Home ఆఫ్ బీట్ మెట్రో స్టేషన్లలో ప్రారంభం కాని స్టాళ్లు!

మెట్రో స్టేషన్లలో ప్రారంభం కాని స్టాళ్లు!

కొన్ని స్టేషన్లలో ఇంకా పూర్తి కాని స్టాళ్ల నిర్మాణాలు
అవుట్స్‌లెట్స్ ఏర్పాటుకు ముందుకు రాని ఔత్సాహికులు!

Railway-Station

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్‌పెట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, ప్రయాణికులకు అవసరమయ్యే సౌకర్యాలతో మెట్రో రైలును నిర్మిస్తున్నారు అధికారులు. మెట్రో ప్రారంభమై ఆరు నెలలు కావొస్తున్నప్పటికినీ ఏదైతే అధికారులు ముందస్తుగా చెప్పిన వసతులను కల్పించడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. మెట్రో స్టేషన్లలో స్టాల్స్, స్టేషన్ల సమీపంలో పార్కింగ్, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా అద్దె సైకిళ్లు, బైకులు, కంబైన్డ్ పాసులు, నెలవారి పాసులు వంటి సేవలను ప్రయాణికులకు అందిస్తామని చెప్పారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వీటి పనులు మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇంకా ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. నాగోల్ నుంచి మియాపూర్ మెట్రో రూటులో 24 స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం స్టాళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటికీ ఇవి ప్రారంభం కాని పరిస్థితి. ప్రతి స్టేషన్‌లో సుమారు 7 నుంచి 10 వరకు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 24 స్టేషన్లు ఉంటే కనీసం సగం స్టేషన్లలోనూ ఇంకా స్టాళ్లు ఏర్పాటు కాలేదు. అమీర్‌పేట్, మియాపూర్, బేగంపేట్, జేఎన్టీయు ఇతర కొన్ని స్టేషన్లలో మాత్రం మూడు నుంచి నాలుగు స్టాళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని స్టేషన్లలో అయితే స్టాళ్ల నిర్మాణ దశలోనే ఉన్నాయి. అధికారులు చెప్తున్న దాని ప్రకారమైతే అన్ని స్టేషన్లలో స్టాళ్లను ఏర్పాటు చేశామంటున్నారు. అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయడానికి ఓపెన్ టెండర్ల ద్వారా స్టాళ్లను ఏర్పాటుకు దరఖాస్తులను కూడా ఆహ్వానించినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. అమీర్‌పేట్ లాంటి ప్రధానమైన స్టేషన్లలో మాత్రమే ఒకటి అర స్టాళ్లు ప్రారంభమై అవుట్‌లెట్సు ప్రారంభించారు. చాలా స్టేషన్లలో స్టాళ్ల నిర్మాణమే ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉంది. అయితే స్టాళ్లలో వ్యాపార అవుట్‌లెట్స్ ఏర్పాటుకి ఔత్సాహికులు ఎవ్వరూ ముందుకు రావట్లేదని సమాచారం. స్టాళ్ల నిర్మాణం, టెండర్లపై వివరణ కోరితే అధికారుల నుంచి స్పందన కరువైంది.

తాగడానికి మంచి నీరు కరువు

అసలే వేసవి కాలం… దీనికి తోడు మెట్రో స్టేషన్లలో కనీసం తాగు నీటి సౌకర్యం కూడా ప్రయాణికులకు మెట్రో అధికారులు కల్పించలేదు. ఆపసోపాలు పడి సెకండ్ ఫ్లోర్ వరకు నడిచి వస్తే తాగడానికి మంచినీళ్లు కూడా స్టేషన్లలో కానరాని దుస్థితి. మంచి నీరు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలు లాంటివి ప్రయాణికులు కొనుగోలు చేయడానికి స్టాళ్లను స్టేషన్లలో ఏర్పాటు చేయాలనుకున్నారు అధికారులు. తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసి మంచినీళ్లు తాగుదామన్నా స్టేషన్లలో దొరకడంలేదు. ఆఫీసు వెళ్లే హడావుడిలో ఇంటి దగ్గర నుంచి తినీ తినకుండానే ఉద్యోగస్తులు బయలుదేరుతారు. ఒక వేళ స్టాళ్లు కనుక అందుబాటులోకి వస్తే స్టేషన్లలో తినుబండారాలు కొనుగోలు చేసి ఆకలి తీర్చుకునే వీలుంటుంది. కానీ స్టేషన్లలో అవుట్‌లెట్స్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ఆహారపదార్థాలు స్టేషన్లలో దొరకని పరిస్థితి ఉంది. దీంతో తాగడానికి మంచి నీరు, ఆహార పదార్థాలు లభించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 24 స్టేషన్లలో స్టాళ్లు అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.