Home తాజా వార్తలు ఎంఎల్‌సి ఉప ఎన్నిక మళ్లీ వాయిదా

ఎంఎల్‌సి ఉప ఎన్నిక మళ్లీ వాయిదా

Council poll

 

45 రోజులు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ వాయిదా వేసింది.

ఈ మేరకు ఇసి లేఖ రాసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో 45 రోజులు వాయిదాను పొడిగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన ఎన్నిక జరిగి, 9వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.

అయితే అప్పటికే దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్లు క్యూ లైన్‌లో నిలబడటం, ఇవిఎంలను ముట్టుకోవడం వంటివి ఉండటం, ఇటీవల నిజామాబాద్‌లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో మరో 45 రోజులు వాయిదా వేసింది.