Home జాతీయ వార్తలు అమర్త్యా … తగునా ఇది మీకు

అమర్త్యా … తగునా ఇది మీకు

Nirmala Sitharaman's Swipe At Amartya Sen
ఓ చట్రంలో బందీలయి మోడీపై దాడి
ఇదేం మేధోతనం ఇదేం నిర్మాణాత్మకం
అమెరికా ఇష్టాగోష్టిలో ఆర్థిక మంత్రి నిర్మల

బోస్టన్ : విద్యావంతులు, విశ్లేషకులు ఎక్కువగా వారివారి వ్యక్తిగత ఇష్టాయీష్టాల చట్రంలో బందీలయ్యారని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఇటువంటి వైఖరి చాలా ప్రమాదకరమని ఆమె పరోక్షంగా ఆర్థికవేత్త అమర్తాసేన్‌పై నిప్పులు చెరిగింది. క్షేత్రస్థాయి, వాస్తవిక పరిస్థితులు ఏమిటనేవి వారు పట్టించుకోవడం లేదు. వీటి గురించి వారికి అవగావహన ఉన్నా వాటిని గాలికొదిలేస్తున్నారు. వారు ఏదైనా విషయంపై ఏర్పర్చుకుని ఉన్న అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇదేం మేధాలక్షణమనేది అర్ధం కావడం లేదన్నారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లో మూసావర్ రహ్మనీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో ఆర్థిక మంత్రి కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రత్యేకించి హార్వర్డ్ ప్రొఫెసర్ లారెన్స్ సమ్మర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.

‘ మన సమాజంలో అత్యధికులు ప్రత్యేకించి ఆర్థికవేత్త అమర్తాసేన్ వంటి వారు బిజెపి ప్రభుత్వం పట్ల ఎందుకు సానుకూల వైఖరితో లేరు? దీనిపై మీరేమనుకుంటున్నారు’ అని లారెన్స్ ప్రశ్నించారు. ఇదంతా కూడా కొందరు తమదైన చట్రంలో ఉంటూ చేస్తున్న విమర్శల ఫలితం అని నిర్మల తేల్చిచెప్పారు. అన్ని చోట్లా హింసాకాండకు కేంద్రంలోని బిజెపి ప్రభుతాన్ని నిందించడం పరిపాటి అయిందని మండిపడ్డారు. పలు రాష్ట్రాలు ప్రత్యేకించి బిజెపి పాలన లేని చోట్ల జరిగే హింసాత్మక ఘటనలకు ప్రధాని మోడీ బాధ్యత ఉందని చెప్పడం ఎంతవరకు సబబు? దీని కన్నా హాస్యాస్పదం మరోటి ఉంటుందా? అని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. తాను డాక్టర్ సేన్‌ను గౌరవిస్తానని, ఆయన పేరును ప్రశ్నకులు ప్రస్తావించినందున ఆయన గురించి చెప్పాల్సి వస్తోందన్నారు. తాను తనకున్న బాధ్యతల మేరకు అందరి గురించి ఆలోచిస్తానని తెలిపారు. సేన్ వంటి విశ్లేషకులు భారత్‌కు వెళ్లినప్పుడు అక్కడ ప్రజలతో కలివిడిగా తిరిగినప్పుడు, చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోగల్గినప్పుడు ఆయన వంటి మేధావులు, వాస్తవికతను ప్రాతిపదికగా చేసుకుని మాట్లాడితే అది తమకు ( ప్రభుత్వానికి) ఉపయోగంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతులపై జరిగిన దాడి తరువాతి పరిణామాలు ఆర్థిక మంత్రి పాల్గొన్న చర్చాగోష్టిలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. కీలక అంశాల నిపుణులు, స్కాలర్స్ వాస్తవాలను మాట్లాడటం లేదని, వారు కేవలం వారు తమంతతాము నిర్థిష్టంగా ఖరారు చేసుకుని ఉన్న అభిప్రాయాల పరిధిలోనే స్పందిస్తున్నారని అన్నారు.

