Home తాజా వార్తలు భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800

భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800

Mutton, Chicken

 

హైదరాబాద్: రాష్ట్రంలో మాంసం ధరలు భారీగా పెరిగాయి. కిలో మటన్ ఏకంగా రూ.800లు అయ్యింది. బొక్క లేకుండా అయితే రూ.950 నుంచి రూ.1000 వరకు పలికింది. దారుణంగా పడిపోయిన చికెన్ కూడా ఒక్కసారిగా పెరగడం గమనార్హం. కిలో చికెన్ రూ.180కి పెరగగా, ఒక్క గుడ్డు ధర రూ.2 నుంచి రూ.5కు పెరిగింది. మార్కెట్‌లో కిలో డ్రెస్‌డ్ రూ.155, లైవ్ రూ.105కు చేరింది. దీంతో మాంసం ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కిలో మటన్ రూ. 650 నుంచి రూ. 680 ఉండగా ఏకంగా రూ.150 పెంచి అమ్మడం గమనార్హం. లాక్‌డౌన్, కర్ఫూతో ఐదు రోజులు చికెన్, మటన్ షాప్‌లు అంతగా తెరుచుకోలేదు. విక్రయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని స్వయంగా సిఎం కెసిఆర్ వెల్లడించడం, అలాగే ఆదివారం కావడంతో ఒకేసారి అందరూ మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.

ఎక్కువ ధరకు అమ్మినా మాంసం ప్రియులు కొనుగోలుకు వెనకాడకపోవడం గమనార్హం. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా.. జనాలు ఒకేసారి ఎగబడ్డారు. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న చికెన్ ధరలు కూడా ఒకేసారి అమాంతం పెరిగిపోయాయి. కరోనా వైరస్ కారణంగా చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ ధరలు మాత్రం ఎప్పుడూ లేని తరహాలో.. హోల్‌సేల్‌గా కిలో రూ.20 నుంచి రూ.40లకి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్రీగా కోళ్లు ఇచ్చినా.. ఎవరూ తీసుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో కోళ్ల సప్లై భారీగా తగ్గిపోయింది. దాదాపు 60 శాతం కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. నష్టాలు వస్తుండటంతో 50 శాతం పెట్టుబడులు తగ్గాయి. సాధారణంగా రోజుకు 3 లక్షల కోళ్లు పెట్టడం, మరో 3 లక్షల కోళ్లు సరఫరా చేస్తారు. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో జరగడం లేదు.

ఈ ఎఫెక్ట్ కాస్తా చికెన్ ధరలపై పడింది. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. అలాగే లాక్‌డౌన్ ఎఫెక్ట్ కాస్తా మటన్ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వీటి రేట్లు కూడా ఒకేసారి ఆకాశానికి తాకాయి. ఒక్కసారిగా ఇంత రేటు పెరగడంతో వినియోగదారులు కొనే పరిస్థితి లేదంటున్నారు. లాక్‌డౌన్ నెపంతో అందరూ రేట్లు పెంచేసి దోచుకుంటున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ రూ.800 నుంచి 900లు పలుకుతుండగా.. కిలో చికెన్ రూ.180 నుంచి 200ల దాకా లభ్యమవుతున్నాయి. అలాగే చేపలు, రొయ్యల ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రజలు మాంసాహార ప్రియులు. జాతీయ స్థాయిలో 71% మాంసాహారం తినేవాళ్లుంటే తెలంగాణలో 98.7% మాంసం తినేవారున్నారు.

Non Veg Price Hike with Lockdown Effect