Home బిజినెస్ ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రైవేటీకరణ

ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రైవేటీకరణ

  • ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచన
  • ఇప్పటికే రూ.30 వేల కోట్ల రుణాలు రద్దు
  • మరింత పెరిగిన అప్పు

Air-India

న్యూఢిల్లీ : ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇంకా అప్పుల ఊబీ నుంచి బయటపడలేకపోవడంతో ఈ సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు గాను ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని సమాచారం. ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ సంస్థకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినా కోలుకునే అవకాశాలు కనిపించడం లేకపోవడం, కంపెనీ ఇప్పటికీ నష్టాల్లోనే ఉండడం.. ఇంకా నిధులను ఇవ్వడం వృధా అని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విమాన సంస్థను విక్రయించాలని కూడా కేంద్రం ఆలోచనగా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సంస్థ వాటాలను విక్రయించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మొగ్గుచూపుతున్నారని, భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇటీవల నీతి ఆయోగ్ ప్రభుత్వానికి అందజేసిన నాలుగో నివేదికలో.. రూ.30 వేల కోట్ల రుణాల రద్దుతో సహా ఎయిర్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్(పెట్టుబడుల ఉపసంహరణ) వంటి సూచనలు ఇచ్చింది. ఎయిర్ ఇండియా అప్పు దాదాపు రూ.60 వేల కోట్లు ఉండగా.. దీనిలో రూ.21 వేల కోట్ల రుణాలు విమాన సంస్థకు చెందిన రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ రూ.8 వేల కోట్లు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి కార్యాలయానికి నీతి ఆయోద్ సమర్పించిన సిఫారసులలో ఎయిర్ ఇండియాలో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో దేశీయ, ప్రైవేట్ విమాన సంస్థలకు అవకాశం కల్పించాలని కోరింది. ప్రధానంగా బ్రిటిష్ ఎయిర్‌వేస్, జపాన్ ఎయిర్ లైన్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌లో ఆయా ప్రభుత్వాలు మొత్తం వాటాలను విక్రయించినట్టు ఉదాహరణగా సూచించింది. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నీతి ఆయోగ్ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్‌లైన్లపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఒప్పందం ద్వారా రూ.70,000 కోట్ల విలువైన 111 బోయెంగ్ విమానాలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా మరింత అప్పుల ఊబిలోకి కూరకుపోయిందని సిబిఐ ఆరోపించింది. దీనికి సంబంధించి విమానయాన శాఖ, ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసింది. సిబిఐ విచారణకు సహకరిస్తామని పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్ గజపతి ప్రకటించారు.