Friday, March 29, 2024

కివీస్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -
New-Zealand
మళ్లీ ఓడిన భారత్,  రెండో వన్డేలో న్యూజిలాండ్ జయభేరి

ఆక్లాండ్: భారత్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్ సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకే కుప్పకూలింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కిల్ జెమిసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే మంగళవారం జరుగుతుంది.

ఆరంభంలోనే..

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వరుసగా రెండో వన్డేలోనూ విఫలమయ్యాడు. 3 పరుగులు మాత్రమే చేసి బెన్నెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీషా ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలతో కివీస్ బౌలర్లను హడలెత్తించాడు. అయితే 19 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 24 పరుగులు చేసిన షాను జెమిసన్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిరాశే మిగిల్చాడు. కివీస్ బౌలర్లను స మర్థంగా ఎదుర్కొవడంలో విఫలమైన కోహ్లి 15 పరుగులు మాత్రమే చేసి సౌథి వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అ య్యాడు. మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్ కూడా ఈసారి విఫలమయ్యా డు. జట్టుకు అండగా నిలుస్తాడ ని భావించిన రాహుల్ 4 పరుగులు మాత్రమే చేసి గ్రాం డోమ్ బౌలింగ్‌లో వెనుదిరిగా డు. కేదార్ జాదవ్ కూడా జ ట్టును ఆదుకోలేక పోయాడు. 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

అయ్యర్, జడేజా పోరాటం..

మరోవైపు కిందటి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఈసారి కూడా జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అయ్యర్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. కీలక ఇన్నిం గ్స్ ఆడిన అయ్యర్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కుదురుగా ఆడుతున్న అయ్యర్ కీలక సమయంలో చెత్త షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను పారేసుకున్నాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రవీంద్ర జడేజా తనపై వేసుకున్నాడు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. శార్ధూల్ ఠాకూర్ కూడా కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. అయితే 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.

సైని మెరుపులు

తర్వాత వచ్చిన యువ ఆటగాడు నవ్‌దీప్ సైని అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సైని వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సైని రెండు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 45 పరుగులు సాధించాడు. ఇక, సమన్వయంతో ఆడిన రవీంద్ర జడేజా రెండు ఫోర్లు, సిక్స్‌తో 55 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 251 పరుగుల వద్ద ముగిసింది. కివీస్ బౌలర్లలో సౌథి, బెన్నెట్, జెమిసన్, గ్రాండోమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఆదుకున్న గుప్టిల్, రాస్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను సీనియర్లు మార్టిన్ గుప్టిల్, రాస్ టైలర్‌లు ఆదుకున్నారు. ఇద్దరు అర్ధ సెంచరీలతో కివీస్ అండగా నిలిచారు. ఓపెనర్ హెన్రీ నికోల్స్ (41)తో కలిసి గుప్టిల్ జట్టుకు శుభారంభం అందించాడు. ఇటు గుప్టిల్, అటు నికోల్స్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. సమన్వయంతో ఆడిన నికోల్స్ ఐదు ఫోర్లతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే గుప్టిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించాడు.

మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గుప్టిల్ మూడు భారీ సిక్సర్లు, మరో 8 ఫోర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో కివీస్ కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో సీనియర్ ఆటగాడు రాస్ మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. యువ ఆటగాడు జెమిసన్ 25 (నాటౌట్) అండతో రాస్ స్కోరును పరిగెత్తించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాస్ రెండు సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కివీస్ స్కోరు 273 పరుగులకు చేరింది.

New Zealand beat India by 22 runs to seal series 2-0

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News