Home ఎడిటోరియల్ రైతుకు మద్దతు దొరకని ధర

రైతుకు మద్దతు దొరకని ధర

Sampadakeeyam-Logo

ప్రభుత్వం జనాలను మబ్బులో ఉంచేందుకు చెప్పే మాటలకు ఆచరణకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో గ్రహించటానికి కేంద్ర ప్రభుత్వం 14 రకాల ఖరీఫ్ పంటలకు ప్రకటించిన ‘కనీస మద్దతు ధర’లను నిదర్శనంగా తీసుకోవచ్చు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన బిజెపి, నాలుగేళ్లు అధికార కాలం గడిచిపోయి, మళ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతులను బుజ్జగించేందుకు కన్నీటి తుడుపుగా ధరలు పెంచింది. గత నాలుగేళ్లలో ఏటా నామమాత్రంగా పెంచుతూ వచ్చిన మద్దతు ధరతో పోల్చితే ఈ పర్యాయం కాస్త మెరుగే. కాని పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది అరకొర చర్యే. మద్దతు ధరను 150 శాతం పెంచబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని మాసాలుగా చేస్తున్న ఊరించే ప్రకటనలతో తమ బతుకులు మెరుగుపడతాయని ఆశించిన దేశ రైతాంగానికి నిరాశే మిగిలింది. జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ మద్దతు ధర నిర్ణయించటంలో వ్యవసాయ ఖర్చులు కొన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లు భూమి విలువ, కౌలు రేటు పరిగణనలోకి తీసుకోవటం సాధ్యం కాదని ఆర్థిక సలహాదారు స్పష్టం చేశారు. గైరు హాజరీ భూస్వామ్యం నానాటికీ పెరుగుతూ కౌలు రేట్లు విపరీతంగా పెంచుతున్న స్థితిలో చిన్న, సన్నకారు రైతులు అప్పలుపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న హృదయవిదారక స్థితికి కారణాల్లో కౌలు రేటు కూడా ప్రధానమైంది. కేవలం మార్కెట్‌లో కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల రేట్లను ఇతర వ్యవసాయ ఖర్చులను పాక్షికంగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే మద్దతు ధర ఆరుగాలం శ్రమించే రైతు కుటుంబానికి సరైన మద్దతివ్వజాలదు, వ్యవసాయంలో నిలబెట్టలేదు. రైతులు వ్యవసాయ కార్మికులుగా మారటానికి, ఉపాధికై పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు వలసలు పెరగటానికి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటమే ముఖ్య కారణం.

తెలంగాణ ప్రభుత్వ అంచనా ప్రకారం క్వింటాలు వరి ధాన్యం పండించేందుకు రైతుకయ్యే ఖర్చు రూ. 2002. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం దానికి 50 శాతం కలిపితే రూ. 3303 గా మద్దతు ధర నిర్ణయించాలి. వరి, మొక్క జొన్న పంటలకు రూ. 2 వేలకు పైగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే పొడవు పింజ పత్తికి క్వింటాలుకు రూ. 6807, కందికి రూ.5896 ఖర్చవుతుంది. వీటికి 50 శాతం కలిపి ఇవ్వాలి. అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ధర ఎంత? వరి రూ. 1750 (200 పెంపు), పత్తి రూ. 5150 (830 పెంపు), కంది రూ. 5675 (225 పెంపు), పెసలు రూ. 6975 (పెంపు 1400), మొక్క జొన్న 1700 (పెంపు 275), వేరు శనగ రూ. 4890 (పెంపు రూ. 440), సోయా చిక్కుడు రూ. 3399 ( పెంపు 349).
ధరలు ప్రకటించి చేతులు దులుపుకోవటం తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా ఉంటుంది. వాటిని కచ్చితంగా అమలు జరిపే పర్యవేక్షణ యంత్రాంగం, ధరలు పడిపోయినపుడు మార్కెట్‌లో జోక్యం చేసుకునే చొరవ ముఖ్యం. మద్దతు ధర అమలు జరిపేటట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. వాటికి కేంద్రం నుంచి మద్దతు అవసరం. అలాగే రాష్ట్ర ఏజన్సీలు కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపు జరగాలి. రైతులు తమ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా కల్లం మీదనే ఉత్పత్తులు అమ్మేస్తుంటారు. ఆ కారణంగా మధ్య దళారులు, వ్యాపారులు లబ్ది పొందుతుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రైతులను ఆదుకునే సేవా భావంతో అది పని చేయాలి. ఏమైనా, మహారాష్ట్రలోని రైతు సహకార వ్యవస్థలా రైతులు సంఘాలలో సంఘటితమైనప్పుడే కేంద్రం ప్రకటించిన ధరనైనా పొందగలుగుతారు.
ధరలు పడిపోయినపుడు మార్కెట్లో జోక్యం చేసుకునేందుకు రూ. 1 లక్ష కోట్లతో ‘ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేస్తామన్న హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వం నడక ఇలా ఉంటే 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటున్న ప్రధాని మాటలు నమ్మశక్యమా?