Home కెరీర్ ఎస్‌సి,ఎస్‌టిల నుంచి చదువుల ఎవరెస్టులు

ఎస్‌సి,ఎస్‌టిల నుంచి చదువుల ఎవరెస్టులు

Nit in the rank of crop

తాజుద్దీన్, మన తెలంగాణ : దేశ విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఎస్‌సి, ఎస్‌టి గురుకుల విద్యార్థులకు చోటు లభించడం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలే లేవు. 2014 నుండి ఇప్పటివరకు ఎస్‌సి గురుకులాల్లో చదువుకున్న 122 మంది డాక్టర్లు కాబోతున్నా రు. అమెరికా విద్యా సంస్థల్లోనూ ప్రపంచ స్థాయి పోటీని తట్టుకొని 11 మం ది ఎస్‌సి విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కెనెడి లుగర్ యూత్ స్టూడెంట్స్ ఎక్చేంజ్ ప్రోగ్రాంకు నలుగురు ఎస్‌సి గురుకుల విద్యార్థులు ఎంపిక కా గా కమ్యూనిటీ కాలేజి ఇన్షియేటివ్ ప్రొగ్రాం (యుఎస్‌ఎ)కు ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రతిష్ఠాత్మక అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ (బెంగళూరు)లో 79 మంది, ఢిల్లీ యూనివర్శిటీలో 77 మంది, టాటా ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో 11మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 45 మంది, ఐఐటిలలో 58మంది, ఎన్‌ఐటిల్లో 122 మంది గురుకుల విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇవే గాకుండా కమ్యూనిటీ కాలేజ్ ఇన్షియేటివ్ ప్రోగ్రా మ్, హార్వర్డ్ యూనివర్శిటీ సమ్మర్ క్రాస్ రోడ్ ప్రోగ్రా మ్స్, ఇండియన్ నెవీ స్కూల్ (గోవా), ఇండియన్ ఆర్మీ స్పోర్ట్ కంపెనీలకు కూడా గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. గిరిజన గురుకుల విద్యార్థులు కూడా అద్భుత ర్యాంకు లు సాధించారు. ఐఐటిలో 62 మంది, ఎన్‌ఐటిలో 102 మంది, ట్రిపుల్ ఐటి లో28 మంది, ఎఐఐఎంఎస్ (ఎయిమ్స్), ఎంబిబిఎస్‌లలో ఏడుగురు మొత్తం 201మంది గిరిజన విద్యార్థులు ర్యాంకులు సాధించారు.

అద్భుత ఫలితాలు : పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో గురుకుల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా ప్రతీ ఏడాది గురుకుల విద్యార్థులదే పై చేయిగా ఉంటోంది. 2017-18లో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 83.78 శాతమే అయినా ఎస్‌సి గురుకుల విద్యార్థులు మాత్రం 90.5% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం 67.2 కాగా ఎస్‌సి గురుకుల విద్యార్థులు ఉత్తీర్ణత శాతం 86.5% నమోదయ్యింది. గిరిజన గురుకుల విద్యార్థులు 87% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం.
ఒయు డిగ్రీ ఫలితాల్లో 2016-17సంవత్సరానికిగాను యూనివర్శిటీ సగటు ఉత్తీర్ణత 36.4% ఉంటే ఎస్‌సి గురుకుల విద్యాసంస్థల ఉత్తీర్ణత 70% నమోదయ్యింది. కాకతీయ యూనివర్శిటీ సగటు ఉత్తీర్ణత 30.8% అయితే గురుకుల విద్యాసంస్థల ఉత్తీర్ణత 81%, ఎంజి యూనివర్శిటీ ఉత్తీర్ణత 21.42 శాతం అయితే గురుకుల ఉత్తీర్ణత 68%, పాలమూరు యూనివర్శిటీ సగటు ఉత్తీర్ణత 25.81% అయితే గురుకుల విద్యాసంస్థల ఉత్తీర్ణత 84 శాతం, శాతవాహన యూనివర్శిటీలో 34% అయితే గురుకులాల్లో 85 శాతం, తెలంగాణ యూనివర్శిటీ సగటు ఉత్తీర్ణత 24.6% అయితే గురుకుల ఉత్తీర్ణత శాతం 75 కావడం గమనార్హం.

హార్డ్ వర్క్ టు హార్వర్డ్ : టాలెంట్ ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఆనంద్. రంగారెడ్డిజిల్లా ఇబ్రాహీంపట్నం గురుకుల విద్యార్థి ఆనంద్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీ అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ ఫెలోషిప్ – హార్వర్డ్ సమ్మర్ క్రాస్‌రోడ్స్ ప్రోగ్రామ్స్‌కు ఎంపికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా2500 పోటీపడగా అందులో ఎంపికైన వంద మందిలో ఆనంద్ ఒకడు.

