Home ఎడిటోరియల్ కశ్మీర్‌పై పాత పాటేనా?

కశ్మీర్‌పై పాత పాటేనా?

Nobody will be allowed to scuttle peace, progress కశ్మీర్ లోయలో ఉగ్రహింస పేట్రేగి కొత్త రకం సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ పర్యటించడం వల్ల మంచి కలుగుతుందనే ఆశలు చిగురించడం లేదు. అమిత్ షా ఆదివారం నాడు జమ్మూలోని భగవతీనగర్‌లో మాట్లాడుతూ… ఆ మూడు పార్టీల దాదాగిరీ అంతమైందని అన్నారు. ఆ మూడు పార్టీలంటే గుపార్ కూటమికి చెందిన మాజీ పాలక పక్షాలు నేషనల్ కానరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పిడిపి) లే. ఆయన ప్రసంగం పాలక భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం చేకూర్చడమే ప్రధాన ఉద్దేశంగా సాగింది. లోయలో సరికొత్త ఉగ్ర మూకలు భిన్న మతస్థుల మధ్య చిచ్చురేపి మైనారిటీలను, వలస కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి లోయను వదిలిపెట్టి పారిపోయేలా చూడడం లక్షంగా హింసను సృష్టిస్తున్నాయి. సిక్కులు, పండిట్లను హతమారుస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది, లోపం ఎక్కడున్నది అనే వాటికి ప్రాధాన్యమిచ్చి స్థానిక పార్టీలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకునే ప్రయత్నాన్ని అమిత్ షా చేసి ఉండవలసింది. కాని అందుకు విరుద్ధంగా ఆ మూడు పార్టీలంటూ అక్కడి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ శక్తులను లక్షంగా చేసుకొని ఆయన మాట్లాడారు.

ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పూర్తయ్యే వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కూడా అమిత్ షా ప్రకటించారు. ఆ విధంగా అక్కడి ప్రజలను మరింతగా దూరం చేసుకునే వైఖరినే ఎంచుకున్నారు. ప్రభుత్వ బలగాల ప్రయోగంతో టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందించడం సాధ్యం కాదనే సంగతి తరచూ రుజువవుతున్నది. పాలకులు ప్రజల అభిమానాన్ని చూరగొనడం ఒక్కటే అక్కడ మామూలు పరిస్థితుల పునరుద్ధరణకు తోడ్పడగల అంశమని బోధపడుతున్నది. కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటువైపుగా అడుగులు వేయడానికి ఇంకా వెనుకాడుతూనే ఉన్నది. 2019 ఆగస్టు 5న, ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. వాటిని అనుసరించి అక్కడ నిర్బంధకాండను పెంచారు. ఇంటర్‌నెట్‌ను బంద్ చేశారు. ఈ చర్యలు అక్కడి ప్రజలకు బొత్తిగా రుచించలేదని అనేక విధాలుగా రుజువవుతున్నది. అయినా తమ ధోరణిని మార్చుకోడానికి పాలకులు సిద్ధంగా లేరు. ఈ విషయం అమిత్ షా ప్రసంగంలో స్పష్టంగా వెల్లడైంది. కశ్మీర్‌ను భారత్‌లో పూర్తి అంతర్భాగంగా చేయడమే వారి లక్షమని తేటతెల్లమవుతున్నది.

ఒకే జాతి, ఒకే చట్టం, ఒకే గుర్తు అనే ప్రేమనాథ్ డోగ్రా, శ్యామ్ ప్రసాద్ వంటి నేతల ఆశయాన్ని నేరవేర్చడం కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా జమ్మూ కశ్మీర్‌కు ఇంత వరకు రూ. 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 2022 ఆఖరుకు దీనిని రూ. 51 వేల కోట్లకు తీసుకు పోదలచామని ఆయన చెప్పారు. ఇందుకు విరుద్ధంగా కశ్మీర్ లోయనుంచి మైనారిటీ మతస్థులను, వలస కార్మికులను బయటికి తరిమేసే వ్యూహాన్ని టెర్రరిస్టులు అమలు పరుస్తున్నారు. వారిని నిశ్శేషంగా తుడిచిపెడితే గాని కశ్మీర్‌ను బయటి పెట్టుబడుల లక్షంగా మార్చడం సాధ్యం కాదు. అక్కడ ఉగ్రమూకలు హత్యాకాండ, బయటి జనం ప్రాణాలను బలి తీసుకుంటున్నంత కాలం పెట్టుబడులు పెట్టడానికి కశ్మీరీయేతరులెవ్వరూ ముందుకు రారు. రాజకీయ కార్యాచరణ ద్వారా ప్రజలను భాగస్వాములను చేస్తే తప్ప కశ్మీర్ అభివృద్ధి దుస్సాధ్యమనేది తిరుగులేని సత్యం. ఆ మధ్య జరిగిన జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల (డిడిసిలు) ఎన్నికల్లో గుప్కార్ డిక్లరేషన్ కూటమికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పిడిపిలదే పై చేయి అయ్యింది.

మొత్తం 280 స్థానాల్లో ఈ కూటమి 150 గెలుచుకోగా, బిజెపి జమ్మూ ప్రాంతానికి పరిమితమై 75 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కశ్మీర్ ప్రజలింకా తమను విశ్వసించడం లేదనే విషయాన్ని గమనించిన ప్రధాని మోడీ గత జూన్‌లో అక్కడి పార్టీల నేతలందరినీ చర్చలకు ఆహ్వానించారు. అంతకు ముందు గృహ నిర్బంధంలోకి నెట్టివేసిన మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఒమర్ అబ్దుల్లాలను మరో మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్‌ను కూడా రప్పించారు. రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని, ఎన్నికలు కూడా జరిపిస్తామని, అలాగే నియోజక వర్గాల పునర్వవస్థీకరణ జరుగుతుందని ఆ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ ఇంత వరకు ప్రారంభం కాలేదు. పర్యవసానంగా ఉగ్రవాదం కొత్త పిలకలు వేస్తున్నది. 2014 ముందటితో పోల్చుకుంటే ఉగ్రవాదుల కాల్పుల్లో పౌరుల మరణాలు తగ్గాయని చెప్పుకొని అమిత్ షా సంతృప్తి చెందారు. కాని మొత్తమ్మీద కశ్మీర్ లోయలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హామీ ఇచ్చినట్టు పూర్తి రాజకీయ కార్యాచరణను వీలైనంత త్వరలో ప్రారంభించడమే తరణోపాయం.

Nobody will be allowed to scuttle peace, progress