Home ఎడిటోరియల్ శాంతివనంలో ఉగ్ర బీభత్సం

శాంతివనంలో ఉగ్ర బీభత్సం

mosque shooting

న్యూజిలాండ్ ప్రశాంతమైన దేశం, అందమైన ప్రకృతి సంపదకు ఆలవాలం. అల్లర్లు, అలజడులు లేని దేశం. కాని అక్కడ శ్వేతదురహంకారం తుపాకులతో రెచ్చిపోయింది.. మానవత్వం కకావికలమైంది.. నెత్తురు వరదలై ప్రవహించింది… ప్రార్థనల్లో మునిగిఉన్న వారు అలాగే చివరి శ్వాస వదిలారు… హత్యాకాండను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఉగ్రవాదులు వికటాట్టహాసం చేశారు… ఉగ్రవాదానికి మతం లేదని, మానవత్వం లేదని నిరూపించారు.
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాద దాడేనని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్‌డెర్న్ ప్రకటించారు. ఇది న్యూజిలాండ్‌కు చీకటి రోజని ప్రకటించారు. క్రైస్ట్ చర్చ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని రెండు మసీదుల్లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. క్షణాల్లో ప్రార్ధనాస్థలం స్మశానంగా మారిపోయింది. రెండు మసీదుల్లోను ప్రార్థనలు చేసుకుంటున్న 49 మంది మృత్యువాతపడ్డారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తర్వాత ఓ కారులో రెండు భారీ పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. ఓ మహిళ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన 28 ఏళ్ల శ్వేత జాతీయుడు ఉన్నాడు. కాల్పులకు తానే బాధ్యుడినం టూ 74 పేజీల లేఖలో అతడు పేర్కొన్నాడు. దాడి చేయడానికి పక్కగా పథకం వేసుకుని న్యూజిలాండ్‌కు వచ్చినట్లుగా అతడు లేఖలో చెప్పాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు క్రికెట్లర్లు అక్కడికి వెళ్లారు. మసీదుకు కొన్ని మీటర్ల దూరంలో ఉండగానే కాల్పుల శబ్దాలు వినపడ్డాయని జట్టు మేనేజర్ ఖలేద్ వెల్లడించారు. బంగ్లాదేశ్ జట్టుకు వీడియో అనలిస్ట్ గా పని చేస్తున్నది భారతీయుడే. ఆయన శ్రీనివాస్ చంద్రశేఖరన్ కాల్పుల సమయంలో బస్సులోనే ఉన్నారు. మసీదు దగ్గర కాల్పులకు తెగబడిన ఉగ్రవాది తమ దేశానికి చెందిన వాడేనని, అతడు విద్వేష భావజాలానికి గురైన తీవ్రమైన ఉగ్రవాది అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు. కాల్పులతో దాడి ఘటనను ఫేస్‌బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విద్వేషానికి పరాకాష్ఠ. దాడికి ముందు తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో తాను కాల్పులు జరుపబోతున్నట్లు పలు పోస్ట్‌లు కూడా చేశాడు.
న్యూజిలాండ్ ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గుడు అమెరికా అధ్యక్షుడిని ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. సరికొత్త శ్వేతజాతి గుర్తింపుకు డోనాల్డ్ ట్రంప్ చిహ్నమని ఈ ఉగ్రవాది అన్నాడు. గతంలో డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. బ్రిటన్‌లో నేరాలు పెరగడానికి కారణం రేడికల్ ఇస్లాం అంటూ బాధ్యతారహితంగా ట్రంప్ చేసిన ట్వీట్‌ను ఇంగ్లాండు కూడా ఖండించింది. ఇలాంటి మరెన్నో ఉదాహరణలున్నాయి. న్యూజిలాండ్ ఉగ్రదాడి తర్వాత ట్రంప్ కూడా ఖండిస్తూ ట్వీట్ చేశారు. కాని ఉగ్రదాడులు జరిగినప్పుడు ట్రంప్ ఇంతకు ముందు ప్రతిస్పందించిన తీరుకు ఇప్పుడు ప్రతిస్పందిస్తున్న తీరుకు మధ్య ఉన్న తేడాను మీడియా కూడా గుర్తించింది. అలాగే ఆస్ట్రేలియా సెనెటర్ ఫ్రేజ్ యాన్నింగ్స్ న్యూజిలాండ్‌లో దాడికి ముస్లిం వలసలే కారణమని చెప్పడం నేతల విద్వేష వ్యాఖ్యలకు మరో ఉదాహరణ. ఫ్రేజ్ యాన్నింగ్స్ వ్యాఖ్యలను బ్రిటన్ హోం సెక్రటరీ సాజిద్ జావిద్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా లేబర్ పార్టీ నేత టోనో బుర్కె ఈ విషయమై మాట్లాడుతూ మతోన్మాదం శ్వేత జాత్యాహంకారం ఇప్పుడ మామూలై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్‌లో ఉగ్రవాది ఒకరు దాడి జరిపి 49 మందిని చంపిన సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉగ్రవాద