Friday, March 29, 2024

మీ బండారం బయటపెడతా

- Advertisement -
- Advertisement -

టిఎన్‌జిఒ నేతల అక్రమ
ఆస్తుల చిట్టా విప్పుతా
క్షమాపణలు చెప్పేదేలేదు
ఉద్యోగుల జీవితాలను
నాశనం చేస్తున్న
కొందరు నేతలు
ఉద్యోగ సంఘాల
నాయకులకు కోట్లు..
ఉద్యోగులకు పాట్లు
తగ్గేదేలే…అంటూ
బండి బూతు పురాణం

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎన్‌జిఒ నేతలకు క్షమాపణలు చెప్పనని, వారే చెప్పాలని రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. మీ ఆస్తులను మొత్తం బయటపెడుతానని హెచ్చరించారు. టిఎన్‌జిఒ నేతలను ఇంకా తిడుతూనే వుంటానని తేల్చి చెప్పారు. నలుగురు టిఎన్జీవో నేతలు ఒక్కసారైన జీతాల గురించి మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. మీకు కోట్లాది రూపాయల ఆస్తులు వున్నాయని, సామాన్య ఉద్యోగులు పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జిఒకు వ్యతిరేకంగా కొట్లాడి తాను జైలు కెళ్లానని, లాఠీ దెబ్బలు తిన్నది తామని అన్నారు. మీ పిఆర్‌సి కోసం మేం కోట్లాడామని గుర్తు చేశారు. హెడ్‌మాస్టర్లతో టిఆర్‌ఎస్ సర్కార్ బాత్‌రూమ్‌లు కడిగించిందని ఆరోపించారు. మీరు నలుగురు వెళ్లి కడగాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీరు పిలుపునిస్తే ధర్నాకు ఎంతమంది వచ్చారని ఆయన చురకలు వేశారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది ల బ్ది పొందుతున్నారో చెప్పాలని టిఆర్‌ఎస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ ఎంత వున్నాయో ఇక్కడ ఎంత వున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎంఎల్‌ఎలను జం తువుల మాదిరిగా పట్టుకొచ్చి టిఆర్‌ఎస్ సర్కార్ సర్కస్ ఫీట్లు చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓటర్లకు ముఖం చూపించలేకపోతున్నారని దు య్యబట్టారు. బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి మొ నగాడిలాగా తిరుగుతున్నాడని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ సర్కార్ హామీలను ప్రజలు నమ్మడం లేదని, ఆర్టీసిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అశ్వత్థామరెడ్డిని ఎన్నో ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్టీసి కార్మికులు బలికావొద్దన్నారు.

కొందరు టిఎన్‌జివో నాయకులు ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్నారు : బండి

‘కొంతమంది టిఎన్‌జివో నాయకులు ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్నారు. నేను వాళ్లకు క్షమాపణ చెప్పాల్నా.. మీరే ముక్కు నేలకు రాసి ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. పొర్లు దండాలు వేయాలే.. మీ స్వప్రయోజనాల కోసం, మీ ప్రమోషన్లు, పైరవీల కోసం టిఆర్‌ఎస్ సర్కార్ దగ్గర మోకరిల్లినార’ని బండి విమర్శించారు. ‘మీ సంగతి చూస్తాం.. మీ బండారం బయటపెడతాం… ఎసిబికి పట్టుబడ్డోళ్లు.. మీరు.. ఏనాడైనా ఉద్యోగుల మనోభావాలను పట్టించుకొన్నారా? అందుకే మిమ్మల్ని పక్కా తిడతా.. టిఆర్‌ఎస్ సర్కార్ మోచేతి నీళ్లు తాగే బానిస బతుకులు బతుకుతున్న ఆ కొద్దిమంది టిఎన్జీవో నాయకులు’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘హెచ్‌ఆర్‌సి తగ్గిస్తే కూడా నోరు మెదపని దద్దమ్మలు. బిజెపి పోరాడితే తప్ప జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంటే ఎన్నడైనా సర్కార్‌ని నిలదీశారా? మీకేమో కోట్ల ఆస్తులున్నాయి, కానీ ఉద్యోగులు సక్రమంగా జీతాలు రాకపోతే లోన్లు కట్టలేక, కిరాయి కట్టలేక అల్లాడుతున్నారు.

3 డిఎలు ఇయ్యల, సరెండర్ లీవ్స్ లేవు. 317 జివోతో చెట్టుకొకడు పుట్టకొకరుగా మారిండ్రు’ ఎందుకు నిలదీయలే..’ అని తనదైన శైలిలో బండి ప్రశ్నించారు. ‘నేను బరాబర్ మాట్లాడతా.. ఉద్యోగాల కోసం జైలుకు పోయిన, 317 జివోకు వ్యతిరేకంగా పోరాడిన, జైలుకు పోయిన. మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నరు.. కేసులు ఎదుర్కొంటున్నరు. యాడపోయిండ్రు ఈ సోకాల్డ్ టిఎన్‌జివో నాయకులు’ అని బండి నిలదీశారు. ‘ఈ ముగ్గురు, నలుగురు టిఎన్‌జివో నాయకుల్లారా.. నోరెందుకు విప్పరు? ఎసిబికి అడ్డంగా దొరికినోడు ఇయ్యాళ మంత్రులైండు. మీ జెండాలు కలిసినయ్.. పార్టీలు కలిసినయి. సంతోషమే.. కానీ కొంతమంది మనసులు కూడా కలిసినయ్.. మీ సంగతి తెల్వదా? నన్ను కెలికితే మీ బండారం బయటపెడతా, మీ సంగతి చూస్తా’నని బండి ధ్వజమెత్తారు.

ఈటలపై దాడి టిఆర్‌ఎస్ గూండాల పనే…

మునుగోడులో బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌పై టిఆర్‌ఎస్ శ్రేణుల రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై బండి స్పందించారు. టిఆర్‌ఎస్ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. ఈటల చాలా సౌమ్యుడని, ఆతనిపైనే దాడి చేశారని దుయ్యబట్టారు.

దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు…

జీతాలు రాక అల్లాడుతున్న జిహెచ్‌ఎంసి ఉద్యోగురాలు మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మహత్యకు టిఆర్‌ఎస్ సర్కార్‌దే బాధ్యత అని అన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రాబోయేది బిజెపి ప్రభుత్వమే.. ఏర్పడేది పేదల ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. ఇన్నాళ్లు పగ్గాలిచ్చి తప్పు చేశాం.. ఇకనైనా సరిదిద్దుకుందాం.. అని మునుగోడు ప్రజలనుద్దేశించి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News