ఎవరైనా మౌలిక పరిస్థితిని గమనించాలి. అన్నింటిని బేరీజు వేసుకుని మాట్లాడితే వ్యాఖ్యలు వేరే విధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి స్పందించారు. ‘ఎవరికైనా దేనిపైనా అయినా ఎటువంటి అభిప్రాయం అయినా ఉండవచ్చు. అది వ్యక్తిగతం అవుతుంది. అయితే సామాజిక అంశాలపై అభిప్రాయాలు వాస్తవికత ప్రాతిపదికన ఉండటం మరో అంశం. ఎవరికైనా వారి ఉద్ధేశాల ప్రకారం అభిప్రాయాలు ఖరారు అయి ఉంటే , ఇక అటువంటి వాటిపై నేను ఎటువంటి ఎదురుదాడికి దిగాల్సిన అవసరం లేదు. దిగిన ప్రయోజనం లేదు’ అని నిర్మల ఘాటుగానే స్పందించారు. ఇదంతా కూడా నిద్రనటిస్తున్న వారిని మేల్కొలిపే యత్నాలుగా ఉంటుందన్నారు. నిజంగానే నిద్రపోతున్న వారిని తట్టిలేపితే కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే నిద్రపోతున్నట్లుగా నటించే వారిని లేవండని చెప్పడం వల్ల వారు లేస్తారా లేవరే ’ అని నిర్మల వ్యాఖ్యానించారు.

శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోనివి

భారతదేశానికి సంబంధించి శాంతి భద్రతల అంశం చాలా కీలకమైనది, దీనిపై ప్రాంతాల వారిగా ఎక్కడికక్కడ వేర్వేరుగా అదుపు ఉంటుంది. సంబంధిత విషయంపై రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఆ బాధ్యత రాష్రాలపై ఉంటుందని అన్నారు. అమెరికాలో ఏదైనా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉంటే దీనికి జవాబుదారి ప్రెసిడెంట్ కారు. ఆయా రాష్ట్రాలదే బాధ్యత అని గుర్తు చేశారు. ఇండియాలో కూడా ఇదే విధమైన పద్ధతి ఉందన్నారు. ప్రధానికి చెందని పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగే హింసాత్మక ఘటనలకు ప్రధాని లేదా అధికార బిజెపి ఏ విధంగా జవాబుదారి అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలలో జరిగే దుస్సంఘటనలకు బాధ్యత ఆయా రాష్ట్రాలకు చెందిన సిఎంలు, అక్కడి అధికార యంత్రాంగంపై ఉంటుందన్నారు.

బిజెపియేతర రాష్ట్రాల తీరుపై స్పందించరేం

ప్రధాని మోడీని ఎన్నో సందర్భాలలో ఎందరో తిట్టిపోశారు. పరుష పదజాలంతో విమర్శలకు దిగారు. ఇటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. ఆయన పేరు పెట్టి మాట్లాడారు. అయితే అటువంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? వారిని విచారించారా? లేదే. మరి అదే బిజెపి పాలిత ప్రాంతాలలో అయితే సిఎంలను తిట్టడం జరిగితే ప్రశ్నిస్తే వెంటనే వారి అరెస్టులు జరుగుతున్నాయి. వారిని జైలులోకి తోస్తున్నారు. కావాలంటే అటువంటి రాష్ట్రాల పేర్లు బయటపెడుతాను’ అన్నారు. ఇక మేధావులు పనిగట్టుకుని ప్రధాని మోడీపై విమర్శలకు దిగుతున్నారు కానీ ప్రతిపక్ష రాష్ట్రాలలోని కీలక విపరీత పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. భారతదేశపు సహనపు సంస్కృతికి భంగం వాటిల్లుతున్నదనే వాదనలలో వైరుద్థాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని నిలదీశారు.

జరిగే ప్రతి దాడి వెనుక ప్రధాని బాధ్యత ఉందనడం, మతకోణాలు సృష్టించడం, బిజెపి కారణం అనడం ఆ తరువాత జరిగిన దర్యాప్తు క్రమాలలో నిజాలు తేలడం అంతకు ముందటివి కేవలం ఆరోపణలే అని స్పష్టం కావడం గురించి అంతా ఆలోచించాల్సి ఉందన్నారు. ఎన్నికలలో ప్రధాని మోడీ బలోపేతం అవుతూ వస్తున్నప్పుడల్లా జరిగే పరిణామాలకు ప్రధానిదే బాధ్యత అని నిందించడం, కొందరు పౌర హక్కుల నేతలు, ప్రముఖులు తమకు దక్కిన ప్రజా పురస్కారాలను అంటే పద్మ అవార్డులను ఇచ్చివేయడం వంటివి ఓ తంతుగా సాగాయని, అయితే విచారణల పరిధి, బాధ్యతల కోణంలోకి రాని ప్రధాన వ్యక్తిని కేవలం విమర్శల లక్షంతో తమ దాడి పరిధిలోకి తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా? దీని వల్ల స్పష్టం అయ్యేది ఎవరి వైఖరి అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.