Home తాజా వార్తలు చివరి టెస్టు డ్రా కివీస్‌దే సిరీస్

చివరి టెస్టు డ్రా కివీస్‌దే సిరీస్

new-zealand

హామిల్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండో, చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ 10తో సిరీస్‌ను దక్కించుకుంది. మంగళవారం చివరి రోజు ఆటకి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. 96/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన కివీస్‌కు కెప్టెన్ విలియమ్సన్, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా స్కోరు వేగం తగ్గకుండా చూశారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇటు విలియమ్సన్, అటు రాస్ కుదురుగా ఆడడంతో ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాలన్ని బెడిసి కొట్టాయి. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 234 బంతుల్లో 11 ఫోర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు రాస్ కూడా తనవంతు పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రాస్ రెండు సిక్సర్లు, 11 బౌండరీలతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు అబేధ్యంగా 213 పరుగులు జోడించారు. కాగా, కివీస్ స్కోరు 241/2 ఉన్నప్పుడు వర్షం మొదలైంది.

దీంతో ఆట ముందుకు సాగలేదు. చివరికి ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 476 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోయ్ రూట్ (226) అద్భుత డబుల్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. రూట్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలావుండగా సిరీస్‌లో నిలకడగా బౌలింగ్ చేసిన కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

new zealand vs england test series