Thursday, April 25, 2024

కివీస్‌ అదరహో

- Advertisement -
- Advertisement -

New-Zealand

టేలర్ అజేయ శతకం
నికోల్స్, లాథమ్ మెరుపులు
శ్రేయస్ సెంచరీ వృథా
తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ జయభేరి

హామిల్టన్: భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మొదటి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (103) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (51), లోకేశ్ రాహుల్ 88 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో తమవంతు పాత్ర పోషించారు.

భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 109 (నాటౌట్) మెరుపు శతకం సాధించి న్యూజిలాండ్‌కు సంచలన విజయం అందించాడు. కెప్టెన్ టామ్ లాథమ్ (69), ఓపెనర్లు మార్టిర్ గుప్టిల్ (32), హెన్రీ నికోల్స్ (78)లు కూడా తమవంతు సహకారం అందిచడంతో కివీస్ ఘన విజయం సాధించింది. ఇదే క్రమంలో భారత్ చేతిలో ఎదురవుతున్న వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. రాస్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో వన్డే శనివారం ఆక్లాండ్ వేదికగా జరుగుతుంది.

శుభారంభం

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు హెన్రీ నికోల్స్, మార్టిన్ గుప్టిల్ అండగా నిలిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే ఒకటి రెండు పరుగులు తీస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. మరోవైపు వీరిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుప్టిల్ కాస్త సమన్వయంతో బ్యాటింగ్‌ను చేయగా నికోల్స్ మాత్రం దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఓపెనర్లు కుదురు కోవడంతో కివీస్‌కు మెరుగైన ఆరంభం లభించింది.

అయితే రెండు ఫోర్లతో 32 పరుగులు చేసిన గుప్టిల్‌ను శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో 85 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ బ్లుండెల్ (9) నిరాశ పరిచాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి కుల్దీప్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన రాస్‌తో కలిసి నికోల్స్ స్కోరును పరిగెత్తించాడు. ఇటు రాస్ అటు నికోల్స్ చెలరేగి ఆడడంతో కివీస్ లక్షం వైపు పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన నికోల్స్ 82 బంతుల్లోనే 11 ఫోర్లతో 78 పరుగులు చేసి కోహ్లి అద్భుత ఫీల్డింగ్ విన్యాసానికి రనౌటయ్యాడు.

రాస్, లాథమ్ జోరు

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాస్ టేలర్, కెప్టెన్ లాథమ్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. రాస్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. లాథమ్ కూడా కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇటు రాస్, అటు లాథమ్ విజృంభించడంతో భారత బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. షమి, శార్దూల్, కుల్దీప్‌లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇదే క్రమంలో సీనియర్ బౌలర బుమ్రా వరుసగా వైడ్లు సమర్పించుకున్నాడు. దీంతో రాస్, లాథమ్‌లకు ఎదురు లేకుండా పోయింది.

ఇద్దరు పోటీ పడి అడడంతో స్కోరు వేగం పుంజుకుంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లాథమ్ 48 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 8 ఫోర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే రాస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మరోవైపు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన రాస్ 84 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో పది బౌండరీలతో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో కివీస్ మరో 11 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.

ఆదుకున్న కోహ్లి

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే మూడు బౌండరీలతో 20 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన పృథ్వీషాను గ్రాండోమ్ ఔట్ చేశాడు. దీంతో 50 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో ఓపెనర్ మాయంక్ అగర్వాల్ కైడా ఔటయ్యాడు. 31 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 32 పరుగులు చేసిన మయాంక్‌ను సౌథి వెనక్కి పంపాడు.

దీంతో భారత్ 54 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిని ఔట్ చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వర కు ఫలించలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసి ఐష్ సోధి వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు.

శ్రేయస్ శతకం

కోహ్లి ఔటైనా శ్రేయస్ అయ్యర్ తన జోరును కొనసాగించాడు. అతనికి లోకేశ్ రాహుల్ అండగా నిలిచాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించారు. ఇటు అయ్య ర్, అటు రాహుల్‌లు చెలరేగి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన శ్రేయస్ ఒక సిక్స్, మరో పదకొండు ఫోర్లతో 103 పరుగులు సాధించాడు. అంతేగాక రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు.

రాహుల్ మెరుపులు

మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్ వన్డేల్లో కూడా తన జోరును కొనసాగించాడు. కివీస్ బౌలర్లను హడలెత్తిస్తూ వరుస సిక్సర్లతో కనువిందు చేశాడు. అతనికి కేదార్ జాదవ్ అండగా నిలిచాడు. చెలరేగి ఆడిన రాహుల్ 64 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెలరేగి ఆడిన జాదవ్ ఒక సిక్స్, మూడు ఫోర్లతో 15 బంతుల్లోనే 26 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ స్కోరు 347 పరుగులకు చేరింది.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్: పృథ్వీషా (సి) లాథమ్ (బి) గ్రాండోమ్ 20, మయాంక్ అగర్వాల్ (సి) టామ్ బ్లుండెల్ (బి) సౌథి 32, విరాట్ కోహ్లి (బి) ఐష్ సోధి 51, శ్రేయస్ అయ్యర్ (సి) సాంట్నర్ (బి) సౌథి 103, లోకేశ్ రాహుల్ నాటౌట్ 88, కేదార్ జాదవ్ నాటౌట్ 26, ఎక్స్‌ట్రాలు 27, మొత్తం 50 ఓవర్లలో 347/4.
బౌలింగ్: టిమ్ సౌథి 101852, హామిష్ బెన్నెట్ 100770, గ్రాండోమ్ 80411, జేమ్స్ నిషమ్ హామిష్ బెన్నెట్ 80520, మిఛెల్ సాంట్నర్ 100580, ఐష్ సోధి 40271.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సి) కేదార్ (బి) శార్దూల్ 32, హెన్రీ నికోల్స్ రనౌట్ 78, టామ్ బ్లుండెల్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 9. రాస్ టేలర్ నాటౌట్ 109, టామ్ లాథమ్ (సి) షమి (బి) కుల్దీప్ 69, జేమ్స్ నిషమ్ (సి) కేదార్ (బి) షమి 9, గ్రాండోమ్ రనౌట్ 1, మిఛెల్ సాంట్నర్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు 29, మొత్తం 48.1 ఓవర్లలో 348/6.
బౌలింగ్: జస్‌ప్రిత్ బుమ్రా 101530, మహ్మద్ షమి 9.10631, శార్దూల్ ఠాకూర్ 90801, రవీంద్ర జడేజా 100640, కుల్దీప్ యాదవ్ 100842.

భారీ స్కోరు సాధించినా ఓటమి పాలు కావడం బాధగా ఉంది. ఈ మ్యాచ్‌లో కివీస్ అసాధారణ ఆటను కనబరిచింది. క్లిష్టమైన లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. బౌలర్లు విఫలం కావ డం, ఫీల్డింగ్‌లో పొరపాట్లు జరగడం ఓటమికి ప్రధాన కారణం. సమష్టిగా పోరాడిన న్యూజిలాండే విజయానికి అర్హురాలు. రానున్న రెండు వన్డేలు మాకు ఎంతో కీలకం. ఇందులో గెలిచి సిరీస్ సాధించడమే ఏకైక లక్షం. ఇందులో సఫలం అవుతామనే నమ్మకం ఉంది.

                                                                                                            – కెప్టెన్ విరాట్ కోహ్లి

 

new zealand beat india by 4 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News