Home ఎడిటోరియల్ ఉత్తర కొరియా, అమెరికా దొందు దొందే!

ఉత్తర కొరియా, అమెరికా దొందు దొందే!

Trump

అగ్ర సామ్రాజ్యవాద దేశం అమెరికా కేవలం పైన పటారం లోన లొటారం అన్న చందంలా ఉందని ఉత్తర కొరియా విషయం లో తేటతెల్లమవుతుంది. ఉత్తర కొరియా ప్రతి బాలిస్టిక్ క్షిపణి పరీక్షతో అమెరికాను బెదిరిస్తూనే ఉంది. అమెరికా ఓ సారి చైనాను సహయానికి రమ్మంటుంది మరోసారి జపాన్‌ను. చైనా, జపాన్ ‘సై ’ అంటే నార్త్ కొరియాపై ఈ రెండు దేశాలను యుద్ధరంగంలో దింపడానికి సర్వ విధాల ప్రయత్నిస్తుంది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ మాత్రం తన మంకు పట్టు వదలక పసిపిల్లాడుగానో పిచ్చి పిల్లాడుగానో అమెరికా వెనుకాల బడి విజయవంతమైన తమ బాలిస్టిక్ ఖండాంతర క్షిపిణుల ద్వారా యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. పైగా తన యుద్ధోన్మాద చదరంగం ఆటలో అమెరికా దక్షిణ కొరియాతో కలిసి చెక్ పెట్టిన కిం జాంగ్ ఉన్ తనకు ఒరిగేదేమి లేదన్నట్లు మసలుకొంటున్నాడు.
ఓ మలుపు: అంతర్జాతీయ సమాజం హితోక్తులను ఉత్తర కొరియా పెడచెవిని పెట్టడంలో ఇజ్రాయిల్ కన్న తక్కువేమీ కాదు. అమెరికా ఇజ్రాయిల్‌ను బెదిరించడానికి మరో ఏడు జన్మలెత్తాల్సుంది. అందుకే ఇజ్రాయిల్ పట్ల అమెరికా పలాయన ధోరణి అవలంబిస్తూ తన పిరికి తనానికి నాంది చాటుకుంది. ఫలితంగా అరవై యేండ్లనుంచి పాలస్తీనియన్‌లు అన్ని విధాల మూల్యం చెల్లిస్తున్నారు. కాని అమెరికాకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అమెరికా ఇజ్రాయిల్ సంబంధం రవికకు చీర చెరుగుకు గల సంబంధం లాంటిది.
అమెరికా గల్ఫ్ వార్‌లో ఇరాక్ దగ్గర ప్రాణాంతకమైన అయుధ సంపద ఉన్నదని దాని వల్ల ఇరుగు పొరుగు దేశాల కొంపలంటుకుపోతాయని బెదిరించింది. ఇరాక్ ను సర్వనాశనం చేసి ఊపిరి పీల్చుకుంది. ఆ నెపంతోనే సద్దాం హుస్సేన్‌ను ఉరికంబానికి ఎక్కించ గలిగినా అమెరికా మరణాయుధాలు మాత్రం ఉన్నాయని నిరూపించలేక పోయింది అమెరికా. ఇప్పుడు ఉగ్రవాదాన్ని చూపించి తానే దాన్ని పోషించ సాగింది. అది అమెరికా అమ్మ కొంగును పట్టుకొని మూడు పూవులు ఆరు కాయలైంది.
రెండడుగులు ముందుకెళ్ళి ‘నైన్ లెవెన్’ (9/11)గా రూపాంతరం చెందినది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్న చందంలా ముస్లిం, అరబ్బు దేశాలు ఉగ్రవాదులను ఆర్ధికంగా ఆదుకొంటున్నాయని అపవాదాలు వేసింది. ఆయా దేశాలను బ్లాక్ మైల్ చేసి తన స్వంత లాభా ల మూటను కట్టుకొని విర్రవీగ సాగింది. కాని ఉత్తర కొరియా విషయంలో మాత్రం పప్పులో కాలు వేసింది.
