Friday, March 29, 2024

ఎపి సిఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇడి కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఇడి కేసులో ఇకనుంచి జగన్ కోర్టుకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నేరుగా ఇవ్వకపోయినా తన తరఫున ఇంకొక సహ నిందితుడు ఈ కేసులో హాజరుకావడానికి అనుమతి ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు సిబిఐ కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు అంశాలను న్యాయస్థానం విచారించిన అనంతరం ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. మినహాయింపు ఇవ్వడం వల్ల ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ కేసులోని ప్రధాన నిందితుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం సిఎం స్థానంలో ఉన్నారని, అలాంటి వ్యక్తికి మినహాయింపు ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అందువల్ల కోర్టుకు హాజరయ్యే విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని ఇడి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని, అన్ని కేసుల విచారణకు ఎపి సిఎం జగన్ స్వయంగా హాజరు కావాలని ఇడి వాదించింది. ఇడి న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన సిబిఐ కోర్టు ఈ మేరకు పిటిషన్లను తోసిపుచ్చింది. వచ్చేవారం నుంచి జగన్ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని, హాజరుకాని పక్షంలో తగు ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. ఇటీవలే సిబిఐ కేసుల్లో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును న్యాయస్థానం తిరస్కరించిన విషయం విదితమే. తాజాగా ఇడి కేసుల్లో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఇదిలావుండగా శుక్రవారం(24వ తేదీ)జరిగిన విచారణ నుంచి జగన్ కు ముందే మినహాయింపు లభించడంతో ఆయన హాజరుకాలేదు. ఈ కేసులోని మిగతా నిందితులు ఎంపి విజయసాయిరెడ్డి, వ్యాపారవేత్తలు ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐఎఎస్ అధికారిణి శ్రీలక్మి తదితరులు విచారణకు హాజరయ్యారు.

No Exemption to Jagan on personal attendance:CBI Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News