Saturday, April 20, 2024

నిర్భయ హంతకులకు రేపే ఉరి

- Advertisement -
- Advertisement -

Nirbhaya Convicts

 

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులోని నలుగురు దోషులను శుక్రవారం తెల్లవారుజామున 5. 30 గంటలకు ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు తుది ఏర్పాటు చేస్తున్నారు. జైలు నంబర్ 3లో నిర్భయ హంతకులు ముకేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్రవారం తెల్లవారుజామున 5. 30 గంటలకు ఒకేసారి ఉరితీసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బుధవారం ఉరితీసే చోట డమ్మీ బొమ్మలతో ఉరితీసే ప్రక్రియ నిర్వహించినట్లు జైలు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం మూడవ నంబర్ జైలులోని ఉరితీసే ప్రదేశాన్ని తలారి పవన్ జల్లద్‌తోసహా జైలు అధికారుల బృందం తనిఖీ చేసింది. బీహార్‌లోని బుక్సర్ నుంచి తెప్పించిన పది తాళ్లతో ఉరితీత ప్రక్రియను నేటి సాయంత్రం చివరిసారి అధికారులు పరీక్షించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖకు చెందిన మీరట్ నివాసి పవన్ జల్లద్‌ను ఉరితీత కోసం అధికారులు ప్రత్యేకంగా రప్పించారు. ఒక్కో ఉరికి పవన్‌కు రూ.15,000 జైలు అధికారులు చెల్లించనున్నారు. తీహార్ జైలులో ఒకేసారి నలుగురు ఖైదీలను ఉరితీయడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఉరితీసే సమయంలో పవన్‌తోపాటు జైలు సూపరింటెండెంట్, జైలు డాక్టర్ వంటి కొద్ది మంది అధికారులు మాత్రమే హాజరుకానున్నారు.

నలుగురు దోషులతో జైలు సూపరింటెండెంట్ ఈరోజు సాయంత్రం మాట్లాడి వారి చివరి కోరిక తెలుసుకోనున్నారని తీహార్ జైలు అధికారి ఒకరు చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు ఉత్తరం రాయడం వంటి చివరి కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చడం జరుగుతుందని ఆయన వివరించారు. జైలుకు చెందిన కౌన్సెలర్ల చేత నిర్భయ దోషులకు కౌన్సెలింగ్ ఇప్పించడం ఇప్పటికే పూర్తయిందని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకల్లా ఉరితీత కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ నలుగురు దోషులను మూడవ నంబర్ జైలులోని ఉరితీసే ప్రాంతానికి సమీపంలో ఉంచారు. వీరిని విడివిడిగా ఉంచారు. ఒక్కో ఖైదీని కనీసం 2-3 వార్డెన్లు గస్తీ కాస్తూ వారి ప్రతి చర్యను గమనిస్తున్నారు. బుధవారం వరకు ఈ నలుగురు దోషులలో ఎటువంటి భయాందోళన కనపడలేదని, కాని గురువారం ఉదయం నుంచి వారు తమ సెల్‌లోనే ఒంటరిగా గడుపుతున్నారని మరో జైలు అధికారి చెప్పారు. ఇటీవలి వరకు వారు ఉరిశిక్ష ఖైదీల్లా లేరని, రెండుసార్లు ఉరితీత వాయిదాపడడంతో వారిలో భయమనేది కనపడలేదని ఆయన వివరించారు. తమ చివరి కోరికగా నిర్దిష్టంగా వారు ఏదీ చెప్పలేదని, వారి మానసిక ఆందోళన కాని భయం కాని కనపడడ లేదని ఆయన చెప్పారు. అయితే బుధవారం రాత్రి నుంచి వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. జైలు గార్డులతో కూడా వారు ముభావంగా ఉంటున్నట్లు తెలిసిందని ఆ అధికారి చెప్పారు.

Nirbhaya convicts to be hanged on Friday at 5.30 am, Tihar Jail authorities are on preparations to hang the four Delhi gang rape convicts
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News