Thursday, April 25, 2024

నష్టాలు ఆగడం లేదు

- Advertisement -
- Advertisement -

Sensex

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల వల్ల సెన్సెక్స్ 143 పాయింట్లు పడిపోయింది. ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఆఖరి రోజు కారణంగా మార్కెట్ కూడా హెచ్చుతగ్గులకు గురైందని వ్యాపారులు తెలిపారు. మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 143.30 పాయింట్లు (0.36 శాతం) కోల్పోయి 39,745.66 వద్ద ముగిసింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 45.20 పాయింట్లు (0.39 శాతం) నష్టపోయి 11,633.30 వద్ద స్థిరపడింది.

పెట్టుబడుల ఉపసంహరణ

కరోనా వైరస్‌పై పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. వారు బంగారం, బాండ్ల వంటి సురక్షితమైన ఎంపికల కోసం చూస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019 అక్టోబర్-డిసెంబర్ మూడవ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 4.5 శాతంగా ఉంటుందని అంచనా. ఇది సెంటిమెంట్ ప్రభావితం చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి డేటాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తుంది. చైనా వెలుపల కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రపంచ మార్కెట్లు క్షీణిస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా పెట్టుబడిదారులు మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. భారత్ వృద్ధి రేటు 4.5 శాతం స్థిరంగా ఉండవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఎస్‌బిఐ ఆర్థికవేత్తలు అధికారిక డేటాను విడుదల చేయడానికి రెండు రోజుల ముందు బుధవారం ఈ అంచనా వేశారు. ఈ కారణం వల్ల కూడా మార్కెట్ క్షీణించిందని భావిస్తున్నారు. పెద్ద స్టాక్స్ విషయానికొస్తే, సన్ ఫార్మా, బ్రిటానియా, టైటాన్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, మారుతి, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభపడ్డాయి. మరోవైపు విప్రో, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఒఎన్‌జిసి, ఐఒసి, జి లిమిటెడ్, యుపిఎల్, హెచ్‌సిఎల్ టెక్, ఎస్‌బిఐ, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టలతో ముగిశాయి. రంగాల వారీగా సూచీలను చూస్తే, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి మినహా అన్ని రంగాలు రెడ్ మార్క్‌లోనే ముగిశాయి. వీటిలో ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, మీడియా, మీడియా, ఐటి, రియాల్టీ, మెటల్, పిఎస్‌యు బ్యాంకింగ్ ఉన్నాయి.

సెన్సెక్స్ 39,731 వద్ద ప్రారంభించింది..

ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 157.83 పాయింట్లు (0.40 శాతం) నష్టపోయి 39,731.13 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ 39.90 పాయింట్లు (0.34 శాతం) పడిపోయి 11,638.60 వద్ద మొదలుపెట్టింది. దీని తరువాత ఉదయం 10:47 గంటలకు సెన్సెక్స్ 410.68 పాయింట్లు (1.03 శాతం) కోల్పోయి 39,478.28 స్థాయిలో ట్రేడయింది. అదే సమయంలో నిఫ్టీ 124.60 పాయింట్లు (1.07 శాతం) పడిపోయి 11,553.90 స్థాయిలలో కనిపించింది.

ఒఎన్‌జిసిలో అతిపెద్ద డ్రాప్

సెన్సెక్స్ కంపెనీలలో ఒఎన్‌జిసి అత్యధిక క్షీణతను నమోదు చేసింది. హెచ్‌సిఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బిఐ, సింధుఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు కూడా నష్టపోయాయి. మరోవైపు సన్ ఫార్మా, టైటాన్, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పెరిగాయి. బంగారం, యుఎస్ బాండ్ల వంటి సురక్షిత పెట్టుబడిగా భావించే ఆస్తులు బలపడ్డాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తగ్గాయి.

ఎఫ్‌పిఐలు రూ.6,812 కోట్లు వెనక్కి

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పిఐ) భారీ అమ్మకాలు రిటైల్ పెట్టుబడిదారుల అవగాహనను కూడా ప్రభావితం చేశాయని ట్రేడర్లు తెలిపారు. మార్కెట్ల తాత్కాలిక సమాచారం ప్రకారం, ఈ వారం ఎఫ్‌పిఐలు నికరంగా రూ.6,812.57 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ 0.83 శాతం తగ్గాయి.

Nifty closes above 11600 Sensex ends down 143 points

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News