Home ఆఫ్ బీట్ వెనిజులాలో మళ్లీ మదురో

వెనిజులాలో మళ్లీ మదురో

Article about Modi china tour

లాటిన్ అమెరికాలో బొలివేరియన్ విప్లవానికి కీలకమైన వెనిజులాలో అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత సోషలిస్టు అధ్యక్షుడు నికోలస్ మదురో మరో ఆరేళ్ల పదవీ కాలానికి తిరిగి ఎన్నికైనారు. వామపక్ష చిచ్చిరపిడుగు హుగో ఛావెజ్ వారసుడైన మదురోను అధికారం నుంచి దింపేందుకు లోపల మితవాద ప్రతిపక్షం, బయట అమెరికా కుట్రలు ఫలించకపోవటంతో ‘ఇవి బూటకపు ఎన్నికలు అక్టోబర్‌లో మళ్లీ ఎన్నికలు జరపాలని’ గగ్గోలు పెడుతున్నాయి. ప్రతిపక్షంతో కుదిరిన ఒప్పందం ప్రకారమే, సాధారణంగా డిసెంబర్‌లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికను ముందుకు జరిపారు. ఐక్యతను సాధించటంలో విఫలమైన ప్రతిపక్షాలు ఎన్నికల బహిష్కరణకు ఇచ్చిన పిలుపు పని చేయలేదు. అయితే 46 శాతం మాత్రమే ఓట్లు పోలు కావటం ప్రజల్లోని నిరాసక్తతకు, ప్రతిపక్షాలపట్ల విశ్వాసరాహిత్యానికి కారణంగా కనిపిస్తున్నది. పోలైన ఓట్లలో మదురోకు 67.7 శాతం లభించగా, ఆయన ప్రధాన ప్రత్యర్థి మాజీ సైనికాధికారి, లారా రాష్ట్ర మాజీ గవర్నర్ హెన్రీ ఫాల్కన్‌కు 21.2 శాతం, మత ప్రచారకుడు జేవియర్ బెర్టుస్సీకి సుమారు 11 శాతం ఓట్లు లభించాయి. పోలింగ్‌కు ముందు ఒపీనియన్ పోల్స్ మదురో ఫాల్కన్ మధ్య పోటాపోటీగా పోటీ ఉన్నట్లు తెలియజేశాయి. ప్రతిపక్షం తన అభ్యర్థిత్వాన్ని బలపరచకపోవటం, బహిష్కరణ పిలుపు ఇవ్వటం తన ఓటమికి కారణంగా ఫాల్కన్ వాపోతున్నాడు.
దేశ కరెన్సీని డాలర్‌గా మార్చుతానని, ఛావెజ్ జాతీయం చేసిన ఆయిల్ కంపెనీలను తిరిగి పూర్వ యజమానులకు ఇచ్చేస్తానని, మానవతా సహాయాన్ని అనుమతిస్తానని ఈ స్వతంత్ర పోటీదారుడు చేసిన వాగ్దానాలను ఓటర్లు తిరస్కరించారు. అయితే ప్రజాస్వామ్యం గూర్చి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా, మదురోను అధికారం నుంచి తొలగించాలనే తమ పథకాలు ఫలించకపోవటంతో వెనిజులా ఎన్నికలను గుర్తించనంటోంది. అర్జెంటీనాలో ఒక సమావేశానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, పోలింగ్ ప్రారంభంకాగానే అవి బూటకపు ఎన్నికలని కొట్టిపారేశాడు.
అమెరికా తన పెరడుగా పరిగణించే లాటిన్ అమెరికాను ఛావెజ్ కుదిపివేశాడు. తాను వెనిజులా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తదుపరి అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేశాడు. అమెరికన్‌ల ఆధీనంలోని ఆయిలు కంపెనీలను జాతీయం చేశాడు. క్యూబాతో మైత్రితో లాటిన్ అమెరికా కరేబియన్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ఆయిలు డాలర్లను ప్రజాసంక్షేమానికి ఉపయోగించాడు. ఆ ప్రభావంతో పలు దక్షిణ అమెరికా దేశాల్లో వామపక్ష అనుకూల, సోషలిస్టు, మధ్యేమార్గ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకున్నారు. క్యాన్సర్‌తో ఆయన అకాలమరణం తదుపరి అమెరికా అండతో మితవాదులు మళ్లీ విజృంభించి వాటిలో పలు ప్రభుత్వాలను ఓడించారు. వెనిజులాను చేజిక్కించుకుంటే ఇక ఎదురులేదని మదురో ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచని చేయటానికి చేయని కుట్ర లేదు. వెనిజులా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆయిల్ ఎగుమతులపై ఆధారపడింది. నాలుగేళ్లుగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు నేలబారుగా ఉండటంతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు అనేక విధాల కష్టాలపాలైనారు. వేలాది మంది వలసవెళ్లారు. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఓడించాలని మితవాద ప్రతిపక్షాలు పథకాలు వేశాయి. అందులో భాగంగానే దుష్ప్రచారంతోపాటు అల్లర్లు లేవదీశాయి. అయినా సోషలిస్టు పార్టీని బలపరిచే ఓటర్లు బెదిరిపోకుండా, చెదిరిపోకుండా మదురోకు ఓటు చేశారు. ప్రతిపక్షాలు అనైక్యతతో ఎన్నికలు బహిష్కరించి అభాసుపాలైనాయి.
తనను తిరిగి ఎన్నుకుంటే ‘ఆర్థిక విప్లవం’ తెస్తానని మదురో ఓటర్లకు హామీయిచ్చాడు. గత సంవత్సరకాలంగా క్రమంగా క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతున్నందున ఆయనకు ఆ ఆత్మవిశ్వాసం ఏర్పడి ఉండవచ్చు. దేశంపై అమెరికా తదితర దేశాల ‘ఆర్థిక యుద్ధం’ వల్లనే పరిస్థితులు అధ్వాన్నమైనాయన్న మదురో మాటను ఆయన్ను అభిమానించే ప్రజలు నమ్మటం వల్లనే ఆయన విజయం సుసాధ్యమైంది. అయితే అమెరికా, మితవాద ప్రతిపక్షాలు కుట్రలు మానవు. శ్రమ జీవుల విశ్వాసాన్ని నిలుపుకోవటం, ఆహారం, మందులు వగైరా నిత్యావసర కొరతలు తీరుస్తూ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయటమొక్కటే ఆ కుట్రలకు సమాధానం.