Friday, March 29, 2024

ప్రైవేట్ లో “నో” ట్రీట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

private Hospitals

 

ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు
90% హాస్పిటల్స్‌లో ఇదే పరిస్థితి
ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ముందు ఏకంగా నో ట్రీట్‌మెంట్ బోర్డులు పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించే క్రమంలో మెడికల్, అత్యవసర, నిత్యవసర సేవలు అందివ్వాలని ఆయా సెక్టర్‌లకు ప్రభుత్వాలు సూచించినప్పటికీ, కొంత మంది ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం విషయంలో మెరుగైన సేవలందించాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తున్నా, ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు నిర్లక్షం చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లోకి వెళ్లినా సేవలు లభించడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. దీంతో ఏదైనా రోగం వస్తే ప్రజలకు ప్రభుత్వాసుపత్రులే దిక్కు అయ్యాయి. గతంలో చిన్నపాటి దగ్గు, జలుబు చేసినా, చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టేవారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నప్పటికీ, వైద్యం కోసం కాస్త వేచిచూడాలనే అభిప్రాయంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌కు క్యూ కట్టేవారు. కానీ కరోనా విపత్కర పరిస్థితుల్లో అది పూర్తిగా భిన్నమైంది.

ప్రభుత్వాసుపత్రుల్లో లభిస్తున్న వైద్యసేవలు
రాష్ట్రంలో కేవలం ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే వైద్య సేవలందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు సుమారు 8 వేలు ఉండగా, వీటిలో 60 శాతం ప్రైవేట్, కార్పొరేట్ హస్పిటల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆకస్మికంగా వచ్చిన విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుప్రతులన్నీ మూతపడ్డాయి. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే హాస్పిటల్ నడుస్తున్నాయి. వాటిలో కూడా దగ్గు, జలుబు, ఉంటే ఒపి చూడటం లేదు. దీంతో చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా లక్షణాలు కలిగిన పేషెంట్లను నేరుగా కింగ్‌కోఠి ఆసుపత్రికి పంపిస్తున్నట్లు ఒ కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన యాజమాన్యం చెబుతోంది. గల్లీ క్లినిక్‌లు, ప్రధాన ఆసుపత్రులన్నీ బంద్ కావడంతో ప్రజలంతా ప్రభుత్వాసుపత్రుల్లోకి పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతోంది.

గాంధీ ఆసుపత్రి పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మారిపోవడంతో ప్రస్తుతం గతంలో ఇక్కడికి వచ్చే రోగులంతా ఉస్మానియాకు వెళ్తున్నారు. ఇక వరంగల్ ఎంజిఎం, రిమ్స్ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్య సేవలందింస్తున్నామని ఆయా ఆసుపత్రుల అధికారులు పేర్కొంటున్నారు. ఒపికి వచ్చిన రోగుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నామని, తీవ్రత ఎక్కువ ఉంటే కింగ్‌కోఠి ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా షిప్టుల వారీగా డ్యూటీలు చేస్తూ వైద్యసేవలందిస్తున్నామని డాక్టర్లు పేర్కొంటున్నారు. అయితే కరోనాకి చికిత్స అందించే డాక్టర్లు వేరే రోగులకు వైద్యం అందించడం లేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు, డాక్టర్ల కృషితో కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తామని టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు చెబుతున్నారు.

90% ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్మిట్ చేసుకోవట్లే
రాష్ట్రం మొత్తం మీద ఉన్న దవాఖానాల్లో 60 శాతం ప్రైవే ట్, కార్పొరేట్ ఆసుపత్రులే ఉన్నాయి. గతంలో రోగులతో రద్దీగా ఉన్న ఆసుపత్రులు లాక్‌డౌన్ నేపథ్యంలో మూతపడ్డాయి. కొన్ని ఆసుపత్రుల్లోని ప్రముఖమైన వైద్యులు ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలో కొవిడ్ చికిత్స అందించేందుకు ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. దీంతో ఆయా ఆసుపత్రులన్నీ సేవలు నిలిపిశామని యాజమాన్యాలు చెప్పుకొస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో కారణం మాత్రం అందిరికీ తెలిసిందే. కరోనా ప్రభావంతో ప్రైవేట్ యాజామాన్యాలు సేవలన్నీ నిలివేశాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదు. అడ్మిట్ చేసుకున్నా, రోగం తీవ్రత పెరిగినప్పుడు మళ్లీ ప్రభుత్వాసుపత్రులకు పంపిస్తున్నారంటూ ఒ టీచింగ్ ఆసుపత్రి అధికారి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా కొవిడ్ పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఇటీవలే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఐసొలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలని సర్కార్ యోచించింది. దీనిలో భాగంగా వారం రోజుల క్రితం 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా కొవిడ్ ఆసుపత్రులుగా ప్రభుత్వం మార్చేసింది. అయితే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి తమ ఆసుపత్రిని కూడా కొవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం మార్చుతుందేమోనని గందరగోళానికి గురై గేట్లు మాసేస్తున్నట్లూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రోగులు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని పలువురు రోగులు కోరుతున్నారు.

 

No treatment boards in front of private Hospitals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News