Friday, April 26, 2024

‘గ్రీన్’ చూపిస్తే.. నో క్వారంటైన్

- Advertisement -
- Advertisement -

No Quarantine if Green Status Shows in Aarogya Setu App

 

దేశీయ విమాన ప్రయాణాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టీకరణ
ఆగస్టు లోపే విదేశీ విమాన సర్వీసులు ప్రారంభం కావొచ్చు

న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో ‘గ్రీన్’ స్టేటస్ చూపిస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఈనెల 25నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన ఆన్‌లైన్ ద్వారా నెటిజన్ల సందేహాలను నివృత్తి చేశారు. గురువారం కూడా క్వారంటైన్ గురించి ఆయన ఇదే విషయం చెప్పడం తెలిసిందే. ‘ ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ చూపించిన తర్వాత కూడా ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు’ అని హర్దీప్ సింగ్ అన్నారు. అలాగే ఆగస్టు, సెప్టెంబర్‌కన్నా ముందే చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశీ విమాన సర్వీసులు మొదలవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.అప్పటి పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ‘ కోవిడ్19 వైరస్ గనుక ఊహించినట్లుగా ప్రవర్తించిన పక్షంలో జూన్ మధ్య లేదా జూలై చివరినాటికి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావచ్చు’ అని ఆయన చెప్పారు.

లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటినుంచి నిలిచిపోయిన ప్రయాణికుల విమాన సర్వీసుల్లో చాలా శాతం తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. దేశీయ ప్రయాణాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేరళ, కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాలని పట్టుబడుతున్నాయి. దానిపై ఆన్‌లైన్ చర్చలో కొందరు ఆందోళన వ్యక్తంచేయగా, క్వారంటైన్ కానీ, ఐసొలేషన్ కానీ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. క్వారంటైన్‌పై రాష్ట్రాలు పట్టుబట్టడంపై గతంలో కూడా మంత్రి స్పందించారు. ‘ క్వారంటైన్‌పై అనవసరంగా ఎందుకు చర్చ లేవనెతుత్తతున్నారో అర్థం కావడం లేదు. ఇది దేశీయ విమానయానం. బస్సు, రైల్లో ప్రయాణించినట్లుగానే ఇది కూడా. అసలు కరోనా పాజిటివ్ ఉన్న వాళ్లు విమాన ప్రయాణం చేయడానికి అనుమతించం’ అని హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఒక వైపు కరోనా కేసుల పెరుగుదల ఆందేళన కలిగిస్తున్నా… శ్రామిక రైళ్లు, ప్రత్యేక రైళ్లతో పాటుగా ఈ నెల 25నుంచి దేశీయ విమాన సర్వీసులను, అలాగే జూన్ 1నుంచి 200 ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News