Thursday, April 25, 2024

దెబ్బకు దెబ్బ

- Advertisement -
- Advertisement -

New Zealand

 

రాహుల్ శతకం వృథా, భారత్‌కు హ్యాట్రిక్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

మౌంట్ మాంగానుయ్: భారత్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కివీస్ 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేగాక టి20 సిరీస్‌లో భారత్ చేతిలో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది. ఇక, బౌలర్ల వైఫల్యం భారత్‌ను మరోసారి వేధించింది. భారీ స్కోరు సాధించినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కివీస్ హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లోకేశ్ రాహుల్ (112) సెంచరీతో కదం తొక్కాడు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (62) అర్ధ సెంచరీతో రాణించాడు.

పృథ్వీషా, మనీష్‌పాండేలు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్, మార్టిన్ గుప్టిల్‌లు శుభారంభం అందించగా, చివర్లో గ్రాండోమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో కివీస్‌కు చారిత్రక విజయాన్ని సాధించి పెట్టాడు. నికోల్స్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. నిలకడగా రాణించిన సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టే లర్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.

శుభారంభం
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోల్స్ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. గుప్టిల్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. నికోల్స్ మాత్రం సమన్వయంతో ఆడాడు. ఈ జోడీని విడగొట్టడం భారత బౌలర్లకు శక్తికి మించిన పనిగానే మారింది. గుప్టిల్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. సైని, శార్దూల్‌లను లక్షంగా చేసుకుని స్కోరును పరిగెత్తించాడు. గుప్టిల్ చెలరేగి ఆడడంతో కివీస్ లక్షం దిశగా సాగింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న గుప్టిల్ 4 సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 46 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో నికోల్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించాడు. మరోవైపు నికోల్స్ మాత్రం సమన్వయంతో ఆడుతూ జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విలియమ్సన్ 22 పరుగులు సాధించాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు రాస్ (12) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఆ వెంటనే నికోల్స్ కూడా పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నికోల్స్ 103 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు సాధించాడు.

గ్రాండోమ్ విధ్వంసం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను వికెట్ కీపర్ టామ్ లాథమ్ తనపై వేసుకున్నాడు. మరోవైపు జేమ్స్ నిషమ్ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కొలిన్ డి గ్రాండోమ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. భారత బౌలర్లను హడెత్తిస్తూ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో గ్రాండోమ్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన గ్రాండోమ్ 28 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 28 బంతుల్లోనే 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లాథమ్ మూడు బౌండరీలతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో కివీస్ మరో 17 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో సైని, శార్దూల్‌లు ఘోరంగా విఫలమయ్యారు. బుమ్రా పొదుపుగానే బౌలింగ్ చేసినా వికెట్లను తీయడంలో విఫలమయ్యాడు. స్పిన్నర్లు చాహల్, జడేజాలు కూడా కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసినా జట్టును మాత్రం గెలిపించలేక పోయారు.

ఆరంభంలోనే
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశ పరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి జామిసన్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు. 9 పరుగులు మాత్రమే చేసిన కోహ్లిను బెన్నెట్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ పృథ్వీషా పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షా 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసి రనౌటయ్యాడు.

ఆదుకున్న శ్రేయస్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను వికెట్ కీపర్ లోకేశ్ రాహుల్, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తమపై వేసుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 9 ఫోర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో నాలుగో వికెట్‌కు రాహుల్‌తో కలిసి వంద పరుగులు జోడించాడు.

రాహుల్ శతకం
మరోవైపు రాహుల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారించాడు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. అతనికి మనీష్ పాండే అండగా నిలిచాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ రెండు సిక్సర్లు, మరో 9 ఫోర్లతో 112 పరుగులు సాధించాడు. అంతేగాక మనీష్‌త కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. ఇక, మనీష్ పాండే 42 పరుగులు సాధించాడు. చివర్లో ప్రత్యర్థి బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లను కూడా తీయడంతో భారత్ స్కోరు 296 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

New Zealand wins over India in 3rd odi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News