Home తాజా వార్తలు ఫ్లోరైడ్ పరార్

ఫ్లోరైడ్ పరార్

No fluoride affected villages in Telangana

 

ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ
పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటన

తెలంగాణ ఆవిర్భావం నాటికి 967 గ్రామాల్లో ఫ్లోరైడ్ రక్కసి
2020లో సున్నాకు చేరిన సంఖ్య
సిఎం కెసిఆర్ కలల పథకం మిషన్ భగీరథ అమలుతో అద్భుత ఫలితం
మిషన్ భగీరథ బృందానికి మంత్రి కెటిఆర్ అభినందనలు

తెలంగాణను 100శాతం సాగునీటిమయం చేస్తాం. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రక్కసిని నిర్మూలిస్తాం. ఆ జిల్లాను వ్యాధి బారి నుంచి విముక్తిగావించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను

2014, 2016 సంవత్సరాల్లో పలు సందర్భాల్లో సిఎం కెసిఆర్ వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: ఫ్లోరోసిస్ సమస్యను తెలంగాణ రాష్ట్రం జయించింది. గత పాలకులకు చేతకాని సమస్యను తెలంగాణ ప్రభుత్వం అవలీలగా చేసి చేసి చూపించింది. కేవలం ఆరేళ్ళ వ్యవధిలోనే రాష్ట్రాన్ని ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగింది. ఇందుకోసం అంకితభావంతో పనిచేసింది. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఫలితంగా దేశంలో పలు రాష్ట్రాలు సాధించలేని ప్రగతిని తెలంగాణ రాష్ట్రం సాధించిన మరోసారి పతాక శీర్షకన నిలబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంవత్సరాలుగా పలు గ్రామాల్లో ఫ్లోరోసిస్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫ్లోరైడ్ సమస్యను టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ఆరు ఏళ్ళ వ్యవధిలోనే పరిష్కరించగలిగింది.

ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలన్న లక్షంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ఇంటింటికి సరఫరా చేసి రాష్ట్రంలో ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పారదోలింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 967 గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యతో నలిగిపోతుండేవి. అధిక ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న నీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలపై తీవ్ర ప్రభావం నెలకొనేది. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఈ సమస్య ఉండేది. ముఖ్యంగా మునుగోడ్, నాంపల్లి, మారిగుడ, దేవరకొండ వంటి గ్రామాల్లో లక్ష మందికి పైగా ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతుండేవారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధ్యం కానీ అనేక సమస్యలను పరిష్కరించి సుసాధ్యం చేసింది.

దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అమలు చేస్తూ ప్రగతి పథం వైపు తెలంగాణ దూసుకపోతున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యకు కూడా శాశ్వతంగా చెక్‌పెట్టగలిగింది. దీని కారణంగానే తెలంగాణలో ప్రస్తుతం ఏ ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ సమస్య లేదని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పరిష్కరించిందని రాష్ట్రంపై కేంద్రం సభలో ప్రశంసల జల్లుకురిపించింది. ఇప్పుడు తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలను కాగడ పెట్టి వెదికినా కనిపించవని వ్యాఖ్యానించింది. దేశంలోని గుజరాత్, ఉత్తరాఖండ్‌లతో పాటు సున్నా ప్రభావిత ప్రాంతాలతో ఫ్లోరైడ్ లేని రాష్ట్రంగా తెలంగాణ ఉద్భవించిందని పేర్కొంది.

ఈ స్పూర్తిని ఇతర రాష్ట్రాలు కూడా తీసుకుని ప్రజలను ఫ్లోరోసిస్ సమస్య నుంచి విముక్తి కల్పించాలని సూచించింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీటిని అందించాలన్న లక్షంతో మిషన్ భగీరథ పథకాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం 2016, ఆగస్టు 7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించింది. దీని కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 42వేల కోట్లను ఖర్చు చేసింది. కృష్ణా, గోదావరి నదులతో పాటు ఇతర జలశయాలను కలిపి 1.30 లక్షల కిలోమీటర్ల పైపులైన్ మార్గం ద్వారా రాష్ట్రంలోని 24వేల గ్రామాలు, 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికి నీటిని అందించాలన్న లక్షంతో చేపట్టింది. ప్రస్తుతం ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంది. నిర్ధేశించిన విధంగా ఆయా గ్రామాలు, పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం తాగు నీటిని అందిస్తోంది. ఫలితంగా 2015లో తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య 967….ఉండగా మిషన్ భాగీరథ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఆ సంఖ్య సున్నాకి పడిపోయింది.

