Home ఎడిటోరియల్ స్వాతంత్య్రానంతరం సంచార, అర్థసంచార, విముక్త జాతులు

స్వాతంత్య్రానంతరం సంచార, అర్థసంచార, విముక్త జాతులు

వై.వెంకటనారాయణ
తెలంగాణ రాష్ర్ట సంచారజాతుల
సంఘం అధ్యక్షులు

artsఎంతో గొప్ప చరిత్ర, సంస్కృతి గల కులాలు, జాతులు చరిత్ర హీనులుగా, చరిత్ర ఆనవాలు లేనివారు చరిత్రప్రసిద్ధులుగా కనబడుతున్న రోజులివి. 1936 అక్టోబర్‌లో జవహార్‌లాల్ నెహ్రూ గారు నెల్లూరు బహిరంగ సభలో క్రిమినల్ ట్రైబ్ అనే పదాన్ని అన్ని పుస్తకాలలో నుంచి తొలగించాలి, ఈ చట్టం పౌర స్వేచ్ఛను నిషేధించి, సంఘటితం కాకుండా చేసింది అని అన్నారు. పట్టాభి సీతారామయ్య, వెన్నెలకంటి రాఘవయ్య, ఎం.వి. సుబ్బారావు, టక్కర్ బాపా, కొండా
వెంకటసుబ్బయ్య పంతులు, ఎన్.జి.రంగా, వెంకట సుబ్బారెడ్డి మొదలైన నాయకులు ఈ చట్టం రద్దు చేయాలని వివిధ వేదికలపైన డిమాండ్ చేశారు.  1947లో స్వాతంత్య్రం రాగానే క్రిమినల్ ట్రైబ్ ఎంక్వైరీ కమిటీ వేశారు. చెల్లాచెదురైన వీరందరికీ స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలని, ఒక ప్రత్యేక కమీషన్ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సూచించారు. నేషనల్ అడ్వైయిజరీ కౌన్సిల్ ఈ డిఎన్‌టి, ఎన్‌టి, ఎస్‌ఎన్‌టి, పిఎన్‌టిల అభివృద్ధి గురించి కొన్ని సూచనలు చేసింది. వీరిని ఆరు శ్రేణులుగా గుర్తించారు. 1. ఉప్పు, అటవీ ఉత్పత్తులు బస్తాలలో వేసుకొని పశువుల మీద ఊరూరా తిరిగి అమ్ముకునేవారు.
2. కళలు, నాట్యం, ఆటపాట, కథలు చెప్పడం, శారీరక ప్రదర్శనలు, తాడుపైన నడవటం, వీధి ప్రదర్శనలు చేసేవారు. 3. జంతువులతో, గుర్రాలు, పాములు, కోతులు, ఎలుగుబంట్లు, పక్షులతో ప్రదర్శనలు చేసేవారు. 4. పచ్చగడ్డి ప్రాంతాలలో
జీవాల పోషణ, వేట, మాంసం, పాల ఉత్పత్తుల అమ్మకాలు జరిపేవారు. 5. జాతకాలు/అంత్ర తంత్ర విద్యలు, వెదురు కలప, ఇనుముతో వస్తువులు తయారీ అమ్మకాలు 6. మతసంబంధ దైవ ప్రచారం, కొన్ని కులాల వారికి గురువులుగా గోత్రాలు చెప్పడం, జాతకాలు చూడడం, ఆశ్రిత కులాలుగా ఉండడం, నాటు మందులు తయారీ చేసేవారు. వీరందరి జనాభా లెక్కలు తీసి శాశ్వత గృహ వసతి కల్పించాలి. ప్రభుత్వాధికారులు స్వయంగా వారి ప్రాంతాలకు వెళ్లి కుల, జననమరణ సర్టిఫికేట్, ఓటర్ ఐడి కార్డు, బిపిఎల్ కార్డ్, వృద్ధాప్య ఫించను, రేషన్ కార్డు, జాబ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లు, పోస్టల్ అకౌంట్లు మొదలగునవి ఇప్పించాలి. వీరి వివరాలు జిల్లా ఆఫీస్ బోర్డులలో ప్రదర్శించాలి. పోలీసులకు శిక్షణాతరగతి నిర్వహించి ఈ కులాల వారికి హక్కుల గురించి చట్టాల గురించి వివరించి వీరు వివక్షకు, విచక్షణకు గురికాకుండా చూడాలి. సంక్షేమ పథకాల గూర్చి, అభివృద్ధి పథకాల గూర్చి వివరించాలి. ఎస్‌సి,ఎస్‌టిలలో ఉన్న వారికి, వారి వారి జనాభా ప్రాతిపదిక న రావాల్సిన నిధుల గూర్చి, అట్రాసిటీ చట్టం గూర్చి వివరించాలి. ప్రత్యేక స్కూల్స్, కాలేజీలు, వయోజన విద్య ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రావ్‌ు, లీడర్‌షీప్ డెవలప్‌మెంట్, యూత్, మహిళలకి ప్రత్యేక శిక్షణాతరగతులు నిర్వహించాలి. కేంద్రంలో ఇంటర్ మినిస్ట్రీయల్ స్టాండింగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ హోవ్‌ు ఎఫైర్స్‌లో ఒక డైరెక్టర్‌ని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. రాష్ర్ట స్థాయిలో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలి. నేషనల్ / స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్‌లో ఒక మెంబర్ ఈ జాతులవారినుంచి ఉండాలి. హెల్త్ సర్వీస్, బాల్వాడి, అంగన్‌వాడీలు ఏర్పాటు చేయాలి. వ్యభిచార వృత్తి మాన్పించి మహిళలు గౌరవప్రదంగా బ్రతకడానికి తగిన స్కీవ్‌ులు ఏర్పాటు చేయాలి. ఎంఎల్‌ఎ / ఎంపి / ఎంఎల్‌సి నిధులలో 10% వీరికి ఖర్చు చేయాలి. అటవీ అధికా రులతో శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచనలు చేయడం జరిగింది. ఇందులో ఏ ఒక్కటి గూడ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు జరిపిన దాఖలాలు లేవు.
