Home జాతీయ వార్తలు సుశాంత్ మృతిపై సిబిఐ దర్యాప్తు

సుశాంత్ మృతిపై సిబిఐ దర్యాప్తు

Nitish faces pushback for CBI probe in Sushant case

 

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయం
నిందితురాలు రియా పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

పాట్నా: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ తండ్రి అభ్యర్థనను పురస్కరించుకుని ఆత్మహత్య కేసుగా నమోదైన ఈ కేసు దర్యాప్తును సిబిఐకి సిఫార్సు చేయాలని బీహార్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. సుశాంత్ సింగ్ తండ్రి కెకె సింగ్ రాష్ట్ర డిజిపి గుప్తేశ్వర్ పాండేని కలసి తన కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతోపాటు ఈ కేసును సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని డిజిపి పాండే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే దీనిపై ప్రతిపాదన తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధమైన వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుందని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు.

సుశాంత్ సింగ్ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న అతని స్నేహితురాలు రియా చక్రవర్తిపై పాట్నాలో ఎఫ్‌ఐఆర్ దాఖలు కాగా ఈ కేసు దర్యాప్తును ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా అంతకు ముందు రోజే బీహార్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించడం సంచలనం సృష్టించింది. రియా చక్రవర్తి పిటిషన్‌పై ఉత్తర్వులు జారీచేయడానికి ముందు తమ వాదన వినాలని కోరుతూ బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో వేర్వేరుగా కేవియట్లు దాఖలు చేశాయి. సుశాంత్ తండ్రి కూడా సుప్రీంకోర్టులో మరో కేవియట్ వేశారు.

పాట్నా పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి ముంబయి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకునే సుశాంత్ సింగ్ తండ్రి తన కుమారుడి మృతిపై సిబిఐ దర్యాప్తు కోరారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సన్నిహితుడైన ఒక వ్యక్తి వెల్లడించారు. పాట్నా పోలీసులకు చెందిన నలుగురు సభ్యుల దర్యాప్తు బృందానికి ముంబయి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని, ప్రత్యేక పోలీసు బృందానికి సారథిగా ఆదివారం ముంబయి వచ్చిన బీహార్ ఐపిఎస్ అధికారిని నగరంలో కొవిడ్-19 ఆంక్షల పేరిట క్వారంటైన్‌కు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ముంబయి పోలీసుల చర్యను బీహార్ ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

అధికారిక విధుల్లో ఉన్న సిట్ అధిపతి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడంపై బీహార్ డిజిపి పాండే ముంబయి మునిసిపల్ అధికారుల వద్ద లాంఛనంగా నిరసన నమోదు చేశారు. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ తండ్రి 74 ఏళ్ల కెకె సింగ్ తన కుమారుడి మృతిపై జులై 25న పాట్నాలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అందులో ఆయన నటి రియా చక్రవర్తి, మరి కొందరిపై ఫిర్యాదు చేశారు. జులై 27న పాట్నా నుంచి పోలీసు బృందం ముంబయికి దర్యాప్తు ప్రారంభించింది. కాగా, ఇదే అంశం సోమవారం బీహార్ శాసనసభలో ప్రస్తావనకు రాగా పార్టీలకతీతంగా సభ్యులందరూ సుశాంత్ మరణంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండు చేశారు.