ఫ్లోరైడ్‌ను తరిమివేసిన సిఎం కెసిఆర్
సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో ప్లోరైడ్‌తో తల్లడిల్లిన తెలంగాణ గ్రామాలు నేడు ఊపిరి పీల్చుకున్నాయి. రాష్ట్రం అవతరించిన అనంతరం ఉద్యమ నాయకుడు కెసిఆర్ సిఎం కావడంతో ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయడంతో నేడు అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని టిఆర్‌ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్లోరైడ్ రహిత రాష్ట్రంగా కేంద్రం ప్రకటించడంతో శుక్రవారం మర్రి రాజశేఖర్ రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 967 ప్లోరైడ్ గ్రామాల్లో వేలాదిమంది అనారోగ్యసమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు.

అయితే మిషన్ భగీరథద్వారా ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా చేయడంతో పాటు కాళేశ్వరం జలాలు విస్తృతంగా ప్రవహిస్తుండటంతో ప్లోరైడ్ పారిపోయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సింగూరు జలాలు సిద్ధిపేటకు అందించిన అనుభవంతో కెసిఆర్ సిఎం అయిన వెంటనే మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు అందించడంతో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యను సిఎం కెసిఆర్ పరిష్కరించారని ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తొలిసారిగా 1937లో బయడపడ్డ ఫ్లోరైడ్ సమస్య
ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో ఫ్లోరైడ్ సమస్యను గుర్తించారు. కాగా తెలంగాణలో 1945లో నల్గొండ జిల్లా బట్టపల్లిలో ఫ్లోరైడ్ సమస్యను గుర్తించారు. మర్రిగూడ మండలంలోని బట్టపల్లి భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఉందని నిజాం సర్కార్‌లో సైంటిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ ఎం.కె. దాహూర్ గుర్తించారు. ఉపరితల నీటి వనరులతో తాగునీరు సరఫరా చేయాలని అప్పటి నిజాం సర్కార్‌కు ఆయన సిఫారసు చేశారు. డాక్టర్ దాహూర్ సిఫార్సుతో చర్లగూడ, తంగడిపల్లి, మునుగోడు, చెరువులను నిజాం నవాబు తవ్వించారు.

వర్షాభావం, కరువుతో మర్రిగూడ మండలంలో తీవ్ర తాగునీటి కొరత కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. అన్ని తాత్కాలిక ఉపశమనాలే కల్పించారు. 1985లో బట్టపల్లిలో ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో (28 పిపిఎం) ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఫ్లోరైడ్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మర్రిగూడ మండలంలోని ప్రజల ఆరోగ్యం బట్టపల్లి నుంచి చుట్టుపక్కల గ్రామాలైన ఈదూలగూడెం, పాకలగూడెం, బట్టపల్లి (కొత్త), కంకణాలపల్లి, ఎల్లారెడ్డి గూడెం, ఎడవెల్లకి ప్రజలు పెద్దఎత్తున వలస పోయారు.

అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్
తెలంగాణలో సున్నా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అధికారిక ప్రకటన చేయడంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ట్రం సాధించిన ప్రగతిని మరో రాష్ట్రం కూడా సాధించ లేదని కేంద్రం వెల్లడించిన వివిధ రాష్ట్రాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు మరో నిదర్శమని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మిషన్ భగీరథ కోసం సిఎం కెసిఆర్ నిరంతరం యజ్ఞం చేశారన్నారు. దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పూర్తిగా ఫ్లోరిసిస్ సమస్య నుంచి బయటపడగలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ దిశానిర్ధేనంలో రాత్రింభవళ్లు శ్రమించిన మిషన్ భగీరత ఉన్నతాధికారులు, వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి
తెలంగామ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఆవిర్భనించినట్లుగా ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకతర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ విజయవంతానికి ఆ పథకం రూపకర్త సిఎం కెసిఆర్, అప్పట్లో ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి కెటిఆర్‌ల కృషే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

2003లో తొలిసారిగా మర్రిగూడకు వచ్చిన కెసిఆర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ 2003లో పోరుయాత్రలో భాగంగా తొలిసారిగా మర్రిగూడకు వచ్చారు. ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా మర్రిగూడ గ్రామంలో ఫ్లోరైడ్ బాధితులను చూసి ఆయన చలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి ఇంచికి నల్లాతో రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని వాగ్ధానం చేశారు. దానిని మిషన్ భగీరథ కార్యక్రమంతో నెరవేర్చేందుకు చౌటుప్పల్లో పైలాన్ నిర్మాణం చేశారు. 2017 సంవత్సరం చివరి నుంచి ఇంటింటికి నల్లాతో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా విరుగడైంది.

No fluoride affected villages in Telangana