Home తాజా వార్తలు ఇవ్వని హామీలూ అమలు

ఇవ్వని హామీలూ అమలు

Non-assured promises were also implemented

నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో అన్నీ మెరుపులే

ప్రగతి నివేదన సభలో సమర్పించనున్న 400 పేజీల, 485 అంశాల విశేష నివేదిక

2014 ఎన్నికల్లో ఇచ్చిన వాటన్నింటినీ దాదాపు అమలు చేయడమేగాక అప్పుడు హామీ ఇవ్వని కొత్త పథకాలను కూడా అమలు చేశాం : టిఆర్‌ఎస్ అగ్రనేతల అభిప్రాయం
ఆ విషయాలు స్వయంగా సిఎం చెబుతారు: మంత్రి నాయిని
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా వగైరా పథకాలే నిదర్శనం: మంత్రి జగదీశ్‌రెడ్డి
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం : మంత్రి పోచారం
రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1.12 లక్షల నుంచి రూ.1.75లక్షలకు చేరింది

మన తెలంగాణ/హైదరాబాద్: నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణలో సుపరిపాలన, స్వపరిపాలన ఉండాలని, కొత్త ఒరవడిని రూపుదిద్దాలని తపించిన టిఆర్‌ఎస్ 2014 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు అమలుచేయడమే కాకుండా ఆనాడు హామీ ఇవ్వకపోయినా ఇప్పుడు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. 2014 జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు 51 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో నిర్వహించ తలపెట్టిన ‘ప్రగతి నివేదన’ సభ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, ప్రభుత్వం చెప్పిందేమిటో, దానికంటే అదనంగా చేసిందేమిటో స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వివరిస్తారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి నివేదికను ఈ భారీ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకు నివేదిస్తారని తెలిపారు. ఇందుకోసం అభివృద్ధి, సంక్షేమం, ఆర్థికం, పరిశ్రమలు… ఇలా వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి ఇప్పటికే పుస్తకరూపాన్ని సంతరించుకుంది.

ఈ 50 నెలల్లో హామీలను అమలుచేయడమే కాక సాధించిన ఫలితాల పేరుతో 485 అంశాలు ఈ నివేదికలో చోటుచేసుకున్నాయి. రంగాలవారీగా మొత్తం 400 పేజీలతో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, వాటికి ప్రభుత్వం ఖర్చుచేస్తున్న నిధులు, లబ్ధిదారుల సంఖ్య తదితర గణాంకాలను కూడా పొందుపర్చింది. అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందుతున్న ప్రజల వివరాలను సిఎం స్వయంగా ఈ సభ ద్వారా తెలియజేస్తారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ ఒక్కో రూపంలో స్పృశించాయని మంత్రులు పేర్కొన్నారు. ఉదాహరణకు పంద్రాగస్టు నాటికే రాష్ట్రం మొత్తంమీద కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సుమారు నాలుగు లక్షల మంది లబ్ధి పొందినట్లు ఆ నివేదిక పేర్కొనింది. కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకున్నా ప్రభుత్వమే స్వంత ఆర్థిక వనరులతో అమలుచేస్తూ ఉన్నదని, కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణ అని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఎన్నో పథకాలు ఇప్పుడు ‘సుసాధ్యం’ అయ్యాయని గుర్తుచేశారు.