మరోమలుపు: ఇరాక్‌కు పూర్తిగా విరుద్ధంగా ఉత్తర కొరియా తన దగ్గర అమెరికాను నాశనం చేసే యుద్ధసామాగ్రి ఉందని నిరూపించింది. సామ్రాజ్యవాద అమెరికా తోక మలచుకోవడమే తప్ప వేరేమార్గం లేదు. ఉత్తర కుమార ప్రజ్ఞలు తప్ప. ఉ.కొరియా క్రితం నెల జులైలోనే రెండుసార్లు ఖండాంతర బాలిస్టిక్ అణుక్షిపణుల ప్రయోగం చేసి విజయవంతమైంది. దీనిపట్ల అమెరికా వాగార్భాటమే ప్రదర్శిస్తోంది.
ఉత్తర కొరియా ప్రజల పట్ల ట్రంప్ సానుభూతి హాస్యాస్పదం. ఎన్నో పేద దేశాలు ఆసియాలో, ఆఫ్రికాలో వేల లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు ఆకలి దప్పులతో అంతర్యుద్దంలో. ఆ సమస్యలను పట్టుకోకుండా ఉత్తర కొరియా తన సైనిక బలాన్ని గట్టి పరచుకొంటున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక స్థావరాలను అక్కడ బలపరచుకోవడమే అతి ముఖ్యమైన ప్రధానాంశంగా మారింది. రెక్స్ టిల్లెర్సన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి, ఉత్తర కొరియా జరుపుతున్న క్షిపణి పరీక్షలవల్ల శాంతిభంగం కలుగుతున్నందున చైనా, రష్యా దేశాలు ప్రాధమిక ప్రత్యేకమైన బాధ్యతలు తమ భుజస్కంధాలపై వేసుకోవాలని సూచించారు. అత్త మీది కోపం దుత్త మీద అన్న చందం లా ఉంది వారి వ్యవహారం.
ఏదిఏమైనా ఈ రెండు దేశాలు అమెరికా కల్లబొల్లి మాటలను నమ్మడానికివి అరబ్బు దేశాల్లాంటివి కావు. పైగా వీరి దౌత్య ఆటలు అమెరికా ఈలలకు లొంగి ఉండవు. అమెరికా బ్యాడ్ ఎంపైర్ అని ఈ రెండు దేశాలకు బాగా తెలుసు!
చివరిగా: జూలై 4 న అమెరికా తమ దేశ అవతరణ ఆనందోత్సాహాలలో ఉండగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించి విజయం చెందడం వల్ల చెంపదెబ్బ తిన్నట్లైంది. తన ఆగ్రహాన్ని చల్లార్చుకోవడానికి అమెరికా ఉత్తర కొరియా చుట్టూ యూఎస్‌బీ 1 బాంబర్లతో చక్కర్లు కొట్టింది. ఈ డ్రిల్‌లో దక్షిణ కొరియాతో పాటు జపాన్ వంత పాడింది. చైనా తన మాట వినలేదని ట్రంప్ గారు బెంగపడిపోయారు.
ఉత్తర కొరియా ప్రముఖ నేత కిం జోంగ్ ఉన్ తన యుద్ధ రుగ్మత తో అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా అమెరికానే లక్ష్యంగా పెట్టుకొని మంకుపట్టుతో ఉన్నాడన్నది తిరస్కరించ దగ్గ విషయం మాత్రం కాదు. తన దేశ ఆర్థిక స్థితిగతులపై ముఖ్యంగా వ్యవసాయరంగం వైపు కూడా కిం జాంగ్ ఉన్ తన దృష్టిని సారించాలి. ఉత్తర కొరియా ప్రజల జీవితం మాత్రం పూచిన తంగేడు
కాదన్నది నగ్న సత్యం.