Saturday, April 20, 2024

ఆ నలుగురికీ సోకలేదు

- Advertisement -
- Advertisement -

Corona Virus

 

కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్

హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వైరస్ పట్ల హైదరాబాద్ వాసులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. ఇటీవల నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో నలుగురికి ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతో పరీక్షలు చేశారు. అయితే వారికి ఎలాంటి వైరస్ సోకలేదని ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్పమత్తం చేసే క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కరోనా లక్షణాలను పేర్కొంటూ ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేసింది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని 7వ వార్డును(ఐసోలేటెడ్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్ధం చేశారు.

అయితే నగరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానించి వారి నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చిన ఓ యువకుడు అస్వస్థతకు గురికావడంతో అతనని శనివారం రాత్రి ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చి, వైద్య పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేటెడ్ వార్డులో అతడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో 2 అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఐసోలేటెడ్ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికంటే ముందు గా పది రోజుల క్రితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విద్యార్థి దగ్గు, జలుబుతో అస్వస్థతకు గురయ్యాడు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆ విద్యార్థి ఫీవర్ ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షల్లో సాధారణ ఫ్లూగా తేలింది. అతడికి చికిత్స చేసి ఆస్పత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జి చేశారు.

ఆ నలుగురికి కరోనా సోకలేదు : డాక్టర్ శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆదివారం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నలుగురు వ్యక్తులు కరోనా వ్యాధి లక్షణాలతో నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చేరారని, అయితే ఈ నలుగురికి ఆ వ్యాధి లక్షణాలు లేవని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. ఈ నలుగురిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పరీక్షించామని, వారికి జ్వరం, గొంతునొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు లేవని డాక్టర్ చెప్పారు.

కరోనా వైరస్ అంటే ఏంటీ..?
చైనాలోని ఉహాన్ అనే ప్రాంతంలో ఉన్న సముద్ర ఆహార మార్కెట్‌లో కరోనా వైరస్ మొదటగా వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు చేపట్టారు. దీంతో పరిశోధకులు వారికి కొత్త వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. కరోనా అనేది లాటిన్ పదం. కరోనా అంటే కిరీటం అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్‌ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఆ సూక్ష్మ జీవులు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో పరిశోధకులకు కనిపించాయి. దీంతో ఆ సూక్ష్మ జీవులకు కరోనా వైరస్ అని పేరు పెట్టారు.

కరోనా వ్యాధి లక్షణాలు
కరోనా వైరస్ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ సోకిన వారికి మొదటగా జలుబు వస్తుంది. తరువాత జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ముక్కుకారడం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నలతగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైనప్పుడు ఛాతిలో నొప్పి, చలి, జ్వరం, గుండె వేగం పెరగడం, మూత్రపిండాలు వైఫల్యం చెందడం, ఆ తరువాత తీవ్రమైన న్యుమోనియా వస్తుంది. అనంతరం అనారోగ్యం మరింత ఎక్కువై చివరకు ప్రాణాలు కోల్పోతారు. ఈ వైరస్ తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటుంది.

ఎలా వ్యాపిస్తుంది..?
కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకే కాక, జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా వారు ఆరోగ్యవంతమైన వ్యక్తులను స్పృశించినప్పుడు ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కానీ హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగించే పలు మందులు కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తాయని పలువురు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై చైనా ఇప్పటికే పరిశోధనలు కూడా ప్రారంభించింది. అయితే కరోనా వైరస్ సోకిందని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.

నగరానికి చేరుకున్న కేంద్ర వైద్య బృందం
హైదరాబాద్‌లో కరోనా అనుమానిత కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య బృందం నగరానికి చేరుకుంది. ఈ బృందం సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వసతులను పరిశీలించింది. సోమవారం ఆలస్యం కావడంతో మంగళవారం కేంద్ర వైద్య బృందం నగరంలో ఆసుపత్రులను సందర్శించనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫీవర్ ఆసుపత్రి,తరవాత గాంధీ,చెస్ట్ ఆసుపత్రలను కేంద్ర వైద్యుల బృందం సందర్శించనుంది. ఆ బృందంలో ఒక మైక్రో బయాలజిస్టు , ఒక వైద్యుడు , ప్రజారోగ్య నిపుణుడు ఉన్నారు.

మూడు నోడల్ ఆస్పత్రులు
కరోనా వైరస్ నేపథ్యంలో గాంధీ , ఫీవర్ , చెస్ట్ ఆస్పత్రులను నోడల్ ఆస్పత్రులుగా ఏర్పాటు చేశారు. గాంధీలో 40 పడకలు, ఫీవర్‌లో 40, ఛాతీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను కరోనా వైరస్ లక్షణాలున్న వారి కోసం ఏర్పాటు చేశారు. అలాగే గాంధీలో క్రిటికల్ కేర్ యూనిట్‌తో పాటు ఐసియును ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఐసోలేషన్ వార్డులలో పనిజేసే వైద్య సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాల్సిన చెక్ లిస్టును ప్రకటించింది. ప్రస్తుతం నోడల్ ఆస్పత్రులుగా ఎంపిక చేసిన ఆ మూడింట చెక్ లిస్టు ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని కేంద్ర బృందం పరిశీలించనుంది. కాగా, కరోనా వ్యాధిపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరోనాపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అధిక ఉష్ణోగ్రతలో కరోనా కష్టమే
చైనాలో ప్రస్తుతం 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి . గడిచిన 24 గంటల్లో మన రాష్ట్రంలో సగటున 31. 5 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదు అవుతోంది . సాధారణంగా స్వైన్ ఫ్లూ, కరోనా లాంటి వైరస్లు చలి వాతావరణంలో తీవ్రంగా విజృంభిస్తుంటాయి. బాగా వేడి వాతావరణంలో ఇటువంటి వైరస్లు మనుగడలో ఉండవని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా దేశం నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సమాచారం ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే చైనా నుంచి వచ్చి ఇలాంటి లక్షణాలు ఉండి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిందిగా సోమవారం వైద్య ఆరోగ్యశాఖ

ఆదేశాలు జారీ చేసింది. ్ర
పజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు : – డాక్టర్ గడల శ్రీనివాసరావు , ప్రజారోగ్య సంచాలకులు
కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే మూడు నోడల్ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని అన్నారు. కరోనా వైరస్, దాని లక్షణాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Not infected with Corona Virus in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News