పాలపుంతలో భార మూలకాల ఉత్పత్తికి ఇదే కారణం
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధన వెల్లడి
క్యాన్బెర్రా: విశ్వంలో కొత్త రకం తారా విస్ఫోటాన్ని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మన పాలపుంత గెలాక్సీలో అనేక రకాల మూలకాల ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాన్ని ఇది విప్పగలిగింది. ఇప్పటివరకు న్యూట్రాన్ తారల విలీనం ద్వారా మాత్ర మే భార మూలకాలు ఉత్పత్తి అవుతాయన్న భావన ఉండేది. అయితే విశ్వం ఆవిర్భవించడానికి కారణమైన బిగ్ బ్యాంగ్ సంభవించిన కొద్ది కాలానికే ఈ భార మూలకాలు ఏర్పడిన సంగ తి శాస్త్రవేత్తలకు తెలుసు. అంత తక్కువ వ్యవధిలో న్యూట్రాన్ నక్షత్రాల విలీనానికి అవకాశం లేదు. దీన్ని బట్టి పాలపుంతలో తొలినాటి భార మూలకాల ఉత్పత్తికి మరేదో కారణమై ఉంటుందన్నది స్పష్టమౌతోంది.
అయితే అదేంటన్నది ఇప్పటివరకు మిస్టరీగానే ఉండేది. ఈ నేపథ్యం లో పాలపుంత అంచుల్లో ఎస్ఎంఎస్ఎస్ జే 2003 1142 అనే పురాతన నక్షత్రం వెలుగు చూసింది. ఇది బంగారం, యురేనియం, సహా అనేక భార మూలకాలు ఏర్పడడానికి కారణమైన మరో అంశానికి సంబంధించి తొలి ఆధారాన్ని అందించింది. అందులోని భార మూలకాలు న్యూట్రాన్ తారల విలీనం వల్ల కాకుండా, వేగంగా భ్రమణం చెందుతూ బలమైన అయస్కాంత క్షేత్రం , సూర్యుడి కన్నా 25 రెట్లు అధిక ద్రవ్యరాశి కలిగిన నక్షత్రం కుప్పకూలి, విస్ఫో టం చెందడం వల్ల ఏర్పడి ఉంటాయనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలు సేకరించారు. ఈ విస్ఫోటానికి మ్యాగ్నెటో రొటేషనల్ హైపర్ నోవా అని పేరు పెట్టారు.
New type of eruption in the universe