Home అంతర్జాతీయ వార్తలు ముగ్గురు ఆక్సిజనులకు వైద్య నోబెల్

ముగ్గురు ఆక్సిజనులకు వైద్య నోబెల్

Nobel Prize

 

స్టాక్‌హోం : మానవ కణజాలంపై పరిశోధనలు సాగించిన ముగ్గురికి వైద్య శాస్త్రంలో ఈ ఏటి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికా పరిశోధకులు విలియం కెలిన్, గ్రెగ్ సెమెంజా, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాట్‌క్లిఫ్‌లను ఉమ్మడిగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ అసెంబ్లీ సోమవారం తెలిపింది. కణాలలోని గ్రాహకశక్తి, ప్రాణవాయువు (ఆక్సిజన్)ను అందుబాటులోకి తెచ్చుకోవడం వంటి కీలక ప్రక్రియలపై ఈ పరిశోధకు లు కృషి సాగించారు. ఈ అధ్యయనం వైద్య శాస్త్రంలో అత్యంత కీలకమైనదని నోబెల్ జ్యూరీ తెలిపింది. ఆక్సిజన్ స్థాయిలు మనిషి కణజాల అంతర్గత చర్యలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? శారీరక ప్రక్రియను ఏ విధంగా ఆటుపోట్లకు గురిచేస్తాయి? అనే అంశంపై ఈ పరిశోధకులు సరైన ప్రాతిపదికను రూపొందించారని కమిటీ తెలిపింది.

రక్తహీనత, క్యాన్సర్, మరికొన్ని ఇతర వ్యాధుల నివారణ లేదా అనంతర అదుపు చర్యలకు ఈ కీలక అధ్యయనం ఎంతగానో దోహదం చేస్తుందని వీరిని అభినందించారు. కణాలలోని ఆక్సిజన్ మన జన్యువుల పనితీరును నియంత్రిస్తుంది. ఆక్సిజన్‌ను గ్రహించడం ద్వారా, వాటి స్థాయిలలోని హెచ్చుతగ్గులను బట్టి ఎప్పటికప్పుడు కణజాల రసాయనిక ప్రక్రియలో మార్పులు ఉంటాయని ఈ శాస్త్రజ్ఞుల త్రయం కనుగొంది. కణజాలం ప్రభావితం కావడాన్ని బట్టే మనిషి అనేక వ్యాధులకు గురై దెబ్బతినే అవకాశం ఏర్పడుతోంది. ఆక్సిజన్ గ్రాహక యంత్రాంగాన్ని సరైన విధంగా పనిచేయించడం ద్వారా వ్యాధులను నివారించేందుకు అవసరమైన ఔషధాలను చికిత్సా ప్రక్రియలను రూపొందించేందుకు వైద్యసంస్థల ప్రయోగశాలలు, ఔషధ కంపెనీలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఇందుకు ఈ పరిశోధకుల అధ్యయనం ప్రాతిపదిక అవుతోందని గుర్తించినట్లు నోబెల్ జ్యూరీ తెలిపింది.

త్రయానికి 9,14,000 డాలర్లు
విశేష పరిశోధనలు సాగించిన ఈ పరిశోధకులకు కలిపి 90 లక్షల స్వీడన్ క్రోనోర్‌లు ( దాదాపు 9,14,000 డాలర్లు) అందుతాయి. డిసెంబర్ 10వ తేదీన స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో వీరు పురస్కారాన్ని 16వ కింగ్ కార్ల్ చేతుల మీదుగా స్వీకరిస్తారు. డిసెంబర్ 10వ తేదీ శాస్త్రజ్ఞులు అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా ఆయన పేరిట వెలిసిన ఈ పురస్కారాన్ని అందిస్తారు. వివిధ రంగాలకు సంబంధించి విశేష పరిశోధనలు సాగించిన వారికి ఈ వారంలో ఇక వరుసగా నోబెల్ పురస్కారాలు ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి స్థాపనలో నోబెల్‌ను ప్రకటిస్తారు.

Nobel Prize in Medical Science