ప్రకాశం : మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన భార్య శిరీష అలియాస్ రమాదేవి తెలిపారు. ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్టు మీడియాలో మాత్రమే చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ అధిష్ఠానం ప్రకటించాకే ఆర్కే మృతి చెందినట్టు తాము భావిస్తామని ఆమె స్పష్టం చేశారు. నిజంగా ఆర్కే చనిపోయి ఉంటే మృతదేహం తరలింపులో ప్రభుత్వం సహకరించాలని ఆమె కోరారు. అణగారిన వర్గాల కోసం ఆర్కే నలబై ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారని ఆమె వెల్లడించారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి,ఆయన ప్రజల కోసం జీవించారని ఆమె పేర్కొన్నారు. ఆర్కే తన కన్నబిడ్డను సైతం ఉద్యమంలోకే పంపించారు. ఆర్కే భార్య శిరీష ప్రస్తుతం ఎపిలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉంటుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే గురువారం చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆర్కే మృతిని మావోయిస్టు పార్టీ గానీ, ఛత్తీస్గఢ్ పోలీసులు గానీ నిర్థారించలేదు. గుంటూరు జిల్లా మాచర్ల మండల పరిధిలోని తుమ్మకోట గ్రామానికి చెందిన ఆర్కే వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం పీపుల్స్ వార్ లో చేరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పదవుల్లో పని చేశారు. ప్రస్తుతం ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పలు ఎన్కౌంటర్లలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై ఏపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి.