Home జాతీయ వార్తలు యుపి ఘటన ఖండనార్హమే.. మిగతావాటి మాటేది

యుపి ఘటన ఖండనార్హమే.. మిగతావాటి మాటేది

Nirmala Sitharaman Condemns Lakhimpur Violence
విమర్శకులపై నిర్మల ఎదురుదాడి

బోస్టన్ : లఖింపూర్ ఘటన గర్హనీయం, దీనిని అంతా ఖండించాల్సిందే. అయితే ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలపై ఎందుకు మాట్లాడటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లో ఇష్టాగోష్టి దశలో ఆమె మాట్లాడారు. ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ఇటువంటి అవాంఛనీయ ఘటనలపై కూడా స్పందించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ఉంది కాబట్టి రాద్ధాంతానికి దిగుతున్నారని అనుకోవల్సిందే కదా? అని ప్రశ్నించారు. స్పందనల దశలో కొన్నింటినే నిర్థిష్టంగా ఎంచుకోవడం కొన్నింటిని వదిలిపెట్టడం ఏం పద్థతి అవుతుందని నిలదీశారు. అమెరికాలో అధికారిక పర్యటనకు భారత ఆర్థిక మంత్రి వెళ్లారు, ఈ దశలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో కీలక అంశాలను ఆమె ప్రస్తావించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో రైతులపై వాహనాలు దూసుకువెళ్లడం పలువురి మరణం, తరువాతి దశలో కేంద్ర మంత్రి కుమారుడు అశిష్ మిశ్రా అరెస్టు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

యుపిలో జరిగిన ఘటనపై ప్రధాని నుంచి కానీ ఇతర సీనియర్ మంత్రుల నుంచి కానీ ఎందుకు స్పందన లేదని ఆర్థిక మంత్రికి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఇటువంటి ఘటనలు యుపిలో జరిగినా ఇంకెక్కడ జరిగినా తామెవ్వరం సమర్థించడం లేదన్నారు. అవి చాలా బాధాకరమనే ప్రస్తావిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాలలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిపై తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. దారుణాలు ఎక్కడ జరిగినా దర్యాప్తు క్రమంలో పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. యుపి ఘటనకు సంబంధించి తమ మంత్రివర్గ సహచరుడి కుమారుడు ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారని, నిజంగా ఘటనలకు బాధ్యులు వారే అయితే అదంతా కూడా సమగ్ర దర్యాప్తులోతేలుతుంది. చట్టప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. యుపిలో జరిగిన పరిణామంతో తమ పార్టీ కానీ ప్రధాని మోడీ కానీ ఇరకాటంలో పడ్డారనే వాదన సరికాదని, ఇటువంటి ఘటనలు మొత్తం ఇండియానే ఇబ్బందిలోకి నెడుతాయని అంగీకరించారు. తాను దేశం కోసం మాట్లాడుతానని, పేదలకు న్యాయం వాంచిస్తానని తెలిపారు. యుపిలో ప్రస్తుత పరిణామాలకు నూతన వ్యవసాయ చట్టాలే కారణం అనుకుంటే ప్రభుత్వం వీటిని అమాంతంగా తీసుకురాలేదని, పది సంవత్సరాలుగా వ్యవసాయ సంస్కరణలపై విశ్లేషణలు జరిగాయి.

పలు పార్లమెంటరీ కమిటీలు సుదీర్ఘస్థాయిలో మధించాయి. ఆ తరువాతనే చట్టాలు వెలుగులోకి వచ్చాయని ఆర్థిక మంత్రి వివరించారు. చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులు కేవలం రెండు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలకు చెందిన వారే అని, అక్కడి వారితో కూడా చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఏది ఏమైనా పార్లమెంట్‌లో విస్తృతస్థాయి చర్చల తరువాతనే బిల్లుకు ఆమోదం దక్కిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పాదన తగ్గి సంక్షోభం నెలకొందనే వాదనను ఆర్థిక మంత్రి తోసిపుచ్చారు. ఈ విషయంలో విద్యుత్, బొగ్గు శాఖల మంత్రులు పేర్కొన్న అంశాలనే తాను తిరిగి ప్రస్తావిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు దేశం మిగులు విద్యుత్ దేశాల జాబితాలో ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.