చర్యను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని, ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఇలాంటి వాటిని అందరూ గర్హించాలని స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి చాలా చాలా అరుదు. కాని పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న ఇస్లామో ఫోబియా, ప్రవాసులు, శరణార్థుల పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. జనవరి 29, 2017వ తేదీన కెనడాలోని క్యూబెక్ నగరంలో అలెగ్జాండర్ బిస్సోనెట్ అనే ఉగ్రవాది మసీదులో కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశాడు. కెనడాలోకి మరింత మంది శరణార్థులకు అవకాశం ఇస్తారన్న వార్తను చదివిన తర్వాత తాను ఈ దాడి చేశానని అన్నాడు.
జూన్ 19, 2017వ తేదీన లండనులో ఫిన్స్ బరీ మసీదు వద్ద నిలబడి ఉన్న ముస్లిములపై డేరెన్ ఓస్బోర్న్ అనే ఉగ్రవాది వ్యాన్‌తో గుద్ది బీభత్సం సృష్టించాడు. ముస్లిముల పట్ల ద్వేషంతోనే అతను ఈ దాడి చేసినట్లు ప్రాసిక్యూటర్లు స్పష్టం చేశారు. 2017లోనే ఆగష్టు 5వ తేదీన మిన్నెసోటాలోని బ్లూమింగ్ టన్ మసీదులో బాంబు పేలుడు జరిపారు. అదృష్టవశాత్తు ఈ పేలుడులో ప్రాణ నష్టం జరగలేదు. ముస్లింలను భయపెట్టి దేశం వదిలిపోయేలా చేయడానికి దాడి చేశామని ఉగ్రవాదులు చెప్పారు. కంసాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్ సముదాయంలో మసీదు కూడా ఉంది. అక్కడ నాలుగు వాహనాల్లో పేలుడు పదార్థాలతో విస్ఫోటం జరిపే ప్రయత్నాలు చేశారు. అక్కడ సోమాలీ శరణార్థులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ సంఘటన గత సంవత్సరం జరిగింది. ముస్లింలను చంపేయాలంటూ ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు చెప్పిన మాటలు ప్రపంచాన్ని నిర్ఘాంత పరిచాయి. అమెరికా వ్యాప్తంగా 28 లక్షల మంది వరకూ ముస్లింలు వుంటారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్‌లు అప్పట్లో చేసిన ప్రచారం ప్రసంగాల తరువాత దక్షిణ కాలిఫోర్నియాలోని ఇస్లామిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆరంజ్ కౌంటీపై కొందరు తెల్లజాతీయులు దాడులు చేశారు. 2017 రంజాన్ నెలలో, రోజా పాటిస్తున్న కొందరు యువతులు పొద్దున్నే హోటల్‌లో భోజనం చేశారు. బయటకు వస్తుండగానే, కారులో దూసుకొచ్చిన వచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడిచేశాడు. భయపడిపోయిన వారు సమీపంలోని మసీదులోకి పరుగు తీశారు. తీరాచూస్తే, తమలో ఒకరు తగ్గినట్టు గుర్తించారు. ఆ తరువాత ఒక అరగంట లోపే ఆమె మృతదేహాన్ని ఓ చెరువులో గుర్తించి, భీతిల్లిపోయారు. అమెరికాలో పడగవిప్పిన ‘ఇస్లామో ఫోబియా’ హత్యల్లో భాగంగా జరిగినట్టు భావిస్తున్న ఈ దారుణం, వర్జీనియాను వణికించింది. ఇలాంటి విద్వేష నేరాలు అనేకం జరుగుతున్నాయి. సమాజంలో ప్రపంచీకరణ అసమానతలను పెంచింది. అసమానతలు జాత్యాహంకారం, మతోన్మాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం ప్రజల్లో భావోద్వేగాలను నేతలు రెచ్చగొడుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో ఈ వైఖరి మరింత ఎక్కువయ్యింది. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా కనబడుతుంది. న్యూజిలాండ్‌లో జరిగింది ప్రపంచంలో దిగజారుతున్న పరిస్థితులకు సూచన మాత్రమే. గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు కొనసాగుతున్న తీరు ఫలితమే ఈ హత్యాకాండ. విద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు ఎలాంటి ఉన్మాద ప్రపంచాన్ని సృష్టిస్తాయో ఈ సంఘటన రుజువు చేస్తోంది. జాత్యాహంకారం, మతోన్మాదం మానవాళికి జంట శత్రువులు. వీటిని ఎదుర్కోడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలి. ఎలుగెత్తి నిరసించాలి. అప్పుడే మానవ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో వికసిస్తుంది.

New Zealand mosque shooting