Home దునియా నిజాంరాజుల చెరువుల నిర్మాణాలు

నిజాంరాజుల చెరువుల నిర్మాణాలు

Lake

దక్కన్ పాలించిన అనేక రాజవంశాలు చెరువుల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. కాకతీయులతో చెరువుల నిర్మాణం ఉద్యమంగా ముందుకుపోయి అనంతరం బహమనీసుల్తానులు, గోల్కొండ రాజులు, నిజాం పాలకులు చెరువుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.19వ శతాబ్దం చివరి నాటికి దేశంలోని బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో పెద్ద నదులపై ఆనకట్టలు, డ్యాంల నిర్మాణాలతో పాటు చెరువుల నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్ సంస్థానంలో సాలర్ జంగ్ సంస్కరణల అనంతరం చెరువుల నిర్మాణం వేగవంతంగా జరిగాయి.

అందుబాటులోకి వచ్చిన కొత్త ఇంజనీరింగ్, టెక్నాలజీని సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యంలోకి తీసుకొచ్చాడు. హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్న మూసి కాలువ వరదల నివారణకు నిజాంరాజు అనేక నిర్మాణాలను చేపట్టారు. మూసినదిపై 1908 సెప్టెంబరు 28న అసాధారణమైన వరదలు సంభవించినాయి. సెప్టెంబర్ 26,27న కురిసిన వర్షపాతం 32.5 సెంటీ మీటర్లుగా నమోదు అయ్యింది. ఇది హైదరాబాద్ చరిత్రలో అతి పెద్ద వర్షపాతం. 800 చదరపు మైళ్ళ మూసీ పరివాహక ప్రాంతంలో 788 చెరువులు ఉన్నాయి. ఇందులో దాదాపు 221 చెరువులు తెగిపోయినాయి. ఈ వరద బీభత్సానికి మూసీకి రెండు వైపులా చదరపుమైలు విస్తీర్ణంలో 19 వేల ఇండ్లు కూలిపోయినాయి. 80 వేల మంది నిరాశ్రయులు అయినారు. 10 నుండి 15 వేల మంది వరదల్లో కొట్టుకు పోయారు. మూసి వరదల నివారణకు చర్య లు చేపట్టాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆనాటి ప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు బాధ్యతలు అప్పగించారు.

సహాయకుడిగా ఇరిగేషన్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ప్రతిభావంతుడైన ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌ని నియమించింది. హైదరాబాద్ పునర్ నిర్మాణం. భవిష్యత్‌లో వరదలురాకుండా చర్యలు, హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం సమగ్ర నివేదిక రూపొందించాలనే బాధ్యతలను నిజాంరాజు ఈ ఇద్దరు ఇంజనీర్లకు అప్పగించారు.

అలీ నవాజ్ జంగ్ ప్రాథమికంగా మూసీ, ఈసీ నదులపై సమగ్ర సర్వే నిర్వహించినాడు. సర్వే నివేదికలను, హైడ్రలాజికల్ అంశాలని విశ్లేషించిన తర్వాత హైదరాబాద్ కు వరద ముప్పు రాకుండా రెండు జలాశయాలను నిర్మించాలని ఇద్దరు ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒకటి హైదరాబాద్ నగరానికి ఎగువన 8.5 మైళ్ళ దూరంలో మూసీకి అడ్డంగా 8.4 టి.యం.సిల నిల్వ సామర్థ్యంతోఉస్మాన్ సాగర్ డ్యాం, 6.5 మైళ్ళ దూరంలో ఈసీకి అడ్డంగా 11.95 టి.ఎం.సిల నిల్వ సామర్ధ్యంతో హిమాయత్ సాగర్ డ్యాం నిర్మించాలని చేసిన ప్రతిపాదనలను నిజాం రాజు అనుమతించారు.

ఉస్మాన్ సాగర్ నిర్మాణానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 23 మార్చ్ 1913న పునాదిరాయి వేశాడు. ఉస్మాన్ సాగర్ నిర్మాణం 1918 లో పూర్తి అయింది. హిమాయత్ సాగర్ నిర్మాణం 1918 లో ప్రారంభమై 1926 లో పూర్తి అయింది. ఉస్మాన్ సాగర్ నిర్మాణానికి అయిన ఖర్చు రూ.55 లక్షలు. హిమాయత్ సాగర్ నిర్మాణానికి అయిన ఖర్చు 86 లక్షల 75 వేలు. ఈ రెండు జలాశయాల నిర్మాణాన్ని పర్యవేక్షించిన వారు హైదరాబాద్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. వీటి నిర్మాణం జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం శాశ్వతంగా వరదల నుంచి విముక్తి పొందింది. అంతేకాక ఈ రెండు జంట జలాశయాలు ఆ రోజుల్లో మొత్తం హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేవి.

1970 దశకం దాకా హైదరాబాద్ నగరంలో 24 గంటలు నల్లాల్లో నీళ్ళు వచ్చేవట. సర్కారీ నల్లా బారా ఘంటా ఖుల్లా అన్న నానుడి కూడా పుట్టింది. ఉస్మాన్ సాగర్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుతో నిర్మాణం అయితే, హిమాయత్ సాగర్ రాకుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతోనిర్మాణం జరిగింది. నిర్మితమయింది. అదే సమయంలో హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి వెళుతున్న మూసీకి ఇరు వైపులా ఎత్తైన రాతి గోడలను నిర్మించి మూసీ, ఈసీల నుంచి వచ్చే అదనపు జలాలను సాఫీగా దిగువకు పోయేందుకు వీలు కల్పించినారు. హైదరాబాద్ నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థని ప్రతిపాదించి నిర్మింపజేసిన ఘనత కూడా వారిదే.

ఆ రోజుల్లో ఇటువంటి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన నగరాలు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉండేది. అయితే 60 ఏళ్ళ సమైఖ్య పాలకులు నాటి రాజుల దూరదృష్టిని కలుషితం చేశారు. చెరువులను కాలుష్యసాగరాలుగామార్చడంతో పాటు పట్టణీకరణపేరుతో శికం భూముల కబ్జాలకు పాల్పడటంతో ప్రశ్నార్థకమైన పైదరాబాద్ చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే మనచరిత్ర, మన చెరువులను కాపాడుకునే ప్రయత్నంలో మనమంతా భాగస్వాము లమై నిరంతర కృషి చేసేందుకు కంకణబద్దుల మవుదాం.

వి. భూమేశ్వర్