మరవని హామీలు : మంత్రి జగదీశ్‌రెడ్డి
సాధారణంగా ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయే పార్టీలను చూశామని, కానీ టిఆర్‌ఎస్ మాత్రం అందుకు చాలా భిన్నంగా అన్ని హామీలనూ అమలుచేయడమే కాకుండా కొత్త పథకాలను కూడా అమలుచేస్తున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో ప్రజల కష్టాలను, కడగండ్లను స్వయంగా చూసిన కెసిఆర్ అధికారంలోకి వస్తే ఏమేం చేయాలో అప్పుడే మనసులో రూపకల్పన చేసుకున్నారని, వాటి కొనసాగింపే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా… ఇలా అనేకం అని గుర్తుచేశారు. ఈ పథకాలను అమలుచేయాలంటూ ఏ వర్గం ప్రజల నుంచీ వత్తిళ్ళు రాలేదని, ప్రతిపక్షాల నుంచి అసలే లేదని, అయినా ప్రజల అవసరాలను గుర్తించినందువల్లనే ప్రభుత్వం వీటిని అమలుచేస్తూ ఉందని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటితో ప్రజలకు స్వీయానుభవమేనని, ఈ నాలుగున్నరేళ్ళలో ఏ తీరులో ఉందో వివరించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే ఏం వస్తుందని ఊహించారో అంతకంటే ఎక్కువే సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రం ఏర్పడితే అంధకారమే అని భయపెట్టిన నేతలు ఉన్నారని, కానీ ఆరు నెలలకే కోతలు లేని విద్యుత్‌ను అందించగలిగామని పేర్కొన్నారు. ప్రజలు సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలేగానీ ఏదైనా సాధ్యమే అనేదానికి కెసిఆర్ ఆలోచన, కార్యాచరణే నిదర్శనమన్నారు.

వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు :
దేశంలో ఏ రాష్ట్రమూ అమలుచేయని తీరులో తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ పథకాలను అమలు చేస్తోందని వ్యాఖ్యానించిన ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వీటిని ఎన్నికల ప్రణాళికలో పేర్కొనకున్నా ముఖ్యమంత్రి ఆర్థిక భారానికి వెరవకుండా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడేండ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని, అప్పుడు రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసే అవకాశం కలిగించేలా ముమ్మరంగా కృషి చేస్తుందని ఇచ్చిన హామీ ప్రకారం జనవరి నుంచి అమలవుతూ ఉందని గుర్తుచేశారు. తెలంగాణను ‘సీడ్ బౌల్’గా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చారని, ఇప్పుడు అదే అమలవుతూ ఉందని పేర్కొన్నారు. కల్తీలేని నాణ్యమైన విత్తనాలను, యూరియాను సకాలంలో అందిస్తామని చెప్పినట్లే ఇప్పుడు ఎక్కడా మనకు దుకాణాల ముందు క్యూలు కనిపించడంలేదని అన్నారు. యాంత్రికీకరణ గురించి మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగానే భారీ స్థాయిలో ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోందని గుర్తుచేశారు.

ఆర్థిక ప్రగతి :
రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి ఆదాయం రూ. 1.12 లక్షలు ఉండగా ఇప్పుడది రూ. 1.75 లక్షలకు చేరుకున్నది. జాతీయ తలసరి ఆదాయం (రూ. 1.03 లక్షలు) కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. తొలి స్థానంలో హైదరాబాద్ నగరంలో తలసరి ఆదాయం రూ. 2.99 లక్షలు ఉంటే, ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లాలో రూ. 2.88 లక్షలుగా ఉంది. కనీసంగా రూ. 77,669 జగిత్యాలలో ఉన్నట్లు ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొనింది. రాష్ట్రం ఏర్పడే నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు విద్యుత్ కోతల కారణంగా మైనస్‌లో ఉంటే ఇప్పుడు 14% నమోదైంది. టిఎస్ ఐపాస్ లాంటి విధానాలు కూడా చాలా దోహదం చేశాయి. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం నాలుగు శాతంగా ఉంటే ఇప్పుడది 6.9%గా ఉంది. జాతీయ సగటు (3%)కంటే ఎక్కువగా నమోదైంది. రాష్ట్ర స్వీయ ఆదాయ వనరులు పెరగడమే కాకుండా వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్ళే వాటా కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి కేంద్రానికి పన్నుల ద్వారా తెలంగాణ సమకూరుస్తున్నది సుమారు రూ. 30 వేల కోట్లుగా ఉంటే ఇప్పుడు అది రూ. 50 వేల కోట్లు దాటి 21% వృద్ధిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆర్థిక వృద్ధిరేటు ప్రతీ ఏటా పెరుగుతూనే ఉంది. గతేడాది 8.8% ఉంటే ఇప్పుడు 9.2%కి పెరిగింది. రాష్ట్ర జిడిపి వృద్ధి రేటు కూడా 14%కి చేరుకుంది.