Home తాజా వార్తలు నిఫ్టీ @ 12,000

నిఫ్టీ @ 12,000

Nifty

 

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో బిఎస్‌ఇ సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరగా, నిఫ్టీ కీలక 12 వేల మార్క్‌ను దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సన్‌ఫార్మా వంటి షేర్ల లాభాలతో సూచీలు ఉత్సాహంగా ఉరకలు వేశాయి. ప్రపంచ సంకేతాలు సానుకూలంగా ఉండడంతో మార్కెట్లు రోజంతా పటిష్టంగా కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 40,688 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది.

చివరికి 184 పాయింట్లు పెరిగి 40,654 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,012 వద్ద స్థిరపడింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వాణిజ్య వివాద పరిష్కారంలో సానుకూలం సంకేతాల నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ముగిశాయి. రంగాల వారీగా చూస్తే పిఎస్‌యు బ్యాంక్స్ 1.5 శాతం పతనమైంది. ఇక మెటల్, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి గ్రీన్ మార్క్‌లో ముగిశాయి.

నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్, హిందాల్కో, జెఎస్‌డబ్లు స్టీల్, వేదాంతా, ఆర్‌ఐఎల్, ఐటిసి, ఎసియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి లాభపడ్డాయి. అయితే యుపిఎల్ 8 శాతం డౌన్ అయింది. యస్ బ్యాంక్, గెయిల్, బిపిసిఎల్, సిప్లా, టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, హెచ్‌యూఎల్, యాక్సిస్, ఎల్ అండ్ టి డీలాపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 1011 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 1117 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.

Nifty tops 12,000 in Q2 results