Friday, April 26, 2024

బీహార్‌లో బిజెపి కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: బీహార్‌లో ఊహించినదే జరిగింది. వాస్తవానికి ఇది 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జరిగి ఉండాల్సింది. అప్పుడు బిజెపి చేతిలో నితీశ్ కుమార్ తిన్నది మామూలు దెబ్బ కాదు. ఒక పార్టీ తన మిత్రపక్షం కాళ్ళ కింద అంతగా గొయ్యి తవ్విన సందర్భం అరుదు. అది ప్రజాస్వామ్య విలువల పట్ల బొత్తిగా గౌరవంలేని బిజెపికే చెల్లును అనిపించింది. ఆ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్‌ను పాచికగా ప్రయోగించి నితీశ్ కుమార్ సారథ్యంలోని జెడి (యు) బలాన్ని దాదాపు సగానికి కుదింపజేసిన కుట్ర సాధారణమైనది కాదు. నితీశ్‌పై వ్యక్తిగత దాడికి దిగిన చిరాగ్ ఆ ఎన్నికల్లో జెడి(యు) నిలబడిన ప్రతి చోట తన అభ్యర్థులను బరిలో దింపి చాలా స్థానాల్లో అది ఓడిపోయేట్టు చేశాడు.

దానితో బీహార్ శాసన సభలో అంతకు ముందు 73 స్థానాలున్న జె డి(యు) బలం 43కి పడిపోయింది. బిజెపి 74 స్థానాలు గెలుచుకుంది. గిల్లి బుజ్జగించినట్టు తిరిగి నితీశ్ నే ముఖ్యమంత్రిని చేయడంతో బిజెపి, జెడి(యు) పొత్తు ఇప్పటి వరకు కొనసాగింది. కాని ఎడమొగం, పెడమొగంగానే సాగుతూ వచ్చింది. వీలు చిక్కినప్పుడెల్లా బిజె పి రాష్ట్ర నాయకులు నితీశ్‌పై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. వాటిని భరిస్తూనే ఆయన అత్యంత అయిష్టంగా ఆ కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఇంతకాలం కొనసాగారు. నితీశ్‌ను దెబ్బ తీయడానికి ఉపయోగపడిన చిరాగ్ పాశ్వాన్‌ను బిజెపి గడ్డిపోచ కంటే అధ్వానంగా పరిగణించి పక్కన పెట్టింది. తాజాగా జెడి(యు) నేత ఆర్‌పి సింగ్‌ను మరో పావుగా ప్రయోగించబోయింది. ఒకప్పుడు తనకు అతి సన్నిహితుడుగా ఉండి తన ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడైన సింగ్‌ను వాడుకొని మహారాష్ట్ర తరహాలో జెడి (యు)లో పెద్ద చీలిక తేవాలని బిజెపి కుట్ర పన్నినట్టు గ్రహించిన నితీష్ కుమార్ దానితో పొత్తుకు స్వస్తి చెప్పారు. 2021లో నితీశ్‌కు ఇష్టం లేకపోయినా ఆర్‌పి సింగ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. అందుకు ప్రతీకారంగా నితీశ్ ఇటీవల సింగ్‌ను జెడి(యు) తరపున తిరిగి రాజ్యసభకు పంపించలేదు.

శాసనసభలో అతి పెద్ద పార్టీ అయిన ఆర్‌జెడి, దాని మిత్రపక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తదితర పార్టీల నేతలతో కలిసి నితీశ్ కుమార్ మంగళవారం నాడు గవర్నర్‌కు రాజీనామా సమర్పించడం, వాటి మద్దతుతో మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరడం, అందుకు ఆయన అంగీకరించడం హుటాహుటిన జరిగిపోయాయి. గవర్నర్ కనుక ఈ ఏర్పాటుకు తిరస్కరిస్తే తాము ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా చవిచూడవలసి వస్తుందని బిజెపి అధిష్ఠానం గమనించినట్టుంది. కొత్త ఐక్య సంఘటన ప్రభుత్వ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నేడు సాయంత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనితో ఆయన రెండో సారి మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి కానున్నారు. జెడి(యు), ఆర్‌జెడి కలిసి 2015లో ఒకసారి మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ ఎన్నికల్లో ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ కలిసి మహాఘట్ బంధన్ పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఘన విజయం సాధించారు. ఆ ప్రభుత్వం 2017 వరకు కొనసాగింది. అప్పుడు దానిని చీల్చి నితీశ్ కుమార్‌ను బిజెపి తన వైపు లాక్కొన్నది. నితీశ్ అప్పుడు బిజెపి, జెడి(యు) ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పొత్తు ఇప్పుడిలా బిజెపి కుట్రదారీ రాజకీయాల వల్ల చిత్తయింది.

వెనుకబడిన తరగతుల కుల జనగణన జరిపించాలని కోరడానికి తేజస్వి యాదవ్‌ను వెంటబెట్టుకొని నితీశ్ ప్రధాని మోడీని కలిసినప్పుడే జెడి(యు), ఆర్‌జెడి ల మధ్య తిరిగి పొత్తుకు బీజాలు పడ్డాయనే సంకేతాలు వెలువడ్డాయి. నితీశ్ కొత్త ప్రభుత్వం లో ఆర్‌జెడికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే శాసనసభలో దానికి 79 స్థానాల విశేష బలం ఉంది. 2014 సాధారణ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా బిజెపి ప్రకటించినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీతో గల 15 సంవత్సరాల పొత్తుకు నితీశ్ స్వస్తి చెప్పారు. అప్పటి నుంచి నితీశ్‌పై పగబట్టిన మోడీ బీహార్‌లో అనివార్యంగా జె డి(యు)తో పొత్తును కొనసాగనిస్తూనే ఆయనను వ్యక్తిగతంగా దెబ్బ తీస్తూ వచ్చారు. కేంద్ర కేబినెట్‌లో జెడి(యు)కు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు. ఆర్‌పి సింగ్ ను ప్రయోగించి నితీశ్‌ను జెడి(యు)లో ఒంటరిని చేయాలనుకున్న కుట్ర కూడా అందులో భాగమే. ఇప్పుడు ఆర్‌జెడితో నితీశ్ కుమార్ కుదుర్చుకున్న ఈ పొత్తు బీహార్ భవిష్యత్ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది కీలక ప్రశ్న. నితీశ్ వరుసగా అటు మతతత్వ బిజెపి మద్దతుతో ఇటు సెక్యులర్ కూటమి అండతో ముఖ్యమంత్రి అవుతూ వుండడం విశేషం. రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రతిపక్ష రహిత భారతాన్ని సృష్టించడానికి బిజెపి కేంద్రంలో తనకున్న అధికారాలను దుర్వినియోగం చేయడం అంతం కాకపోతే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News