Friday, April 19, 2024

కరోనాయేతర రోగుల వేదన

- Advertisement -
- Advertisement -

Non corona patients are agony

 

ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం కరోనా నుంచి కాపాడుకోడం ఒక్కటే అనే వాతావరణం అంతటా నెలకొన్నది. మిగతా రోగాలు, శారీరక బాధలేవీ పరిగణనలోకి రావడం లేదు. ఆసుపత్రులలోని వనరులు, వసతులన్నింటినీ కరోనాతో పోరాటం కోసం మళ్లిస్తున్నందున, బయటి రోగులను చూసే ఔట్ పేషెంట్ విభాగాలు చాలా కాలం మూతపడినందున, కరోనాయేతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు నిర్లక్షానికి గురవుతున్నారని పలు నివేదికలు, వార్తలు చెబుతున్నాయి. దేశంలోగల ప్రభుత్వాసుపత్రులు, వాటిలోని సౌకర్యాలే పరిమితం. ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో యుద్ధ ప్రాతిపదికన అదనపు వసతుల కల్పనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోడం దేశ వైద్య వ్యవస్థ సారథుల వైఫల్యమే. దేశంలో ప్రతి 10,000 మంది రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో 5.5 పరుపులే ఉన్నాయంటే కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వాటి చాలీచాలనితనం గురించి చెప్పనక్కర లేదు. కరోనా లాక్‌డౌన్ విధించిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌లో కేన్సర్ రోగులను ఆసుపత్రి బయటే ఉంచారన్న సమాచారం గమనించదగినది.

కేన్సర్ రోగుల పరిస్థితే ఇలా ఉంటే ఇతరుల గురించి ఏమని చెప్పగలం! అతిసార వంటి వ్యాధులకు తక్షణ ఆసుపత్రి చికిత్సే శరణ్యం. గుండె జబ్బులు కలవారిని, ఇతర మరి కొన్ని తీవ్రమైన రోగాలతో బాధపడేవారిని ఆసుపత్రిలో నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి తీరాలి. ప్రభుత్వరంగంలో గల పరిమిత వైద్య సదుపాయాలు కరోనా చికిత్సకు మళ్లిపోడం వల్ల ఈ రోగుల్లో చాలా మంది అటువంటి శ్రద్ధకు నోచుకోలేకపోతున్నారు. ఈ కారణాల వల్ల కోవిడ్ 19 మృతుల కంటే ఇతర రోగాలతో చనిపోతున్న వారే ఎక్కువ మంది కావడానికి అవకాశాలున్నాయి. గ్రేటర్ నోయిడాలో 8 మాసాల గర్భవతిని చేర్చుకోడానికి అనేక ఆసుపత్రులు తిరస్కరించడంతో అంబులెన్సు వాహనంలోనే ఆమె మరణించిన ఘటన ఈ నెల మొదటి వారంలో సంభవించింది. ఢిల్లీ సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో ట్యూమర్లకు శస్త్ర చికిత్స జరిగిన 9 మాసాల శిశువును కరోనా ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఆ హాస్పిటల్ మరునాడే డిశ్చార్జి చేసింది.

దానితో ఆ బాలుడు ఎదుర్కొంటున్న వేదన చెప్పనలవికానిది. అలాగే రాంచీలో కిడ్నీ వ్యాధిగ్రస్థుడొకడు తాను క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వచ్చిన ఆసుపత్రి లాక్‌డౌన్‌తో మూతపడడం వల్ల తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ముంబైలోనూ ఇంకా మరి కొన్ని చోట్ల ఆసుప్రతుల్లో బెడ్లు దొరక్క అకాల మరణానికి గురైనవారున్నారు. 2016లో గుండె జబ్బులతో దేశంలో 7 వేల మంది మరణించారు. 2019లో 3.3 లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి. 2017లో 21 లక్షల మంది ఎయిడ్స్ రోగులు బయటపడ్డారు. అదే సంవత్సరం కోటి 30 లక్షల డయేరియా కేసులు, 2.2 లక్షల టైఫాయిడ్, 7.5 లక్షల న్యూమోనియా ఉదంతాలు నమోదయ్యాయి. వర్షాలు ముమ్మరిస్తున్నాయి. నిల్వ నీటిలో, మురుగులో దోమ లు చేరి మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తాయి. లాక్‌డౌన్ వల్ల వీధి చివరి ప్రైవేటు క్లినిక్‌లు కూడా మూతపడ్డాయి. వాటిలో ఎన్ని తిరిగి తెరుచుకున్నాయో, ఇంకా మూతపడి ఉన్నవి ఎన్నో! దేశంలో 5 ఏళ్ల లోపు శిశువుల మరణాలు ప్రపంచంలోనే అత్యధికం.

ప్రతి సంవత్సరం 3000 కుటుంబాలు ఈ వయసులోని పిల్లలను కోల్పోతున్నాయి. 2017లో దాదాపు 30,000 మంది గర్భవతులు అందుకు సంబంధించిన వ్యాధులతో మరణించారు. అసంఖ్యాక బాలలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. లాక్‌డౌన్‌లో పనులు కోల్పోయిన కోట్లాది మంది తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని దుస్థితిలోకి జారుకున్నారు. రవాణా సదుపాయాలు బందై అత్యవసర మందులు ఒక చోటి నుంచి మరో చోటికి చేరలేకపోయాయి. కరోనాయేతర వ్యాధుల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత సందర్భంలో ఒకవైపు పారిశుద్ధాన్ని మెరుగుపర్చుకోడం, మరోవైపు రోగులందరి పట్ల శ్రద్ధ వహించడం అవసరం. కరోనాను అంతమొందించే కృషికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఇతర రోగాల పట్ల కూడా గతంలో చూపించిన శ్రద్ధనైనా తగ్గనీయకుండా కొనసాగించాలి. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ అధ్వాన స్థితి తెలిసిందే. కరోనా రోగ లక్షణాలు, సీజనల్‌గా వచ్చే మామూలు ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. దేశంలోని వైద్య ఆరోగ్యరంగంపై అపూర్వమైన, అసాధారణమైన ఒత్తిడి ఏర్పడింది.

పూర్వం నుంచి పటిష్ఠమైన చికిత్స వ్యవస్థలున్న దేశాలు దీనిని తట్టుకోగలవు. అమెరికాలో కూడా తగిన న్ని ఆరోగ్య వసతులు లేవు. భారత్ పరిస్థితి కడు దయనీయం. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో వైద్యానికి ఏటా ఇస్తున్నది స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 1 శాతమే.ఈ చేదు సత్యాన్ని పదేపదే చెప్పుకోవలసి రావడం బాధాకరం. ఎటువంటి ఎమర్జెన్సీలోనైనా ఏ ఒక్క రోగీ నిర్లక్షానికి గురి కాకుండా జాగ్రత్తవహించగల సామర్థాన్ని దేశంలోని వైద్య ఆరోగ్యరంగానికి కల్పించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News