1949లో అనంత శయనం అయ్యంగార్ ఛైర్మన్‌గా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ భారతదేశం అంతటా విచారించి 1950లో తన రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. పోలీస్ రికార్డుల ప్రకారం అప్పటికి వీరు 47 లక్షల 32 వేల మందిగా ఉన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితు లతో కలుపుకుంటే దాదాపు రెండు కోట్ల ప్రజానీకం. అప్పటి జనాభా 30 కోట్లు అనుకుంటే వీరు దాదాపు 15 శాతం. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి ఇటువంటి దారుణ పరిస్థితి ఉండకపోవచ్చు.
రెండు వందల జాతులే నేరస్థులుగా, 15 శాతం ప్రజలే అనుమానిత నేరస్థులుగా, నేరాలే వృత్తిగా గల జాతులుగా, కులాలుగా రికార్డుపరంగా చూపడం బాధాకర విషయం. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఈ కులాల్లో పుట్టిన పుట్టు గుడ్డివారు, పిల్లలు, మహిళలు కూడా నేరస్థులే అని ముద్రవేయడం. పిల్లలు వాళ్ల కులం ఏదో, మతం ఏదో తెలియక ముందే వారు నేరస్థ కులాలుగా ముద్రపడడం చాలా ఘోరం. అయ్యంగార్ తన రిపోర్ట్‌లో 1871 నుండి 1924 వరకు ఉన్న చట్టాలన్ని రద్దు చేయాలని, నేర మయ జీవితం వ్యక్తుల ప్రాతిపదికగా నిర్ధారించాలి గాని కులాలు, జాతులు, గుంపులు, కుటుంబాల వారీగా నిర్ధారించరాదు అని, దాదాపు వంద సంవత్స రాలు ఈ జాతులకు, కులాలకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి వారి స్థిర నివాసానికి పునరావాసానికి సంక్షేమానికి కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు 50+50 శాతం బడ్జెట్ పది సంవత్సరాల పాటు మొదటి విడతగా కేటాయించి ప్రత్యేక పథకాలు రూపొందించి అభివృద్ధి పరచాలని సూచనలు చేసింది. 31-08-1952లో ప్రభుత్వం ఈ చట్టాలన్నీ రద్దు చేసి వాటి స్థానంలో వ్యక్తుల ప్రాతిపదికగా హేబిట్యువల్ అఫెండర్ యాక్ట్ తెచ్చింది. 09-12-1946నాడు భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది.
26-11-1949న రాజ్యాంగం ఆమోదించారు. 26-01-1950న అమలులోనికి వచ్చినది. ఆ సమయంలోనే క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైయిరీ కమిటీ, నేషనల్ అడ్వైయిజరీ కమిటీ, అనంతశయనం అయ్యంగార్ కమిటీ తన రిపోర్ట్‌ను ఇచ్చినా గాని
15 శాతం బాధితులు, ఈ రాజ్యాంగ రచన సభ్యులకు గుర్తు రాలేదంటే ఈ జాతుల పట్ల ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది. ఆర్టికల్ 330 నుండి 342 వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్స్, వెనుక బడిన తరుగతులకు రిజర్వేషన్లు జాతీయ కమీషన్‌లు గురించి ప్రస్తావించిన రాజ్యాంగంలో అప్పటికే ఈ డిఎన్‌టి, ఎస్‌ఎన్‌టి, ఎన్‌టిలుగా గుర్తించిన కులా లు, ఏబోరిజినల్ ట్రైబ్స్ (ఆదిమ వాసుల తెగలు) గురించి రాజ్యాంగం లో ప్రస్తావన లేకపోవడం వలన ఈ కులాల వారు తమకు తామే పరదేశీ లుగా, గుమంతులోగ్‌గా సంచార జాతులుగా సంబోదించుకుంటూ బ్రతుకుచున్నారు.
