Home జోగులాంబ గద్వాల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకే రైతు వేదికలు

వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకే రైతు వేదికలు

Niranjan reddy inaugurates rythu vedika in alampur

 

గద్వాల: రైతులను సంఘటితం చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, తక్కశిల గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశానికి తెలంగాణ రాష్ట్రం గర్వకారణంగా నిలిచిందని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఎకరాకు రూ. 5వేల ఆర్థ్ధిక సహాయంతో రైతుబంధు ద్వారా రైతులను ఆదుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతులు సంఘటితమైన నూతన సాంకేతిక పద్దతుల ద్వారా వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వీలుంటుందని మంత్రి తెలిపారు.

రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు తగు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు. రాష్ట్రంలో రూ. 572 కోట్ల నిధులతో 2600 రైతు వేదికలు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఇంతేకాక వైకుంఠధామాలు ప్రతిగ్రామంలో నిర్మించినట్లు మంత్రి వివరించారు. అల్లంపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డ్ ఆవరణలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలంపూర్ చౌరస్తాలో ఆసుపత్రి ఏర్పాటు అయితే సమీప గ్రామాలు జాతీయ రహదారి పక్కనే ఉన్నందున, ప్రజలకు వైద్యం సకాలంలో అందేలా ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేయడం వల్ల పచ్చదనం వెల్లివిరుస్తోందని మంత్రి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.

నీటి ద్వారా సంక్రమించే రోగాలు దరిచేరకుండా ఉండాలంటే గ్రామాలోల పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు ట్రాక్టర్లు అందజేశామని ప్రతి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డుకు చెత్తను తరలించిగ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతి గ్రామానికి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ సరిత, ఎంఎల్ఎ డాక్టర్ అబ్రహం, గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావు దేవరెడ్డి, జోగులాంబ ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్‌లు, జడ్పిటీసిలు, ఎంపిపిలు, సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Minister niranjan reddy inaugurates rythu vedika in alampur