Home తాజా వార్తలు త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

 

రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిన రిజర్వేషన్ల జాబితా
రేషన్‌డీలర్లూ పోటీ చేయొచ్చు : ఎస్‌ఇసి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేడో, రేపో నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని జిల్లాల నుంచి వార్డులు, పంచాయతీల వారీగా రిజర్వేషన్ల జాబితా పంచాయతీరాజ్ శాఖకు చేరింది. వాటిని పరిశీలించిన ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. అందుకు అనుగుణంగా జనవరి 3వ తేదీన లేదా అంతకంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తును పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఎన్నికల నిర్వహణ కోసం రూ.50 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలలు జరగనున్నాయి. ఒక విడత నుంచి మరొ విడతకు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం ఉండవచ్చు. గణతంత్ర దినోత్సవం కంటే ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జనవరి 10వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ రిజర్వేషన్ల ప్రకియపై గందరగోళం నెలకొనడంతో వాటిని సరిచేసుకునేందుకు సమయం పట్టింది. అన్ని జిల్లాలలోని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్లు పూర్తి చేసి పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు సోమవారం జాబితాను పంపించారు. ఈ వివరాలను తెలియజేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అందుకు అనుగుణంగా 12,734 గ్రామ పంచాయతీలు, 1,13,354 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. పంచాయితీ ఎన్నికల్లో మొత్తం 1,49,73,000 ఓటర్లు ఉన్నారు.
వేలం వేస్తే విచారణ
గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఖర్చు వివరాలను సమర్పించనందుకుగాను సర్పంచ్‌గా పోటీ చేసిన 12,716 మంది అభ్యర్థులు ఈసారి పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ‘మన తెలంగాణ’కు తెలిపారు. రేషన్ డీలర్లు ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యబద్దంగా సర్పంచ్, వార్డ్ మెంబెర్‌ల ఎన్నికల ఏకగ్రీవం అయితే ఇబ్బంది లేదని, వేలం వెయ్యడం, భయబ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసినట్లు అయితే కలెక్టర్ విచారణ జరపాల్సి ఉంటుందని ఎస్‌ఇసి ప్రకటించింది. ఇప్పటివరకు 30 సర్పంచ్ గుర్తులు, 20 వార్డు సభ్యుల గుర్తులు సిద్ధంగా ఉంచామని, ఇంకా కావాలి అంటే సిద్ధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఒక గుర్తును పోలి మరో గుర్తు లేదని ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌటింగ్ పక్రియ ప్రారంభమవుతుందని, అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందన్నారు. ఇందుకోసం 95 వేల బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర స్పెషల్ పార్టీ పోలీస్ లను విధుల్లో ఉంచుతున్నారు. 5 వేల పైన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌కి రూ. 2.50 లక్షలు, 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో 1.50 లక్షలు, 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న వార్డ్ మెంబర్‌కు రూ. 50 వేలు వ్యయ పరిమితి, 5 వేలు కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో రూ. 30 వేల ఎన్నికల వ్యయపరిమితి ఉంది.

Notification for Panchayat elections 2019 soon