Home తాజా వార్తలు ఫిట్‌గా ఉన్నందునే ఇంగ్లాండుకు

ఫిట్‌గా ఉన్నందునే ఇంగ్లాండుకు

kohli

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: ‘నేను వంద శాతం ఫిట్‌గా ఉన్నాను. అందుకే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్నాను. ఒకవేళ నేను 90 శాతం మాత్రమే ఫిట్‌గా ఉండే ఇంగ్లాండ్ పర్యటనకు దూరంగా ఉండేవాడిని’ అని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి అన్నాడు. కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు శనివారం ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లి, టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాట్లాడారు. ‘అందరి కంటే ముందుగా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి పరిస్థితులకు అలవాటు చేసుకుందాం అనుకున్నాను. కానీ, నేను ఫిట్‌గా లేకపోవడంతో వెళ్లలేకపోయా. ఇప్పుడైనా 90 శాతం మాత్రమే ఫిట్‌గా ఉంటే ఇంగ్లాండ్ వెళ్లేవాడిని కాదు. ఇప్పుడు నేను 110 శాతం ఫిట్‌నెస్‌తో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యాను. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను. ‘ఇంగ్లాండ్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు రచించుకోలేదు. శ్రీలంక, దక్షిణాఫ్రికా పర్యటనలకు ఎలాగైతే వెళ్లామో.. ఇప్పుడు అలాగే వెళ్తున్నాము. ప్రత్యర్థి జట్లను దృష్టిలో ఉంచుకుని మా మైండ్ సెట్ మార్చుకోము. ఓర్పుతో మ్యాచ్‌లను ఎలా గెలవాలన్న దానిపైనే దృష్టి పెడతాము’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. అనంతరం కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ‘ప్రతి సిరీస్ ముఖ్యమైనదే. ప్రతి గేమ్‌ను మేము సొంత మైదానంలో ఆడినట్లే ఫీలవుతాము. ఎందుకంటే మేము ఆడేది పిచ్‌పై. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో ఎలా ఆడతామా? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. మూడో టెస్టులో విజయం సాధించాం. ఆ తర్వాత వన్డే, టి20 సిరీస్‌లను దక్కించుకున్నాం. జట్టుగా ఎలా ఆడాలో మాకు తెలుసు.’ అన్నారు.