Home జాతీయ వార్తలు మందిర నిర్మాణానికి మరో ట్రస్ట్ అక్కర్లేదు

మందిర నిర్మాణానికి మరో ట్రస్ట్ అక్కర్లేదు

ram-mandir
రామ జన్మభూమి న్యాస్ చీఫ్ వ్యాఖ్య
కొత్త ట్రస్ట్ ఏర్పాటు అవసరం : హిందూ ధార్మిక సంస్థలు

అయోధ్య: సుప్రీంకోర్టు ఆదేశించినట్టు రామాలయ నిర్మాణానికి కొతగ్తా ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే రామ్ జన్మభూమి న్యాస్ ఉందని దాని అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామ్ జన్మభూమి న్యాస్‌ను విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నిర్వహిస్తోంది. ‘ఇప్పుడున్న ట్రస్ట్‌ను(రామ్ జన్మభూమి న్యాస్) ఆలయ నిర్మాణానికి తగ్గట్టు మార్చగలం. అవసరాన్నిబట్టి కొత్త సభ్యుల్ని చేర్చుకుంటాం’ అని మహంత్ గోపాల్‌దాస్ చెప్పారు.

అయితే, రామ మందిర ఉద్యమంతో సంబంధం ఉన్న ఇతర సాధువులు కొత్త ట్రస్ట్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. దిగంబర్ అఖారా అధ్యక్షుడు మహంత్ సురేష్‌దాస్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కాబట్టి అది ప్రభుత్వం బాధ్యతే కానీ, రామ్ జన్మభూమి న్యాస్‌ది కాదు. అయితే న్యాస్ ప్రతినిధులు ట్రస్ట్‌లో ఉంటారు’ అన్నారు. నిర్మోహి అఖారా చీఫ్ మహంత్ దీనేంద్ర దాస్ ఇదేమాదిరి అభిప్రాయం తెలిపారు.

కోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్ తప్పకుండా ఏర్పడాలని, అయితే అందులో ప్రభుత్వ ట్రస్ట్‌లో చేరాలా వద్దా అన్నది తమ ట్రస్ట్ సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, అందులో ప్రభుత్వ సభ్యులుండాలని, నృత్య గోపాల్‌దాస్‌ను దాని అధ్యక్షుడిగా నియమించాలని విహెచ్‌పి కి చెందిన త్రిలోకీనాథ్ పాండే చెప్పారు. విహెచ్‌పి ప్రతిపాదించిన నమూనా ప్రకారమే ఆలయ నిర్మాణం జరగాలన్నారు. ‘ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆలయ నిర్మాణానికి హిందువుల నుంచి విరాళాలు సేకరించాలే తప్ప ప్రభుత్వ ధనాన్ని వాడకూడదు’ అని పాండే స్పష్టం చేశారు.

No need to form a trust as one already exists