఎందుకు అభివృద్ధి చెందడం లేదని కెసిఆర్ ప్రశ్నించారు. 

 

New Revenue Law Established in Telangana: KCR