Thursday, March 28, 2024

ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు లేవనడం పచ్చి అబద్ధం

- Advertisement -
- Advertisement -

No deaths due to oxygen shortage 'completely false': Satyendar Jain

కేంద్రం ప్రకటనపై ఢిల్లీ సర్కార్ ఎదురుదాడి

న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక మరణాలు సంభవించాయని, ప్రాణవాయువు కొరత వల్ల దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పచ్చి అబద్ధమని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ మరణించకపోతే ప్రతి రోజూ ఒకదాని తర్వాత మరో ఆసుపత్రి హైకోర్టులో ఎందుకు పిటిషన్లు వేశాయని ప్రశ్నించారు. ఆక్సిజన్ కొరత కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని ఆసుపత్రులు చెబుతుండగా మీడియా కూడా ఇదే విషయాన్ని రోజూ తెలియచేశాయని ఆయన తెలిపారు. ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరత గురించి టివి చానళ్లు, వార్తాపత్రికలు రోజూ కథనాలు ప్రసారం చేశాయని, ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని ప్రకటించడం పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు.

ఆక్సిజన్ కొరత కారణంగా సంభవిస్తున్న మరణాల గురించి కేంద్రం ఎన్నడూ తమను సమాచారం కోరలేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఒక కమిటీని నియమించడం ద్వారా అటువంటి మరణాల సంఖ్యను నిర్ధారించడానికి ప్రయత్నించిందని జైన్ తెలిపారు. అటువంటి మరణాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆ కమిటిని కూడా రద్దు చేయించారని ఆయన ఆరోపించారు. అదే జరగకపోయి ఉంటే ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో ఎంతమంది మరణించారో కచ్ఛితమైన సమాచారాన్ని అందచేసి ఉండేవారమని, ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ మరణించలేదని చెప్పేందుకే కేంద్రం ఆ కమిటీని రద్దు చేసి ఉంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో తెలియచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News