Home కరీంనగర్ నెలన్నరగా నీళ్లు బంద్

నెలన్నరగా నీళ్లు బంద్

Krishna-Bhasker45 రోజులుగా గ్రామానికి మంచినీళ్లు సరఫరా కావడం లేదు
డయల్ యువర్ కలెక్టర్‌లో కొడిముంజ వాసుల ఫిర్యాదు

మన తెలంగాణ / సిరిసిల్ల: 45 రోజులుగా తమ గ్రామంలో మంచినీరు సరఫరా కావడం లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌లో సోమవారం వేములవాడ మండలం కొడిముంజ గ్రామానికి చెందిన మల్లేశం ఫిర్యాదు చేశారు. డివైసిలో సోమవారం కలెక్టర్ పాల్గొనలేదు. జిల్లా రెవెన్యూ అధికారి శంకర్ కుమార్ డివైసిని కొనసాగించారు. ఉదయం 10 గంటల నుండి 10.30 గంటల వరకు నిర్వహించిన డివైసి కి 22 మంది తమ సమస్యలను వివరించారు. శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన శంకర్ భూ సమస్యను వివరిస్తూ విఆర్‌వో పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని డివైసిలో ఫిర్యాదు చేశారు. దమ్మన్నపేటకు చెందిన బాబయ్య ఎస్‌సి కార్పొరేషన్ రుణాలు అందడం లేదన్నారు. వేములవాడకు చెందిన తోట అనిల్ గ్రామ పారిశుద్దంపై ఫిర్యాదు చేశారు. పోత్గల్‌కు చెందిన హన్మంతు చెక్ డ్యాం రిపేర్ చేయించాలని కోరారు. ఇల్లంతకుంటకు చెందిన బాబు కులాంతర వివాహం చేసుకున్నానని తనకు పరిహారం అందలేదన్నారు. అదేవిధంగా తనకు ప్రభుత్వం కేటాయించిన భూమి అన్యాక్రాంతమైందని ఫిర్యాదు చేశారు. ముస్కానిపేట సర్పంచ్ పర్శరాములు మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం వల్ల పెన్షన్‌దారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా పంపిణీ చేయాలని కోరారు. కందికట్కూర్‌కు చెందిన దేవయ్య మాట్లాడుతూ తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందించాలన్నారు. వేములవాడకు చెందిన ఉప్పరి లక్ష్మి మాట్లాడుతూ తమకు కంప్యూటర్ పహాణీ కాపీలు ఇవ్వడానికి ఏడాది కాలంగా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

నర్మాల గ్రామానికి చెందిన కర్రోళ్ల రాజు నర్మాల నుండి గొల్లపల్లి వరకు వేస్తున్న డబుల్ రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేయడం వల్ల ఇబ్బందులెదుర్కొంటు న్నామని ఫిర్యాదు చేశారు. సిరిసిల్లకు చెందిన వంశీకృష్ణ ఉపాధి కల్పించాలని కోరారు. పెద్దూర్‌కు చెందిన లింగానాయక్ తమకు ఆర్‌వోఆర్ చేయడం లేదని వివరించారు. వేములవాడకు చెందిన ఆజయ్ మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని కోరారు. కొదురుపాకకు చెందిన నాగరాజు మాట్లాడుతూ ముంపు గ్రామంలో యువతకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. సిరిసిల్లకు చెందిన కవిత 8వ వార్డులో చెత్త తీయడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్దం పట్ల శ్రద్ద చూపడం లేదని ఫిర్యాదు చేశారు. చందుర్తికి చెందిన శ్రీ సాయి మాట్లాడుతూ తమ తండ్రిని బంధువులు మోసగించి భూమిని కాజేశారని ఫిర్యాదు చేశారు. కందికట్కూర్‌కు చెందిన హరీశ్ మాట్లాడుతూ మధ్య మానేరు ముంపు పరిహారం అందడం లేదన్నారు. బోయిన్‌పల్లికి చెందిన ప్రసాద్‌గౌడ్ మాట్లాడుతూ బోయిన్‌పల్లి-వేములవాడ మార్గంలో రోడ్డు ప్రక్కన పెద్ద వ్యవసాయ బావి ఉందని మూల మలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న బావిని తొలగించాలని కోరారు. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన విజయలక్ష్మి మాట్లాడుతూ తాను వికలాంగురాలినని తన భర్త పవర్‌లూం వర్కర్ అని వివరిస్తూ తమకు ఉపాధి కల్పించాలని కోరారు. బండలింగంపల్లికి చెందిన రాము డివైసిలో మాట్లాడుతూ పంట రుణం చెల్లించినా తమ పాసుపుస్తకాలను గూడెంలోని తెలంగాణ బ్యాంక్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. సిరిసిల్లకు చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వారధి వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముస్కానిపేటకు చెందిన బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇల్లంతకుంట శివారులోని తన భూమిని మ్యూటేషన్ చేయమని ఏడాది కాలంగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. డివైసి నిర్వహించిన 30 నిమిషాల్లో 22 మంది తమ సమస్యలను వివరించారు. మొదటి డివైసి కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించగా 25 మంది పాల్గొన్నారు. రెండో డివైసి డిఆర్‌ఒ నేతృత్వంలో సాగగా 22 మంది పాల్గొనడం విశేషం. జిల్లా స్థాయి అధికారులందరూ డివైసిలో పాలు పంచుకున్నారు.