Home తాజా వార్తలు కివీస్‌కు అచ్చిరాని ప్రపంచకప్

కివీస్‌కు అచ్చిరాని ప్రపంచకప్

 

అన్నీ ఉన్నా శూన్య హస్తమే!

మన తెలంగాణ / క్రీడా విభాగం: సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానం ఉన్నా ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవని జట్లలో న్యూజిలాండ్ ఒక్కటి. ప్రారంభ వరల్డ్‌కప్ నుంచి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా ప్రపంచకప్ ఆడుతూ వస్తోంది. అయితే ఆ జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. కిందటిసారి జరిగిన ప్రపంచకప్‌లో కివీస్ తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. కానీ, తుది సమరంలో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటమి పాలైంది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు మంచి రికార్డే ఉంది. అయినా ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలువక పోవడం గమనార్హం. 1975లో జరిగిన తొలి ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. ప్రతి టోర్నీలో కూడా భారీ ఆశలతో బరిలోకి దిగే న్యూజిలాండ్ కప్పు సాధించకుండానే వెనుదిరగడం అలవాటుగా మార్చుకుంది. ఇతర జట్లతో పోల్చితే న్యూజిలాండ్‌లో ప్రతిభకు కొదవలేదు. ప్రపంచ క్రికెట్‌ను శాసించినా ఎందరో క్రికెటర్లు కివీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఇందులో రిచర్డ్ హ్యాడ్లి కూడా ఉన్నాడు. కపిల్‌దేవ్, ఇయాన్ బోథమ్, మాల్కం మార్షల్, వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, స్టీవ్‌వాలకు సమకాలీకుడిగా హ్యాడ్లి పేరు సంపాదించాడు. అతను ప్రాతినిథ్యం వహించినా న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను ముద్దాడలేక పోయింది. మార్టిన్‌క్రో, జెఫ్‌క్రో, స్మిత్, డానియల్ వెటోరి, స్మిత్, మార్టిన్ గుప్టిల్, విలియమ్సన్, షేన్‌బాండ్, ట్రెంట్ బౌల్ట్, సౌథి, టైలర్, జాన్‌రైట్ వంటి స్టార్లు న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించారు. వీరింత ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేశారు. బ్లాక్‌క్యాప్స్‌గా పేరున్న న్యూజిలాండ్ జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవ ఉండదు. ప్రతిసారి ఆ జట్టులో కనీసం ముగ్గరు అంతర్జాతీయ స్థాయి ఆల్‌రౌండర్లు ఉండడం అనవాయితీగా వస్తోంది. అయితే సెమీఫైనల్ వరకు సాఫీగా సాగే కివీస్ ప్రయాణం ఆ తర్వాత ఆగిపోతోంది. కిందటి ప్రపంచకప్‌లోనే తొలిసారిగా కివీస్ సెమీస్‌ను దాటి ఫైనల్‌కు చేరుకుంది. ఆ ఒక్కసారి తప్పితే ఎప్పుడూ కూడా కివీస్ ఫైనల్‌కు చేరింది లేదు.
భారీ ఆశలతో..
ఇదిలావుండా ఈసారి మాత్రం న్యూజిలాండ్ భారీ ఆశలతో ప్రపంచకప్‌కు సిద్ధమవుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అన్నింటికి మించి విలియమ్సన్ సారథ్యం ఆ జట్టుకు ప్రధాన బలంగా మారింది. ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించే సత్తా కివీస్‌కు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. అయితే నిలకడలేమి ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. అన్ని వనరులు అందుబాటులో ఉన్నా వరుస విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించడంలో ఇప్పటికీ తడబాటునే ఎదుర్కొంటోంది. అయితే బ్లాక్‌క్యాప్స్ ఎప్పుడైనా ప్రమాదకర జట్టే అనడంలో సందేహం లేదు. ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా కివీస్‌కు ఉంది. దీనికి తోడు ప్రస్తుం కివీస్‌లో పలువురు ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. విలియమ్సన్, మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, రాస్ టైలర్, నికోలస్, టామ్ లాథమ్, వాట్లింగ్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్న విషయం తెలిసిందే. ఇక, టాడ్ ఆస్ట్‌లే, గ్రాండోమ్, నిషమ్, బ్రేస్‌వెల్, సాంట్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆల్‌రౌండర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక, ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు చేసే టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రి, నీల్ వాగ్నర్ వంటి స్పీడ్‌స్టర్లు కూడా ప్రపంచకప్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఐష్ సోధి, ఎజాజ్, సోమ్‌విల్లే వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లు కూడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. అంతేగాక ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

New Zealand team until did not win World Cup