Home తాజా వార్తలు మన రక్షణ మన చేతుల్లోనే!

మన రక్షణ మన చేతుల్లోనే!

Women

 

చదువుల్లో, ఉద్యోగాల్లో ముందున్నారు ఆడవాళ్లు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ సమాజంలో మహిళల పట్ల ఉన్న దృక్కోణం మాత్రం మారలేదు. ఎక్కడన్నా ఒంటరిగా దొరికితే చాలు వాళ్లను చిదిమేయగల తోడేళ్లు ప్రపంచంలో మనుష్యుల రూపంలో తిరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ ప్రియాంకపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోందీ ఘటన. మహిళల రక్షణ కోసం ఎన్నో యాప్‌లు, నెంబర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాటిని తమ ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలి. తమ రక్షణ తమ చేతుల్లోనే ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి.

ఇంత ఘోరం చేసిన వాళ్లకు సభ్య సమాజంలో బతికే హక్కు లేదని, చట్ట ప్రకారం వాళ్లని శిక్షించాలని, అలాగే ఆడపిల్లల స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్ నేర్పించమని, నిందితులను సజీవ దహనం చేయమని సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రియాంక రెడ్డిపై సానుభూతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సానుభూతి ప్రకటనల మధ్యన, కనుమరుగై పోయిన ప్రియాంకా రెడ్డి కన్నీటి చుక్కలాగా కనిపిస్తోంది అంతే. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటన తర్వాత నిర్భయ చట్టం తెచ్చారు. రాష్ట్రాలు కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. మహిళల భద్రతకు విభాగాల దళాలు ఏర్పాటు చేశారు. ఆడబిడ్డలపైన అత్యాచారాలు ఇంకా పెరిగాయే గానీ తగ్గలేదు.

ఈ నేపథ్యంలో ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కనీసం చుట్టూ ఉన్న వనరులు ఉపయోగించుకుని మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఎవ్వరినీ నమ్మకండి. ముఖ్యంగా భయపడకండి. భయపడ్డారా… సందేహంతో నిలబడ్డారా… మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్టే అని చెప్పుకోవలసిన తరుణం ఇది. ఆపద వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్‌కు లేదా ఆ సమయంలో ఏ రక్షణ దొరకలేదని తేలిపోయినప్పుడు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు, లొకేషన్ షేర్ యాప్‌లు మహిళలకు కొండంత అండగా నిలుస్తాయి. అందరి చేతుల్లోనూ ఫోన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ డౌన్‌లోడ్ చేసుకుని ఇక భద్రంగా ఉన్నామనుకోండి. 100, 112, 1091, 181 టోల్ ఫ్రీ నంబర్లు, షీటీమ్స్ 24 గంటలూ మహిళల కోసం పనిచేస్తున్నాయి.

100: ఏ మూల నుంచి అయినా 100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే ఆ కాల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళుతుంది. ఎలాంటి పరిస్థితిలో ఎక్కడ ఉన్నారో చెబితే చాలు. పోలీస్‌లకు గస్తీ వాహనాలను అప్రమత్తం చేసి నిమిషాల్లో అక్కడకు చేరుకుంటారు. ఈ నంబర్ ద్వారా తక్షణ పోలీస్ సహాయం లభిస్తుంది.

1091: మహిళలు, చిన్నపిల్లల కోసం పనిచేస్తుంది.

182: ఒంటరిగా రైల్లో ప్రయాణం చేస్తుంటే ముందుగా ఈ నంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి. ఈ కాల్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే రక్షక దళం (ఆర్పీ ఎఫ్) కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది.

112 మొబైల్ యాప్: కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్, ఆపదలో ఉన్నప్పుడు ఆ సమాచారం పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ ఫోన్‌లో 112 నంబర్ సేవ్ చేసుకోండి. హోంస్క్రీన్‌లో షార్ట్ కట్‌లో పెట్టుకుని దాన్ని నొక్కితే చాలు కాల్ వెళ్లిపోతుంది. ఫీచర్ ఫోన్ వాడుతున్నట్లయితే కీపాడ్ పైన 5, లేదా 6 నంబర్ నొక్కినా 112 కు వెళ్లిపోతుంది.. ముందు యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. స్త్రీలు, పిల్లల రక్షణ కోసం ఎన్నో యాప్‌లు పనిచేస్తున్నాయి.

hawkEye, watch over me, life 360, family locater…ఇలాంటివెన్నో యాప్‌ల ద్వారా అపాయంలో ఉన్నప్పుడు రెండు నిమిషాలకోసారి కాల్ చేయొచ్చు. కుటుంబ సభ్యులకు సేహితులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్లిపోతాయి. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎన్నో యాప్‌లు పని చేస్తున్నాయి. చదువుకుంటున్న , ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు, గృహిణులు అందరూ అందుబాటులోకి వచ్చిన ఇలాంటి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎమర్జెన్సీలో పనిచేసే ఫోన్‌లు ఉంచుకోవాలి. ఎలాంటి కష్టం వచ్చినా భయపడకుండా, ఏడుస్తూ నిలబడకుండా, ఎవరో ఒకరు రక్షణ కోసం వస్తారేమోనని దిక్కులు చూడకుండా ఈ యాప్‌ల ద్వారా పోలీసుల సాయం అందుకోవాలి.

1. మహిళలు, వృద్ధులు అత్యవసర సమయాల్లో/ రాత్రివేళల్లో ప్రయాణిస్తున్నప్పుడు తమ వాహనానికి ఏదైనా అయితే 100 లేదా 9490617111కు తమ లొకేషన్‌ను పంపించొచ్చు.
2. మహిళల రక్షణ కోసం హాక్ -ఐ పేరుతో యాప్ అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ పోలీసు యంత్రాంగం. ఇందులో సేవ్ అవర్ సోల్ అనే బటన్‌ను నొక్కితే క్షణాల్లో మీరు ఆపదలో ఉన్నారనే సమాచారం పోలీసులకు అందుతుంది.
3. షీ బృందాలు సంప్రదించేందుకు 9490616555 అందుబాటులో ఉంది. ఫోనులోని మ్యాప్స్‌లో లైవ్ లొకేషన్ షేరింగ్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి, కుటుంబసభ్యులకు షేర్‌చేస్తే… మనం ఎక్కడున్నామనేది సులువుగా తెలుసుకోగలుగుతారు.

మనం వాడే బండి, కారుకు సైతం జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. ఎప్పుడైనా మన వాహనం పోయినా ఆ ట్రాకర్‌తో తెలుసుకోవచ్చు. ఆత్మరక్షణకు ఉపయోగపడే రిస్ట్‌బ్యాండ్‌లు, గడియారాలు, గొలుసులు, నడుముకు కట్టుకునే గ్యాడ్జెట్లు ఇలా ఎన్నో యాండ్రాయిడ్ వేర్‌లున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. బూట్లు, పర్సుల్లో పెట్టుకునే చిన్నచిన్న గ్యాడ్జెట్లూ ఆన్‌లైన్‌లో దొరకుతున్నాయి. వీటి ద్వారా మనం ఎక్కడున్నామో మన సన్నిహితులకు తెలియజేయొచ్చు. ఆత్మరక్షణకూ సాంకేతికతను ఉపయోగించుకోవడం ప్రతి ఆడపిల్లా నేర్చుకోవాలి.

Nirbhaya act to Women safety