1953 వరకు ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ర్టంలో భాగంగా ఉన్నది. హైదరాబాద్ రాష్ర్టం వేరుగా ఉన్నది. ఎపిలో 86 కులాలు, హైదరాబాద్‌లో 60 కులాలు బిసి జాబితాలో ఉంటూ కొద్దిపాటి రిజర్వేషన్ పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 86+60=146 కులాలు బిసిలుగా గుర్తింపు పొందాయి. 1949-50లోనే డీనోటిఫైడ్ కులాలుగా బోయ, వాల్మీ కి బోయ, బుడుబుక్కల, పాముల, బావురి, దాసరి, దొమ్మరి (ఆరె/రెడ్డి), జోగి, కింతల కలింగ, లంబాడి / సుగాలి, పంబాల, ముతరాస, పార్థి, తెలగ పాముల, నక్కల, పిట్టల, నిర్శికారి, కంజరబట్ట, పైడి, పిచ్చకుంట్ల, కెప్ మారే రెడ్డిక, రెల్లి, మొండిపట్ట, వడ్డెర, పరిగెమొగ్గుల, యరకల, నక్కల, కురివి కారన్, సెమినోమాడ్స్ కులాలుగా కైకాడి యాట, యానాది, గోత్రాల, రాజ న్నల, పట్రా, మేదరి /మహేంద్ర, రాజ్‌గోండ్‌‌, యల్లమ్మ వాళ్లు, దేవరవాళ్లు, ముత్యాలమ్మవాళ్లు, పెద్దమ్మల వాళ్లు, సిక్‌లిగర్, కాశీ కాపుడి, అత్తర్ సాయిబులు, ఫకీర్ సాయిబులు, దర్వేశీ, దూదేకుల, మందుల, మెహతర్, నోమాడిక్ కులాలుగా పైడి, పాను, దొంభార, బాలసంతు, బహురూపి, కాటి పాపల, బుడిగజంగం, కూనపులి, గారెడి, మదారి, జంగం, గంగిరెద్దుల, జోషినందివాలా, డక్కలి, సింధు, జక్కల, దాసరి, పూసల, కృష్ణబలిజ, హులియదాసరి, గోసంగి, రెల్లి, మాస్టిన్, ఆరె మారాఠి, బొమ్మలాటవాళ్లు, వీరముష్టి, నెట్టికోతల, మరాఠి బుడుబుక్కల, బండ, మొండిబండ, పాస్టోరల్, నోమాడిక్ కులాలుగా ఏర్రగొల్ల, కురుమ గొల్లను గుర్తించి కొన్ని కులాలకి
డిఎన్‌టి,ఎన్‌టి,ఎస్‌ఎన్‌టి,పిఎన్‌టి కుల సర్టిపికేట్లు జారీచేసి ట్రైబల్ వెల్ఫేర్ నుండి బడ్జెట్ విడుదల చేసి ఆయా కులాల వారికి విద్య ఉద్యోగ ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేశారు. (1970 వరకు దొమ్మరి కులస్తుడనైన నాకు డిఎన్‌టి కుల సర్టిఫికేట్ ఉండేది). అప్పట్లో ఈ కులాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనబడుతుంది. వీరికి ప్రత్యేక పాఠశాలలు, హాస్టల్స్ ఏర్పాటు చేసి స్కాలర్‌షిప్‌లు, సె్టైఫండ్‌లు ఇచ్చేవారు. పెద్దలకు స్థిరనివాసం ఏర్పాటు, సబ్సిడీ లోన్‌లు ఇచ్చి కొంత ప్రోత్సాహం కల్పించినారు. అయితే ట్రైబల్ వెల్ఫేర్ నుండి బడ్జెట్ ఖర్చు కావడాన్ని ఎస్టీలు గమనించి గోల చేయడం మొదలుపెట్టినారు. కారణం ఎస్‌సి/ఎస్‌టి/బిసిలకు రాజ్యాంగ గుర్తింపు ఉంది. కాని ఈ డిఎన్‌టి, ఎస్‌ఎన్‌టి, ఎన్‌టి / పిఎన్‌టి / ఆదిమవాసుల తెగలు గురించి రాజ్యాంగంలో ఎక్కడ లేదు కాబట్టి వారికి మా బడ్జెట్ ఎలా ఖర్చు పెడుతారు అనేది వారి వాదన. ఇదే సమయం లో కొన్ని కులాల వారు మేము బిసి/ ఎస్‌సి, ఎస్‌టి అర్హత గల వాళ్లం కాబట్టి మమ్ములను ఆయా జాబితాల్లో చేర్చండి అని ఆందోళనలు చేసినారు. -9640274949