ఉ. 8గం.కు ఎంఎల్‌సి
ఎన్నికల కౌంటింగ్,
2 గంటల్లో ఫలితం
కల్వకుంట్ల కవిత
గెలుపుపై టిఆర్‌ఎస్ ధీమా
మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లుచేశారు. 50 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తుతో నిజామాబాద్‌కు తరలించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బాలెట్స్ లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఆరు టేబుళ్లలో, రెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. బ్యాలెట్ ద్వారా పోలైన మొత్తం ఓట్లను కుప్పగా పోసి 25 ఓట్లు ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. లెక్కింపు చేసే ప్రాంతంలో సిసికెమెరాల ఏర్పాటు చేశారు. అయితే తొలిరౌండ్‌లోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. నిబంధనల మేరకు కౌంటింగ్ పూర్తి అయిన రెండు గంటలకు పోలింగ్ అధికారులు విజేతను ప్రకటించనున్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు పోటీలో ఉన్న రాజకీయ పార్టీలనుంచి పార్టీకి ఇద్దరిని అనుమతిస్తారు. బ్యాలెట్‌తో జరిగిన ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు చేసేందుకు అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈ నెల 9న 50 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగాయి. రికార్డు స్థాయిలో 99. 64 శాతం ఓట్లు పోలయ్యాయి. పోటీలో ప్రధానంగా టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు నిలిచారు. టిఆర్‌ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన కల్వకుంట్ల కవితకు టిఆర్‌ఎస్ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్ల బలం 570 ఉండగా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో విపక్షాల నుంచి అనేకమంది స్థానిక సంస్థల ప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే అధికార టిఆర్‌ఎస్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో మొత్తం ఉన్న 824 స్థానిక సంస్థల ప్రతినిధుల్లో అత్యధికంగా టిఆర్‌ఎస్‌లో చేరడం, ఎంఐఎం టిఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి కవిత 90 శాతం వరకు మెజారిటీ పుంజుకున్నట్లు టిఆర్‌ఎస్ అంచనావేసింది. ఇదిలా ఉండగా మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు దక్కించుకుంటేనే రాజకీయపార్టీల నుంచి నిలబడ్డ అభ్యర్థికి డిపాజిట్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్, బిజెపిలో డిపాజిట్ గుబులు పుట్టింది. కల్వకుంట్ల కవిత గెలుపు ఖరారు అయినప్పటికీ అధికారింగా సోమవారం మధ్యహ్నం ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు ప్రకటించ నున్నారు.
14న మండలికి రానున్న కవిత
మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బుధవారం తొలిసారిగా ఎంఎల్‌సి హోదాలో శాసనమండలికి హాజరు కానున్నారు. బుధవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బుధవారం శాసనమండలిలో జరిగే చర్చల్లో కవిత పాల్గొననున్నారని అధికారులు చెప్పారు.