నీట్‌లో ర్యాంకుల పంట : కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ సీట్లు పొందుతున్న ఈ రోజుల్లో పైసా ఖర్చు లేకుండా నిరుపేద విద్యార్థులు వైద్య వృత్తిలో అడుగు పెడ్తున్నారు. గురుకులాల్లో చదువులు పూర్తి చేసుకొని ఉన్నత విద్యను కొనసాగించలేని విద్యార్థులకు ఏడాది కాలం పాటు కార్పొరేట్ స్థా యిలో అత్యుత్తమ ప్రమాణాలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం 20 15లో ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రాం’ (ఓపీబీసీ)పేరుతో సరికొత్త పథకాన్ని, ప్రారంభించింది. ప్రతిభ కలిగిన నిరుపేద పిల్లలకు వరంగా మారింది. గౌలిదొడ్డి గురుకుల విద్యాలయంలో ఈ శిక్షణా కేంద్రం కొనసాగుతోంది. న్యాయ విద్య,ఐఐటి,నీట్‌వంటి పోటీపరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేస్తున్నా రు. మొదటి ఏడాదిలోనే 50 మంది విద్యార్థులు నీట్‌లో ర్యాంకులు సాధించి మెడిసిన్‌లో అడ్మిషన్లు పొందారు.రెండోబ్యాచ్‌లో 42మందిసీట్లు సాధించారు.

అనాథాశ్రమం నుంచి లా యూనివర్శిటీ దాకా : చదివించేందుకు అయ్యే ఖర్చుకు భయపడి బడి మాన్పించిన నిరుపేద కుటుంబం మణిది. ఈ పరిస్థితుల్లో మణిని హైదరాబాద్‌కు చెందిన ఓ క్రిస్టియన్ సంస్థ తన అనాథ ఆశ్రమంలో చేర్చుకుంది. నాల్గవ తరగతి దాకా అనాథాశ్రమంలో చదివిన మణి ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా మహేంద్రహిల్స్ గురుకుల విద్యాసంస్థలో చదువుకుంది. ‘క్లాట్’ ఎస్‌సి క్యాటగిరిలో ఆల్ ఇండియా 525 ర్యాంకు సాధించింది. ప్రస్తుతం విశాఖపట్టణం నేషనల్ లా యూనివర్శిటీలో న్యాయవిద్యను అభ్యసిస్తోంది. పేదలు, మహిళలు, పిల్లల హక్కుల కోసం వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని మణి చెబుతోంది.

ఢిల్లీ యూనివర్శిటీలో గురుకుల హవా : రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమదైన రీతిలో రాణించిన, రాణిస్తున్న గొప్పగొప్ప వ్యక్తులు, శక్తిగా ఎదగడానికి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఇంధనంగా ఉపయోగపడుతాయి. అలాంటి విశ్వవిద్యాలయాల్లో గురుకుల విద్యార్థులు అడ్మిషన్లు సాధించడం తెలంగాణ రాష్ట్రానికి, గురుకుల సొసైటీకి గర్వకారణం. ప్రఖ్యాత డిల్లీ విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు 12 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు సాధించారు.

అజీం ప్రేమ్‌జీలో అంతా మనవాళ్లే : ప్రతిష్ఠాత్మక అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీలో తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల నుంచి ఇప్పటివరకు 72 మంది విద్యార్థులు ఉచితంగా సీట్లు సాధించారు. ఇది ఓ రికార్డు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే వీరంతా..
నా జీవితానికో మలుపు..సిద్దార్థ : కెనడీ లూగర్ యూత్ ఎక్స్‌ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్‌కు ఎంపికై అమెరికాలో చదువకునే అవకాశం లభించడంపై ఆనందంగా ఉందని గురుకుల విద్యార్థి సిద్దార్థ అమెరికా నుంచి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఉన్నత విద్య అమెరికాలో కొనసాగిస్తానని నేనెప్పుడు ఊహించలేదు, కానీ ఈ అడ్భుతం జరుగడానికి తెలంగాణ ప్రభుత్వం, గురుకుల సొసైటీలే కారణం అని ఆయన అన్నారు.

ఎవరెస్టు శిఖరంపై 13ఏళ్ళ గిరిజన బాలిక
13 ఏళ్ళ చిరు ప్రాయంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ పూర్ణ మలావత్  అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా విశ్వాన్ని జయిస్తామని నిరూపించింది. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన లక్షి దేవిదాసుల కుమార్తె పూర్ణ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యావిధానం అవకాశంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఆమె మే 25, 2014న మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది.

సెయిలింగ్‌లో గోల్డ్ సాధించిన సచిన్
ఇంటర్నేషనల్ రెగెట్టా (పడవ పందెం)లో 11ఏళ్ళ సచిన్ అదరగొట్టాడు. గతేడాది చెన్నైలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రెగెట్టా ఛాంపియన్‌షిప్ జూనియర్ కేటగిరిలో సచిన్ రెండు బంగారు పతకాలు సాధించాడు. ప్రస్తుతం గోవాలోని ఇండియన్ నేవీ పాఠశాలలో చదువుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సచిన్ తండ్రి రోజు కూలి. హైదరాబాద్ షేక్‌పేట గురుకుల పాఠశాలలో చదువుకున్న సచిన్‌కు సెయిలింగ్‌లో ఉన్న అభిరుచిని గమనించి టీచర్లు, సొసైటీ అధికారులు తగిన శిక్షణనిప్పించారు. అతని ప్రతిభ వల్ల గోవాలోని ఇండియన్ నెవీ పాఠశాలలో ప్రవేశం లభించింది.